అక్క చెళ్లెమ్మలపై ఇన్ని ఘోరాలు.. జగనన్నా ‘దిశ’ ఏందన్నా!
posted on Apr 29, 2022 7:40AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పాలనతో రాష్ట్రంలో అక్క చెళ్లెమ్మలకు భద్రత కరవైంది. రోజుకోచోట అక్క చెళ్లెమ్మలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా.. ముఖ్యమంత్రి మాత్రం వాటిపై నోరు మెదపడం లేదు. నిందితులపై చర్యలకు ఆదేశించడం లేదు.
రాష్ట్రంలో ఆడబిడ్డల భద్రతకే అత్యంత ప్రాధాన్యత ఇస్తామంటూ ఘనంగా ప్రకటించి.. ఆడబిడ్డపై అఘాయిత్యం జరిగితే నిందితులపై కఠిన చర్యలకు ఏకంగా దిశ చట్టాన్నే తీసుకువచ్చామని చెప్పిన జగన్ ఇప్పుడా చట్టం ఏం పని చేస్తున్నది, ఎక్కడ పని చేస్తున్నదో చెప్పాల్సిన అవసరం ఉందని విపక్షాలు నిలదీస్తున్నాయి.
అత్యాచార కేసుల్లో నిందితులు దర్జాగా ఎస్పీ కార్యాలయంలో కూర్చుంటున్నారు, బాధితురాలి బంధువులు సంబధీకులూ న్యాయం కోసం కార్యాలయం ఎదుట పడిగాపులు కాస్తున్నా ఫలితం ఉండటం లేదు. పాలనా రాహిత్యానికి పరాకాష్టగా ఈ ప్రభుత్వ పని తీరు ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే.. రోజా వంటి మంత్రులు మహిళా సాధికారత గురించి గొప్పలు చెబుతున్నారు.
ఒక అనూష, రమ్య, తేజస్విని, వరలక్ష్మి నాగమ్మ, తాజాగా తెనాలి.. ఇలా మహిళలు బలౌతుంటే.. దిశ చట్టం అంటూ ఘనంగా ప్రకటనలు గుప్పించిన సీఎం మౌనం దారుణమని అంటున్నారు.
ప్రభుత్వ పరంగా బాధితులకు ఓదార్పు ఇవ్వడం, స్వాంతన కలిగించే చర్యలు తీసుకోవడానికి ముందుకు రాని ముఖ్యమంత్రి విపక్ష నేతలు బాధితులను పరామర్శించడానికి వెళ్లేందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని విపక్ష నాయకులు లోకేష్ విమర్శించారు. బాధితురాలిని పరామర్శించేందుకు వెళ్లిన ఆయనపై రాళ్ల దాడి జరగడం తెలిసిందే. రాళ్ల దాడులకు భయపడేది లేదన్న ఆయన అత్యాచార బాధితురాలిని పరామర్శించడానికి ప్రభుత్వం రాకపోవడం ఒక దారుణమైతే...హత్యాచారానికి గురైన యువతికి కనీసం పోస్టు మార్టం చేయకుండా పోలీసులు అత్యాచారం జరగలేదనీ, అక్రమ సంబంధమే హత్యకు కారణమనీ ప్రకటనలివ్వడం ఏంటని నిలదీశారు.
అత్యాచారాల విషయంలో నోరు మెదపని నేతలు విపక్ష నేతల పరామర్శలను అడ్డుకోవడం దృష్టి మళ్లింపు రాజకీయం తప్ప మరొకటి కాదని పరిశీలకులు చెబుతున్నారు. అత్యాచార సంఘటనపై దృష్టి మళ్లించడానికే దాడులు చేస్తున్నారనీ, దీని ద్వారా ప్రజల దృష్టి ఘటనపై నుంచి మరలి..అధికార విపక్షాల మధ్య ఘర్షణపై కేంద్రీకృతం అవ్వాలన్నదే దాడులకు పాల్పడే వారి ఉద్దేశమని వారు విశ్లేషిస్తున్నారు.
ప్రభుత్వాధినేత బాధితులను పరామర్శించరు, వారికి అండగా నిలుస్తామన్న మామీ ఇవ్వరు.. విపక్ష నేతలను పరామర్శకు వెళ్ల నివ్వరు.. దాడులకు పాల్పడతారు.. అంటే అత్యాచారాలు జరిగినా ఎవరూ మాట్లాడకూడదు, ఆల్ ఈజ్ వెల్ అంటూ మిన్నకుండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తున్నదని అంటున్నారు. మహిళలపై అఘాయిత్యాలను అరికట్టడంలో జగన్ సర్కార్ ఘోరంగా విఫలమైంది. అత్యాచార ఘటనల్లో ఎక్కువగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు వైసీపీకి చెందిన వారే కావడం వల్ల పోలీసులు చర్యలు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. జిల్లాల ఎస్పీలఅప్రైజల్ జాబితాను తన వద్ద ఉంచుకుని జగన్ వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ అధికార పార్టీకి తొత్తులుగా మారేలా చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. పోలీసు అధికారుల అప్రైజల్ జాబితా సీఎం తన వద్ద పెట్టుకున్న ఏకైక రాష్ట్రం దేశంలో ఏపీ ఒక్కటేనని వివ్లేషకులు చెబుతున్నారు.
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను జగన్ నిర్వీర్యం చేయడం వల్లనే ఆడబిడ్డలపై అత్యాచారాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతున్నదన్న విమర్శలు ఉన్నాయి. ప్రతికల్లో ప్రకటనలు, గంభీర ప్రసంగాలకే ‘దిశ’ చట్టం పరిమితమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగనన్నా ‘దిశ’ ఏందన్నా అని జనం ఆక్రోశిస్తున్నారు. ఇప్పటికైనా అత్యాచార నిందితులపై కఠిన చర్యలు తీసుకుని రాష్ట్రంలో ఆడబిడ్డల భద్రతకు భరోసా కల్పించాలని కోరుతున్నారు.