బస్సుల్లో సీసీటీవీ కెమెరాలు

 

మృగాళ్ళ బారి నుంచి మహిళలకు భద్రత కల్పించడానికి ప్రభుత్వాలు ఎంత పకడ్బందీగా వ్యవహరిస్తున్నా మహిళల భద్రత ప్రశ్నార్థకంగానే వుంటోంది. తాజాగా మహిళల భద్రత కోసం కోల్‌కతా ఆర్టీసీ ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. జేఎన్ఎన్‌యుఆర్ఎం ఆధ్వర్యంలో నడిచే 632 బస్సుల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసింది. ఒక్కొక్క బస్సులో మూడు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటిలో రెండు బస్సు ముందు భాగంలో, ఒకటి వెనుక భాగంలో అమర్చి వుంటాయి. మహిళలతో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, దొంగతనాలకు పాల్పడినా కెమెరాల్లో రికార్డైన్ ఫుటేజ్ ఆటోమేటిగ్గా ఆర్టీసీ కార్యాలయానికి చేరిపోతుంది. దీనివల్ల మహిళల మీద జరిగే దౌర్జన్యాలను కొంతవరకు నివారించవచ్చని భావిస్తున్నట్టు కోల్‌కతా ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.