అహంకారానికి పరాకాష్ట కుప్పం దుర్మార్గం
posted on Jan 8, 2023 9:41AM
రాజకీయాల్లో బండ్లు ఓడలు,ఓడలు బండ్లు కావడం పెద్ద విషయం కాదు. అందుకు కళ్ళ ముందే కావలసినన్ని ఉదాహరణలున్నాయి. అధికారం అండ చూసుకుని తప్పులు చేసుకుంటూ పోయే పాలకులు ఏదో ఒక రోజున అందుకు మూల్యం చెల్లించక తప్పుదు. తనకు పుత్రభిక్ష పెట్టమని వేడుకున్న సోదరి సాత్వతికి ఇచ్చిన మాటకు కట్టుబడి శ్రీ కృష్ణ పరమాత్మ, శిశుపాలుని వంద తప్పుల వరకు క్షమించాడు. అయితే, అహంకారంతో విర్రవీగిన శిశుపాలుడు తనకు తిరుగులేదని తప్పు మీద తప్పు చేసుకుంటూ పోయాడు. భోజ రాజుల్ని చంపి, వసుదేవుడు యజ్ఞాన్ని అడ్డుకుని అశ్వాన్ని దొంగలించడమే కాదు, దాన్ని కూడా సంహరించాడు. కృష్ణుడు లేని సమయంలో ద్వారకకు నిప్పంటించడమే కాదు, రుక్మిణిని వివాహం చేసుకోవాలని చూశాడు. బభ్రువు భార్యని అపహరించి తనదాన్ని చేసుకున్నాడు. ఇన్ని ఘోరాలు జరిగినా కృష్ణుడు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాడు.
కానీ చివరకు ఏమి జరిగింది .. ధర్మరాజు ఆహ్వనం మేరకు ఆయన తలపెట్టిన రాజసూయ యాగానికి వచ్చిన శిశుపాలుడు చేయరాని చివరి తప్పు చేశాడు.తొలి అర్ఘ్యానికి శ్రీకృష్ణుడే అర్హుడని భీష్ముడు చేసిన నిర్ణయాన్ని అహంకారంతో తూల నాడాడు .. గొల్లవాడు పూజ్యుడెలా అవుతాడని నోటికి వచ్చినట్లు క్రిష్ణుడిని మాట్లాడి అవమానించాడు. భీష్మ పితామహుని తప్పుబట్టి ధర్మరాజుని దుయ్యబట్టాడు. దీంతో భీముడు, సహదేవుడు ఆవేశ పడితే భీష్ముడు వారిని వారించాడు. దీంతో శ్రీకృష్ణుడు సభ నుద్దేశించి శిశుపాలుడి తల్లికిచ్చిన మాట ప్రకారం ఇంతవరకు అతడి అపరాధాలను మన్నించాను. నేటితో నూరు తప్పులు పూర్తయ్యాయి, కాబట్టి సహనం వహించిన నేను ఈ మూర్ఖుడిని ఇప్పుడే శిరచ్చేధం ద్వారా సంహరిస్తా నని సుదర్శన చక్రం ప్రయోగించి శిశుపాలుని శిరస్సు ఖండించాడు. అది ద్వాపర యుగం నాటి కథ.
ఇది కలియుగం. యుగం ఏదైనా కాలం ఏదైనా అహంకారంతో విర్రవీగే వారు ఎవరైనా చివరకు సిక్ష అనుభవించక తప్పదు. ముఖ్యంగా అధికారం శాశ్వతం అనుకుని విర్రవీగే పాలకుల తప్పులను ప్రజలు ఎప్పటికప్పడు లెక్కిస్తూనే ఉంటారు. ఐదేళ్ళు వరకు పాలకుల తప్పులను భరిస్తారు .. మన్నిస్తారు.ఆ గీత దాటిన తర్వాత వేటు వేస్తారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పుడుదే జరుగుతోంది. ప్రజలు ఇచ్చిన తీర్పును తప్పుగా అర్థం చేసుకున్న వైసీపీ ప్రభుత్వ వరసగా తప్పులు చేసుకుంటూ పోతోంది. నిజానికి వైసీపీ ప్రభుత్వం తప్పులు ఎప్పుడోనే గీతను దాటాయి .. ఇప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు ప్రమాద స్థాయినీ దాటి పోయాయి. ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.
మూడున్నరేళ్ళలో టన్నుల కొద్దీ తప్పులు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఇప్పడు, ప్రజలు, ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు జీఓ1, తెచ్చింది. ప్రతిపక్ష గళం వినిపించకుండా చేసేందుకు సభలు, సమావేశాలు, రోడ్ షో ల పై నిషేధం విధించి. ఇందులో భాగంగానే కుప్పంలో మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సభలను అడ్డుకోవడమే కాకుండా, అవమానించింది.
పోలీసులు చిత్రంగా చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా వినని విధంగా మహిళలు తమపై హత్యాయత్నం చేశారని కేసులు పెట్టారు. నిజానికి, ఇది శిశుపాలుడు చేసిన చివరి తప్పును మించిన దుర్మార్గం. బ్రిటిష్ కాలంలో కూడా పోలీసులు ఇంత దుర్మార్గానికి ఒడి కట్టలేదు. అందుకే, ఇప్పుడు ప్రజలు సుదర్శన చక్రం, ప్రజాస్వామ్య వజ్రాయుధం సిద్దం చేసుకుంటున్నారు .. ఎన్నికల సుముహుర్తం కోసం ఎదురు చూస్తున్నారు.