దూకుడు పెంచిన రేవంత్.. 26 నుంచి సరికొత్త పాలన!
posted on Jan 6, 2025 8:11AM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనలో మరింత దూకుడు పెంచేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఈనెల 26వ తేదీ నుంచి సరికొత్త పాలనకు శ్రీకారం చుట్టబోతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఈ ఏడాది కాలంలో తాను అనుకున్న విధంగా రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వచ్చిన రేవంత్ అదే సమయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలపై ఎదురు దాడినీ కొనసాగించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేస్తూ సాగుతున్నారు. అయితే ఈ ఏడాది కాలంలో రేవంత్ సర్కార్ పాలనకు అత్తెసరు మార్కులే వచ్చాయి. హామీలను అమలు చేయడంలో రేవంత్ సర్కార్ కొంత మేర విఫలమైందన్న వాదన తెలంగాణ సమాజంలో బలంగా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా రైతులకు మేలుచేసే విషయంలో ఏడాది కాలంలో ప్రభుత్వం ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదన్న అభిప్రాయం ఉంది. రెండు లక్షల బ్యాంకు రుణాలను మాఫీ చేసినప్పటి.. రైతులందరికీ రుణమాపీ అందలేదు. దీంతో రుణమాఫీ కాని రైతులు రేవంత్ సర్కార్ పై గుర్రుగా ఉన్నారు. ప్రభుత్వం మాత్రం అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ రుణమాఫీ చేస్తున్నామని చెబుతోంది. అయితే, ఏడాది కాలంలో వైఫల్యాలను సరిదిద్దుకుంటూ సరికొత్త పాలనకు శ్రీకారం చుట్టాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇందుకోసం జనవరి 26వ తేదీని ముహూర్తంగా నిర్ణయించుకున్నారు.
జనవరి 26వ తేదీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గడిచిన ఏడాదిలో పాలనాపరంగా, రాజకీయంగా జరిగిన లోటుపాట్లను గ్రహించి వాటిపై పట్టు సాధించేందుకు రేవంత్ ఫోకస్ పెట్టారు. అందు కోసం నేరుగా జిల్లాల్లోని ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి సిద్ధమవుతున్నారు. ఈనెల 14వ తేదీ నుంచి 24 వరకు రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలకు వెళ్లనున్నారు. హైదరాబాద్ తిరిగి వచ్చిన తరువాత 26వ తేదీన రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొని.. అదే రోజు జిల్లాల పర్యటనకు రేవంత్ శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. శనివారం జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో రేవంత్ రెడ్డి రైతు భరోసా పథకంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ పథకంతో పాటు మరికొన్ని పథకాలకు జనవరి 26వ తేదీ నుంచే రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టనుంది. అంతకు ముందు 16వ తేదీ నుంచే మంత్రులు నియోజకవర్గాల వారిగా పర్యటనలు చేయనున్నారు. జనవరి 26 నుంచి రేవంత్ సర్కార్ ప్రారంభించబోయే పథకాలపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించనున్నారు.
కేబినెట్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జనవరి 26 నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలుకు నిర్ణయించారు. కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలపై స్వయంగా రేవంత్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. గత ప్రభుత్వంలో రైతు బంధు పథకం కింద రెండు దఫాలుగా ఎకరానికి రూ.10వేలు అందించింది. అయితే, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీ ఎకరాకు రెండు దఫాలుగా రూ.12వేలు ఇచ్చేందుకు నిర్ణయించింది. ఈ పథకానికి రైతు భరోసాగా నామకరం చేసిన విషయం తెలిసిందే. గత బీఆర్ఎస్ హయాంలో రైతులకు ఎన్ని ఎకరాలు ఉన్నా పరిమితి లేకుండా రైతు బంధు పథకం అమలైంది. ఆ క్రమంలో వ్యవసాయం యోగ్యం కాని భూములు, రాళ్లురప్పలు, మైనింగ్ కోసం కేటాయించిన భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్ వేసిన భూములకు, పరిశ్రమలకు కేటాయించిన భూములకు సైతం రైతు బంధు నిధులు పడ్డాయి. దీంతో ప్రజాధనం భారీగా వృథా అయ్యిందని గతంలో కేసీఆర్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం రేవంత్ సర్కార్ రైతు భరోసా పథకం అమలు విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. కేవలం వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా సాయం అందిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. అదే సమయంలో పల్లెల్లో ఉంటూ భూమి లేని వ్యవసాయ రైతు కుటుంబాలకు కూడా ఏడాదికి రూ.12వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసాగా పేరును ఖరారు చేశారు. రేవంత్ సర్కార్ నిర్ణయంతో ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమ వుతు న్నాయి. అసలైన రైతులకు, భూమిలేని కుటుంబాలకు మేలు జరిగేలా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం ఉందని పేర్కొంటున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు చేసుకున్న వారు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసినా కొత్తకార్డులు రాలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ హయాంలో అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డు ఇవ్వాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను జనవరి 26వ తేదీనే శ్రీకారం చుట్టాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ క్రమంలో జనవరి 26 నుంచి రేవంత్ సర్కార్ సరికొత్త పాలన ప్రారంభమవుతుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మొత్తానికి ఏడాది పాలనలో లోటుపాట్లను సరిచేసుకుంటూ రాబోయే కాలంలో మరింత మెరుగైన పాలనను తెలంగాణ ప్రజానీకానికి అందించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతున్నది.