వైఎస్ వోక్స్ వ్యాగన్ పోగొట్టారు.. మేం కియా తెచ్చాము

 

ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక రంగానికి గర్వకారణమైన అద్భుత ఘట్టం ఆవిష్కరణకు రంగం సిద్ధమైంది. అనంతపురం జిల్లా.. ఇకపై కార్ల తయారీ కేంద్రంగా ఖ్యాతిగాంచనుంది. కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తరువాత రాష్ట్రంలో ఏర్పాటైన దక్షిణ కొరియాకు చెందిన ప్రతిష్ఠాత్మక కియా మోటార్స్‌ కార్ల పరిశ్రమ నుంచి తొలికారు మంగళవారం బయటకు రానుంది.

దేశంలో తొలి ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని భావించినప్పుడు కియా ప్రతినిధులు వివిధ రాష్ట్రాలను పరిశీలించారు. ఇందులో భాగంగా 2016లో పలు దఫాలు అనంతపురం జిల్లాకూ వచ్చారు. భూముల కోసం అన్వేషణ చేశారు. అటు పొరుగునే ఉన్న కర్ణాటక, తమిళనాడుతోపాటు, మహారాష్ట్ర, ఉత్తర్‌ ప్రదేశ్‌, గుజరాత్‌ వంటి రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా కియాను తమ రాష్ట్రానికి తీసుకెళ్లేందుకు విశ్వప్రయత్నాలు చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, ప్రత్యేక చొరవ చూపి ‘కియా మోటార్స్‌’ను అనంతపురానికి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. 

మంగళవారం టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నేడు కియా తొలికారు ఆవిష్కరణ నేపథ్యంలో చంద్రబాబు కియా గురించి మాట్లాడారు. మోదీ వల్లే కియా వచ్చిందని బీజేపీ అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రానికి పెట్టుబడుల కోసం కాలికి బలపం కట్టుకుని తిరిగానన్నారు. మొదట గుజరాత్, తమిళనాడును కియా కోసం సిఫారసు చేసిందని, అయితే అవినీతి రహిత రాష్ట్రమనే ఏపీకి కియా వచ్చిందని పేర్కొన్నారు. అవినీతిరహిత రాష్ట్రాలలో మూడవ స్థానంలో ఏపీ ఉందని సీఎం చెప్పుకొచ్చారు.
 
కియా పరిశ్రమ ద్వారా రూ.13,500కోట్ల పెట్టుబడులు, అనుబంధ విద్యుత్‌ కార్ల పరిశ్రమతో మరో రూ.3వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్నారు. కియా ద్వారా 11వేల మందికి, అనుబంధ పరిశ్రమల ద్వారా 4వేల మందికి ఉపాధి కలుగనుందని తెలిపారు. ఏడాదికి సగటున 3 లక్షల కార్ల తయారీ చారిత్రాత్మకమని అన్నారు. వైఎస్, బొత్స వోక్స్ వ్యాగన్ కార్ల పరిశ్రమను పోగొట్టారని, ముడుపుల కోసం అధికారులను జైలుపాలు చేశారని విమర్శించారు. కానీ తాము మాత్రం కియా తెచ్చి తొలి కారును విడుదల చేస్తున్నామన్నారు. అదే టీడీపీకి, వైసీపీకి ఉన్న తేడా అని చంద్రబాబు అన్నారు.