చంద్రబాబు... జూ.ఎన్టీఆర్ కాళ్లు పట్టుకున్నారా? 

 

చంద్రబాబు అండ్ లోకేష్ పై కొడాలి నాని మాటల తూటాలు కొనసాగుతున్నాయి. తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతోన్న కొడాలి నాని... మరోసారి తన నోటికి పనిచెప్పారు. అసలు చంద్రబాబు, లోకేష్ పేరు ఎత్తుతూనే ముందొక తిట్టు... వెనుకొక తిట్టు జోడిస్తున్నారు. మంత్రిగా ఉంటూ అలా మాట్లాడటం తప్పు కాదా అంటే... దానికి సమాధానం చెబుతున్నారు. మరి, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిందేమిటని ఎదురు ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా ఆనాడు మంత్రులతోను, టీడీపీ ఎమ్మెల్యేలతో తమను చంద్రబాబు తిట్టించలేదా అంటున్నారు. అచ్చెన్నాయుడు, బోండా ఉమ, చింతమనేని... ఇలా పలువురు నేతలు... ఏకంగా అసెంబ్లీలోనే జగన్మోహన్ రెడ్డిని, తనను బూతులు తిట్టారని, అప్పుడెందుకు వాళ్లను ప్రశ్నించలేదని రివర్స్ కౌంటరిస్తున్నారు. 

అయితే, తాజాగా కొడాలి నాని మరో సీక్రెట్ ను బయటపెట్టారు. 2009లో తనకు, వల్లభనేని వంశీకి సీట్లు ఇచ్చింది చంద్రబాబు కాదని.... జూనియర్ ఎన్టీఆర్ అని కొత్త బాంబు పేల్చారు. తనకు, వల్లభనేని వంశీకి టికెట్లు ఇప్పించడానికి చంద్రబాబుతో ఆనాడు జూనియర్ ఎన్టీఆర్ ఫైట్ చేశాడని, అందుకే ఇప్పటికీ తాము ఎన్టీఆర్ కుటుంబానికి కృతజ్ఞతతో ఉన్నామన్నారు. అయితే, చంద్రబాబులాగా... తాము జూనియర్ ఎన్టీఆర్ కాళ్లు మాత్రం పట్టుకోలేదని మంత్రి కొడాలి నాని అన్నారు. 2009 ఎన్నికల్లో ప్రచారం చేయాలంటూ చంద్రబాబు.... జూనియర్ ఎన్టీఆర్ కాళ్లు పట్టుకున్నారని అప్పటి పరిస్థితులను చెప్పుకొచ్చారు. అయితే, ఆ తర్వాత లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను చంద్రబాబు దూరం పెట్టారన్న కొడాలి నాని.... ఎన్టీఆర్ పేరు చెప్పకుండా ఎన్నికలను ఎదుర్కొనే దమ్ము చంద్రబాబుకి ఉందా అంటూ సవాలు చేశారు.

ఇక, జగన్ క్రిస్టియానిటీ విమర్శలపైనా కొడాలి డిఫరెంట్ గా స్పందించారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి తిరుమల వెళ్లడానికి డిక్లరేషన్ ఎందుకివ్వాలో చంద్రబాబు చెప్పాలన్నారు. జగన్ ఒక మతానికో... ఒక కులానికో... ముఖ్యమంత్రి కాదని డిక్లరేషన్ ఇవ్వడానికి అన్నారు. అయినా, వెంకటేశ్వరస్వామి కుల దైవమని చెప్పుకునే చంద్రబాబు... ఒక్కసారైనా... తిరుమల కొండపై గుండు చేయించుకున్నారా అంటూ ప్రశ్నించారు. ఓటమిని జీర్జించుకోలేకే మతం పేరుతో కుట్రలు చేస్తున్నారని కొడాలి నాని మండిపడ్డారు. తిరుమల లడ్డూను మద్యాన్ని ఒకేలా పోల్చినందుకు... అలిపిరి దగ్గర కొండకు తల బాదుకుని క్షమాపణ చెప్పాలని కొడాలి నాని డిమాండ్ చేశారు.