సోనియాపై కేటీఆర్ విమర్శలు.. ఖబర్దార్ అంటున్న కాంగ్రెస్

 

 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నాలుగేళ్లు దాటింది.. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వడం, కేసీఆర్ కుటుంబంతో సహా వెళ్లి సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలపడం, అలానే సోనియాను అమ్మగా అభివర్ణించడం తెలిసందే.. ఇదంతా అప్పటి మాట.. ఇప్పుడు పరిస్థితులు మారాయి.. తెలంగాణలో తెరాస అధికారంలో ఉంటే, కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది.. ఇరు పార్టీ నేతలు ఒకరిమీద ఒకరు తీవ్రంగా విమర్శలు చేసుకుంటున్నారు..

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఈ విమర్శల తీవ్రత మరీ ఎక్కువవుతుంది.. నిన్న తెలంగాణ భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. 'తెలంగాణ ఇచ్చింది అమ్మా కాదు, బొమ్మా కాదు.. ప్రజలు కొట్లాడి గుంజుకుంటేనే తెలంగాణ వచ్చింది.. రాష్ట్రం ఇవ్వకపోతే ప్రజలు తంతారన్న భయంతో విధిలేని పరిస్థితుల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చింది’  అంటూ సోనియా గాంధీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి..

ఈ వ్యాఖ్యలుపై స్పందించిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్ కేటీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.. ‘నీ ఇంటికే వస్తా.. తాడోపేడో తేల్చుకుంటా ఖబర్దార్, కేటీఆర్ నీవెంత ..నీ స్థాయి ఎంత?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు..సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ దుకాణం ఎక్కడుండేదని నిలదీసిన వీహెచ్, ‘కేసీఆర్..నీ కుమారుడిని అదుపులో పెట్టుకో’ అంటూ హెచ్చరించారు.