సీపీఎం కార్యాలయంలో తనిఖీ..సీఎం ఫైర్

 

కేరళలోని తిరువనంతపురంలో గల సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో తనిఖీలు నిర్వహించిన సీనియర్‌ పోలీసు అధికారి ఛైత్ర థెరెసా జాన్‌ పై సీఎం విజయన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెపై విచారణకు ఆదేశించారు. ఈ నెల 24వ తేదీన ఆమె ఈ తనిఖీలు నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే...గతంలో ఒక పోలీస్ స్టేషన్‌పై రాళ్లు రువ్విన ఘటనలో నిందితులైన సీపీఎం యూత్‌ వింగ్‌ నేతలు పార్టీ ఆఫీసులో ఉన్నట్లు ఛైత్రకు సమాచారం అందటంతో... వెంటనే ఆమె అక్కడకు చేరుకొని సోదాలు నిర్వహించారు. ఈ ఘటనపై విజయన్ ఫైర్ అయ్యారు. ఇలా పార్టీ ఆఫీసులపై సోదాలు నిర్వహించడం ఆనవాయితీ కాదని మండిపడ్డారు. తమను అప్రతిష్టపాలు చేసేందుకు తమపై కేసులు పెట్టి ఇటువంటి దాడులు చేయిస్తున్నారని విజయన్‌ వ్యాఖ్యానించారు. వెంటనే దీనిపై శాఖాపరమైన విచారణ జరపాలని డీజీపీని ఆదేశించారు. కాగా ఈ వ్యవహారంపై  ఛైత్రను ఉన్నతాధికారులు విచారించారు. దాదాపు రెండు గంటలపాటు విచారించిన అనంతరం.. ఆమెకు క్లీన్‌ చిట్‌ ఇచ్చారు. జనవరి 24న కొంత మంది చేసిన పిర్యాదు మేరకే చైత్ర అక్కడకు చేరుకొని సోదాలు చేశారని వెల్లడించారు. విధుల్లో భాగంగానే తనిఖీలు చేశరు తప్ప ఎటువంటి నిబంధనలను అతిక్రమించలేదని తేల్చిచెప్పారు.