కేసీఆర్ అంతన్నారు ఇంతన్నారు..చివరికి తుస్సుమని పించారు!
posted on Apr 29, 2022 10:38AM
కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. అంతన్నారు.. ఇంతన్నారు.. చివరికి ప్లీనరీ వేదికగా చేసిన ప్రసంగంలో తుస్సు మనిపించారు. ఫ్రంట్ లేదు, కూటమి లేదు.. ప్రాంతీయ పార్టీల ఐక్యత ఊసూ లేదు. మరి ఇంత కాలం ఆయన చెప్పిన మాటలు, తిరిగిన తిరుగుళ్లు, బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీలు అంతా తుస్సేనా.. తెరాస క్యాడర్ ను కూడా ఇదే అనుమానం తొలుస్తున్నది.
బీజేపీ మంత్రుల అవనీతి చిట్టా ఉందన్న ఆయన ప్లీనరీ వేదికపై ఆ మాటే ఎత్తలేదు. తిమ్మిని బమ్మిని చేసిన చందంగా జాతీయ స్థాయి అజెండా అంటూ కొత్త పల్లవి ఎత్తుకున్నారు. అది కూడా కేవలం బీజేపీపై విమర్శలు, ఆరోపణలు, తన పాలనపై పొగడ్తల పొగడ దండలు వినా ప్లీనరీలో ఆయన చేసిన ప్రసంగంలో పసా లేదు, విషయమూ లేదు.
జాతీయ స్థాయిలో బీజేపీయేతర, కాంగ్రెసేతర ఫ్రంట్ సహా కేంద్రంలో తాను చక్రం తిప్పేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ఇచ్చిన బిల్డప్ అంతా కేసీఆర్ ప్లీనరీ ప్రసంగంతో తుస్సు మనిపోయింది. కారణం ఏమిటి? అటు జాతీయ స్థాయిలోనూ, ఇటు రాష్ట్రంలోనూ కూడా రాజకీయ పరిస్థితులు అనువుగా లేవన్న గ్రహింపుతోనే కేసీఆర్ గత గంభీర ప్రకటనల ఊసెత్తకుండా, కొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చి, తన మాటల గారడీతో ప్రజలలో తన గత ప్రకటనల ప్రభావాన్ని తుడిపేయడానికి ప్రయత్నించారు.
ప్లీనరీ సమావేశంలో కేసీఆర్ ప్రసంగంలో బీజేపీవై విర్శలు, ఆరోపణలు కూడా ఏదో చేయకపోతే బాగుండదు, ఇంత కాలం ఆ పార్టీపై ఒంటికాలిపై లేచి ఇప్పుడు అసలు ఊసే ఎత్తకపోతే జనం సందేహిస్తారు అన్నట్లుగానే ఉన్నాయి.
ప్లీనరీలో కేసీఆర్ ప్రసంగంలో మెరుపులు లేదు, సంచలన ప్రకటనలు లేవు, నిర్ణయాలు లేవు..కేవలం ఫ్రంటు, కూటమి, పార్టీ వంటివేమీ లేవన్న వివరణ ఇచ్చుకోవడానికే అన్నట్లుగా ఆయన ప్రసంగం సాగింది. అలాగే జనం దృష్టిని రాజకీయ అంశాలపై నుంచి తెరాస వైపు తిప్పుకునేందుకే ఇప్పటికిప్పుడు హడావుడిగా ప్లీనరీ పెట్టారా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఆవిర్భావ సభను ఘనంగా జరుపుకోవచ్చు. ఉద్యమ సమయంలో పార్టీ త్యాగాలను, పోరాట సంకల్పాన్ని మరోసారి వల్లె వేసి ప్రజల్లో ఉద్వేగాలను పదిలంగా కాపాడుకోవచ్చు. అంతే కానీ ప్లీనరీ నిర్వహించాల్సిన అవసరం లేదు. కానీ ఆరు నెలల వ్యవధిలోనే కేసీఆర్ ప్లీనరీ ఏర్పాటు చేశారు.
జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ కోసం కేసీఆర్ స్వయంగా తమిళనాడు, మహారాష్ట్ర, ఝార్ఖండ్, డిల్లీ లకు ఇటీవల వెళ్ళారు. ఒక్క డిల్లీ సిఎం మినహా... మిగతా వారిని కలిశారు. దేశ రాజకీయ పరిస్థితులు, సమాఖ్య స్పూర్తి, రాష్ట్రాల హక్కులు, ప్రాంతీయ పార్టీలు కలిసి పనిచేయాల్సిన అవరసరం వంటి విషయాలపై చర్చించారు. తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించారు. కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. బిజెపిని బంగాళాఖాతంలో కలిపేయ్యాలని సిఎం కెసిఆర్ నినదించారు. బిజెపికి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీయేతర కూటమిని ఏర్పాటుకు సంకేతాలిచ్చారు. ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. అంతకుముందు 2019లోనూ వెస్టుబెంగాల్ కు వెళ్ళిన సిఎం కెసిఆర్ తర్వాత ఇతర నాయకులను కలిశారు. పలు రాజకీయ అంశాలపై చర్చించారు. ప్రకటనలు కూడా చేశారు. అనంతరం ఈ విషయాలు ప్రక్కకు పెట్టారు. రెండేండ్లు గడిచాయి. ఇటీవల కూడా పలు రకాలుగా జాతీయ రాజకీయాలపై ప్రకటనలు చేశారు. కానీ, అవేవీ కార్యరూపంలోకి రాలేదు. దీంతో టిఆర్ఎస్ ప్లీనరీలో ఫ్రంట్ లేదు. కూటమి లేదు. గుంపు కూడా లేదు. దేశానికి ప్రత్యేకంగా ఓ ఎజెండా కావాలి. ప్రత్యేక రైతు, పారిశ్రామిక విధానం రావాలి. అంటూ తేల్చాశారు. దేశ్ కీ నేతా స్థాయిలో ప్రచారం చేసుకున్న కేసీఆర్ హఠాత్తుగా ఆస్త్ర సన్యాసం చేయడమేమిటి? అన్న చర్చ ప్లీనరీ ప్రసంగం తరువాత తెరాస శ్రేణుల్లో మొదలైంది.
దేశ్ కీ నేత కెసిఆర్ అనే ప్లెక్సీలు ఇతర రాష్ట్రాల్లోనూ వెలిశాయి. కానీ, దేశంలో కూటమి లేదు. ఫ్రంటులేదు. గుంపు లేదు. అని సిఎం కెసిఆర్ తేల్చిచెప్పడం వెనుక అసలు కారణమేంటి..? అనే సందేహం ఇప్పుడు పార్టీ శ్రేణుల్లోనే కాదు, రాష్ట్ర ప్రజానీకంలో కూడా వ్యక్తమౌతోంది. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే మాట నుంచి దేశానికి కొత్త ఎజెండా కావాలి అనే జనరలైజ్ స్టేట్ మెంట్ అధినేత కెసిఆర్ నోట వెంట రావడం రాజకీయ విశ్లేషకులను సేతం విస్మయ పరిచింది. కోటలు దాటిన తన మాటలు గడప కూడా దాటకపోవడంపై ప్రజలు నొసలు చిట్లించకుండా ఉండేందుకు, వారి దృష్టిని తెరాస వైపు తిప్పుకునేందుకు కేసీఆర్ చేసిన ప్రయత్నంగా ఆయన ప్లీనరీ ప్రసంగాన్ని చూడాల్సి ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.