కేసీఆర్ తో జార్ఖండ్ సీఎం భేటీ...అజెండాయా? ఫ్రంటా?
posted on Apr 29, 2022 11:07AM
జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ గురువారం సాయంత్రం తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలు విఫలమైన తరువాత కేసీఆర్ ఫ్రంటూ లేదు గింటూ లేదంటూ నిర్వేదం వ్యక్తం చేసిన సంగతి విదితమే. ఆ తరువాత జాతీయ స్థాయిలో కొత్త పార్టీ అంటూ ప్రకటించారు. అయితే బుధవారం నాడు జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో కేసీఆర్ దేశ రాజకీయాలకు కొత్త అజెండా అవసరమని తేల్చేసి కొత్త పార్టీ ఏర్పాటు ఊసే ఎత్తలేదు.ఈ నేపథ్యంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ కేసీఆర్ తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేసీఆర్ రాజకీయ వ్యూహాలపై మరోసారి చర్చకు ఈ భేటీ తెరలేపింది. సాధారణంగా కేసీఆర్ లేదంటే ఉందని అర్ధమని పరిశీలకులు అంటుంటారు. ఆ నేపథ్యంలోనే జాతీయ స్థాయిలో పార్టీ, ఫ్రంట్ లేదని, జాతీయ అజెండాయే ప్రస్తుతం దేశానికి అవసరమని ప్రకటించి ఒక రోజు కూడా పూర్తిగా గడవక ముందే హేమత్ సొరేన్ తో కేసీఆర్ భేటీ కావడంపై పరిశీలకులు పలు రకాలుగా విశ్లేషణలు చేస్తున్నారు. ఏది ఏమైా ప్రగతి భవన్ లో జరిగిన ఈ భేటీలో ఇరువురి మధ్యా జాతీయ రాజకీయాలపై చర్చ జరిగినట్లు భావిస్తున్నారు. దేశానికి కొత్త రాజకీయ అజెండా అవసరమని కేసీఆర్ ప్రకటించిన మరుసటి రోజే జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ ఆయనతో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరువురి మధ్యా రాష్ట్రాల పట్ల బీజేపీ అనుసరిస్తున్న వైఖరి, రానున్న ఎన్నికలు, జాతీయ స్థాయిలో అనుసరించాల్సిన విధానం తదితర అంశాలపై చర్చ జరిగినట్లు భావిస్తున్నారు. కూటమి, పార్టీ లేవని కేసీఆర్ స్పష్టం చేసిన తరువాత జార్ఖండ్ సీఎంతో భేటీ కావడంతో జాతీయ రాజకీయాలలో కీలకంగా వ్యవహరించాలన్న వ్యూహాన్ని కేసీఆర్ పూర్తిగా వదిలేయలేదని అర్ధమౌతున్నది.