19న మంత్రివర్గ విస్తరణ.. మంత్రిగా టీడీపీ ఎమ్మెల్యే సండ్ర!!

 

తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19న ఉదయం 11.30 గంటలకు ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను కేసీఆర్ కలిసి మంత్రివర్గ విస్తరణపై చర్చించారు. అనంతరం మంత్రుల ప్రమాణస్వీకారంపై ప్రకటన వెలువడింది. ఈనెల 19న మాఘశుద్ధ పౌర్ణమి కావడంతో ఉ.11.30కి రాజ్‌భవన్‌లో మంత్రుల ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు దక్కుతుంది అంటూ పలువురు టీఆర్ఎస్ నేతలు పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అనూహ్యంగా ఓ టీడీపీ ఎమ్మెల్యే పేరు కూడా తెరమీదకు వచ్చింది.

ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ఏపీ ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం నెల రోజుల్లో బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. అయితే నెల రోజులు దాటినా.. ఆయన బాధ్యతలు తీసుకోకపోవడంతో ఏపీ ప్రభుత్వం ఆయన నియామకాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున తెలంగాణ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరైన సండ్ర.. అధికార టీఆర్ఎస్‌లోకి వెళతారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని సండ్ర ఖండించలేదు. ఆయన అనుచరుల మాత్రం సండ్ర టీఆర్ఎస్ వైపు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చర్చించుకుంటున్నారు. మరోవైపు తెలంగాణ కేబినెట్ విస్తరణ జరుగుతుందన్న తరుణంలో సండ్ర టీటీడీ సభ్యత్వం రద్దు కావడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సండ్రకు తెలంగాణ కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉందన్న సమాచారంతోనే ఏపీలోని టీడీపీ ప్రభుత్వం ఆయన టీటీడీ పాలకమండలి సభ్యత్వాన్ని రద్దు చేసిందనే ప్రచారం సాగుతోంది. మరికొందరైతే సండ్ర టీఆర్ఎస్ లో చేరడం ఖాయం కానీ.. మంత్రి పదవి మాత్రం కష్టం అంటున్నారు. సండ్రకు మంత్రి పదవి కాకపోయినా కీలకమైన పదవి దక్కే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది. మరి సండ్ర టీఆర్ఎస్ లో చేరతారా? ఆయనకు మంత్రి పదవి దక్కుతుందా? తెలియాలంటే కొద్దిరోజులు వేచిచూడాల్సిందే.