ఏసీబీ ఈడీ నోటీసులతో కేటీఆర్ ఉక్కిరిబిక్కిరి
posted on Jan 4, 2025 8:42AM
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పూర్తిగా చిక్కుల్లో చిక్కుకున్నట్లే కనిపిస్తోంది. ఆయనను దర్యాప్తు సంస్థలు వెంటాడుతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ కు ఈ నెల 6న విచారణకు రావాల్సిందిగా ఏసీబీ శుక్రవారం (జనవరి 3)న నోటీసులు జారీ చేసింది. అంతకు ముందే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేటీఆర్ కు నోటీసులు జారీ చేసి.. ఈ నెల 7న విచారణకు రావాల్సిందిగా ఆదేశించింది.
ఇదే ఇప్పుడు కేటీఆర్ ఈ కేసులో నిండా మునిగారా అన్న అనుమానాలకు తావిస్తున్నది. ఒకే కేసులో రెండు దర్యాప్తు సంస్థలూ కేటీఆర్ ను విచారించడం, అది వరుసగా 6, 7 తేదీలలో విచారణకు రావాల్సిందిగా ఆదేశించడం కేటీఆర్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నదని చెప్పవచ్చు. ఒక్క రోజు తేడాలో ఆయన ఏసీబీ, ఈడీ విచారణకు హాజరు కావాల్సి రావడం సంచలనంగా మారింది. బీఆర్ఎస్ వర్గాలలో ఆందోళనకు కారణమైంది.
ఫార్ములా కార్ కేసులో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై మంత్రిగా పనిచేసిన కేటీఆర్ తో పాటు అప్పట్లో మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీరుగా పనిచేసిన బీఎల్ఎన్ రెడ్డి మీదా ఏసీబీ కేసులు పెట్టడమే కాకుండా ఎఫ్ఐఆర్ కూడా నమోదుచేసింది.
ఆ ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈడీ రంగంలోనికి దిగి ఆ ముగ్గురికీ నోటీసులు జారీ చేసింది. ముందుగా కేసు నమోదు చేసినది ఏసీబీయే అయినా, ఆ ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా రంగంలోనికి దిగిన ఈడీ దూకుడుగా ముందుకు సాగుతోంది. 2వ తేదీన విచారణకు హాజరుకావాల్సిన బీఎల్ఎన్ రెడ్డి, 3వ తేదీన హాజరవ్వాల్సిన అర్వింద్ హాజరుకాలేదు. వారిరువురూ మూడు వారాల గడువు కోరితే.. ఈడీ మాత్రం వారికి రోజుల వ్యవధి మాత్రమే ఇచ్చింది. బీఎల్ఎన్ రెడ్డి, అర్వింద్ లను వ రుసగా 8,9 తేదీలలో విచారణకు రావాల్సిందిగా మరో మారు నోటీసులు ఇచ్చింది. వారిరువురి కంటే ముందుగా ఈడీ కేటీఆర్ ను విచారించేందుకు రెడీ అయ్యింది. కేటీఆర్ ను ఈడీ ఈ నెల 7నే విచారించనుంది.చ అంటే ఫార్ములా ఈ రేస్ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురినీ వరుసగా ఒకరి తరువాత ఒకరిని విచారించడానికి ఈడీ నోటీసులు జారీ చేసిందన్నమాట. అయితే ఈడీ విచారణకు కేటీఆర్ డుమ్మా కొట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.
ఒక వైపు ఈడీ విచారణ విషయంలో ఉత్కంఠ కొనసాగుతుండగానే.. హఠాత్తుగా ఏసీబీ కూడా దూకుడు పెంచింది. శుక్రవారం (జనవరి 3)న కేటీఆర్ కు నోటీసులు ఇచ్చి మూడు రోజుల వ్యవధి ఇచ్చి జనవరి 6న విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. అంటే నోటీసుల మేరకు కేటీఆర్ 6న ఏసీబీ ఎదుట, 7న ఈడవీ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ అవినీతికి ఆధారాలున్నాయని ప్రాథమిక విచారణలో నిర్థారించుకున్న ఏసీబీ దూకుడుగా సాగుతోంది. అరెస్టు కాకుండా కేటీఆర్ కు కోర్టు తాత్కాలిక ఊరట ఇచ్చినప్పటికీ, విచారణలతో కేటీఆర్ ను ఉక్కిరిబిక్కిరి చేసే వ్యూహంతో ఏసీబీ ముందుకు సాగుతున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.