తమ్ముడి పెత్తనం- అన్న అలక!
posted on Apr 8, 2025 7:19AM

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి కొండ్రు మురళీ మెహన్ తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న దళిత నాయకుడు. ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గంగా ఉన్న రాజంతో పాటు, గతంలో పోటీ చేసిన ఎచ్చెర్ల నియోజకవర్గంలో కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. నిరంతరం యాక్టివ్ పాలిటిక్స్ నడిపించే ఆ లీడర్ ఇప్పుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారంట. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎస్సీ కోటాలో మంత్రి పదవి వస్తుందని కొండ్రు గంపెడు ఆశపెట్టుకున్నారు. కానీ అయన ఆశలు అడియాశలైయ్యాయి. మంత్రి వర్గంలో చోటు దక్కక పోవడంతో ఆయన తీవ్ర నిరాశకు గురవుతున్నారంట.
కొండ్రు మురళి మంత్రి వర్గం ఏర్పాటు తరువాత రాజాం నియోజకవర్గానికి రాకపోకలు తగ్గించేశారంట. ఎక్కువగా విశాఖపట్నానికే పరిమితమవుతున్నారంట. మంత్రి పదవి రాకపోవడంతో సొంత వ్యాపారాలు చూసుకోవడంలో కొండ్రు బిజీ అయ్యారట. దాంతో ఎమ్మెల్యే కొండ్రు మురళి మెహన్ తమ్ముడు కొండ్రు జగదీష్ రాజాంలో అన్నీ తానే అయి వ్యవహరిస్తున్నారంట. రాజాం నియోజకవర్గంలో ట్రాన్స్‌ఫర్స్ మెదలు, వర్క్స్ కేటాయింపు వరకూ అన్నీ కొండ్రు జగదీష్ చేతుల మీదుగా నడుస్తున్నాయన్న టాక్ వినిపిస్తోంది.
అధికారులు సైతం అతనికే వంత పాడుతున్నారట. ఆ క్రమంలో కొండ్రు జగదీష్‌కు షాడో ఎమ్మెల్యే అన్న ట్యాగ్ తగిలించేస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో సైతం షాడో ఎమ్మెల్యే పెత్తనమే నడుస్తోందంట. ఆయనే అధికారులతో ఫోన్ మాట్లాడటం, క్యాంప్ ఆఫీస్‌కు పిలిపించుకుని అవసరమై ఆదేశాలు జారీ చేస్తుండటం స్థానికులను విస్తుపోయేలా చేస్తోంది. రాజకీయ వ్యవహారాలు చక్కబెట్టడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో సమీక్షలు నిర్వహించడం, అధికారుల సీట్లో కూర్చుంటూ ఆదేశాలు జారీ చేస్తుండటంతో కొండ్రు జగదీష్‌పై అధికారులు అసహనంతో కనిపిస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన అన్న అందుబాటులో లేకుండా పోవడం, తమ్ముడి పెత్తనంతో అధికార యంత్రాంగం తలలు పట్టుకోవాల్సి వస్తోందంట.