షాక్ ల మధ్య కాస్త ఊరట.. టీడీపీలోకి కోట్ల

 

ఎమ్మెల్యేలు, ఎంపీల జంపింగులతో షాక్ లో ఉన్న టీడీపీకి ఇది కాస్త ఊరట కలిగించే న్యూస్ అనే చెప్పాలి. కర్నూలు జిల్లాకు చెందిన కోట్ల ఫ్యామిలీ త్వరలోనే టీడీపీలో చేరనుంది. ఈ విషయాన్ని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తనయుడు కోట్ల రాఘవేంద్రరెడ్డి వెల్లడించారు. జిల్లాలోని కోడుమూరులో కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వచ్చిన కోట్ల రాఘవేంద్రరెడ్డి.. త్వరలోనే కోట్ల కుటుంబం టీడీపీలో చేరబోతోందని తెలిపారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారని.. అందుకే తాము టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నామని ఆయన వివరించారు. రాబోయే ఎన్నికల్లో తాను కూడా పోటీ చేయబోతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని రాఘవేంద్రరెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల్లో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, సుజాతమ్మలను గెలిపించుకోవడమే లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు. కోట్ల రాఘవేంద్రరెడ్డి మాటలను బట్టి కర్నూలు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, ఆయన భార్య కోట్ల సుజాతమ్మ రాబోయే ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. అయితే వారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. కోట్ల కుటుంబానికి కర్నూలు ఎంపీ స్థానంతో పాటు ఆలూరు ఎమ్మెల్యే సీటును కేటాయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.