భూమిపై సుప్రీం కోర్టులో కేంద్రం పిటిషన్
posted on Jan 29, 2019 11:43AM
వివాదాస్పద రామజన్మభూమి- బాబ్రీ మసీదు కేసులో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య రామ జన్మభూమిపై సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. వివాదంలో లేని 67 ఎకరాల భూమిని అసలైన యజమానులకు అప్పగించేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రం సుప్రీంకోర్టును కోరింది. రామ జన్మభూమికి సమీపంలో వివాదంలో లేని ప్రాంతాన్ని దాని యజమాని అయిన రామ జన్మభూమి నయాస్ లేదా రామాలయానికి సంబంధించిన ట్రస్టుకు అప్పగించేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రామ జన్మభూమి-మసీదు వివాదాస్పద ప్రాంతం 2.77ఎకరాలు కాగా 1991లో ప్రభుత్వం దాంతోపాటు వివాదాస్పద స్థలం చుట్టూ ఉన్న 67 ఎకరాలను కూడా స్వాధీనం చేసుకుంది. అయితే ఈ 67 ఎకరాల భూమిలో తమ అనుమతి లేకుండా ఎలాంటి పనులు చేపట్టరాదని గతంలో సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా గతంలో ఇచ్చిన ఉత్తర్వులను తొలగించి యజమానులకు 67 ఎకరాల భూమిని అప్పగించాలని సుప్రీం కోర్టుకు కేంద్రం ప్రభుత్వం విన్నవించింది. ఇదిలాఉంటే వివాదాస్పద భూమిని మూడు పార్టీలు సున్ని వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖారా, రామ్ లల్లా సమానంగా పంచుకోవాలని 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. అయితే ఆ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంలో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై సుప్రీంలో విచారణ ఇప్పటికీ కొనసాగుతోంది.