జేసీ వ్యవహారంలో బీజేపీ నేతలు హద్దు మీరారా?..
posted on Jan 4, 2025 8:18AM
ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధే లక్ష్యంగా దూసుకెళ్తున్నది. గడిచిన ఐదేళ్ల కాలంలో వైసీపీ హయాంలో కనీస సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫలితంగా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ ప్రజలు జగన్‌కు గట్టి గుణపాఠం చెప్పారు. కనీసం ప్రతిపక్ష హోదాకూడా ఇవ్వకుండా కేవలం పదకొండు నియోజకవర్గాలకే ఆ పార్టీని పరిమితం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆర్నెళ్లు అవుతోంది. చంద్రబాబు సారథ్యంలో అన్నిరంగాల్లో ఏపీ వ్యాప్తంగా అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి.
బీజేపీ, జనసేన పార్టీల నేతలను కలుపుకొనిపోతూ కూటమిలో ఎలాంటి విబేధాలూ తలెత్తకుండా చంద్రబాబు పాలన సాగిస్తున్నారు. అయితే, అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తీరు వివాదాస్పదం అవుతోంది. గత మూడు రోజులుగా జేసీ ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయిలో కొనసాగుతోంది. తన బస్సును తగలబెట్టింది బీజేపీ నేతలే అంటూ జేసీ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యాడు. బీజేపీ మహిళా నేత, సినీనటి మాధవీలతపై జేసీ ప్రభాకరరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో బీజేపీ నేతలుకూడా జేసీపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ పరిణామాలతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.
నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నేతల మధ్య వివాదం తలెత్తింది. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా తాడిపత్రిలోని పెన్నా నది ఒడ్డున జేసీ పార్కులో న్యూ ఇయర్ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో కేవలం మహిళలే పాల్గొనాలని రూల్ పెట్టారు. అయితే, బీజేపీ మహిళా నేత జేసీ పార్కులో నిర్వహించే న్యూఇయర్ వేడుకలపై అభ్యంతరం తెలిపారు. కేవలం మహిళలకే న్యూఇయర్ వేడుకలు నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. మహిళలకు ఏదైనా అయితే ఎవరిది బాధ్యత అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మరో బీజేపీ మహిళానేత, సినీ నటి మాధవీ లత జేసీ పార్కులో న్యూఇయర్ వేడుకలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆ ప్రాంతంలో గంజాయి తీసుకునేవారు ఎక్కువగా ఉంటారు. అలాంటి సెన్సిటివ్ ప్రాంతంలో కేవలం మహిళలకే పార్టీని ఏర్పాటు చేయడం ఏమిటి..? మహిళలకు ఏమైనా అయితే బాధ్యత ఎవరిది..? అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి పేరు ప్రస్తావించకుండానే ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ఇలా వివాదం సాగుతుండగా, జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన బస్సులు దగ్ధమయ్యాయి. ఈ ఘటన ఎలా జరిగిందో ఏమో కానీ, జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం బీజేపీనే కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ మహిళా నేత మాధవీలతపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలపైనా ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. ఇక తన బస్సులను పథకం ప్రకారం దగ్ధం చేసినా.. షార్ట్ సర్క్యూట్ అంటూ పోలీసులు కేసు నమోదు చేయడంపైనా జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. పోలీసులకు చేతనైతే సుమోటోగా కేసు నమోదు చేసి తన బస్సులకు నిప్పంటించిన వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రూ.450 కోట్లు డబ్బులు పోగొట్టుకున్నానని.. ఇప్పుడు రెండు బస్సులకు నిప్పంటిస్తే ఏమవుతుందని వ్యాఖ్యానించారు. వీళ్ల కంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా మేలని, జగన్ తన ప్రభుత్వంలో కేవలం తన బస్సులు మాత్రమే ఆపారని.. బీజేపీ మాత్రం తన బస్సులను తగులబెట్టించారని జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. జేసీ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు సైతం ఫైరయ్యారు. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి విలేకర్లతో మాట్లాడుతూ.. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరైనవి కావన్నారు. బీజేపీ వాళ్లే బస్సులు కాల్చేశారని ఆయన అంటున్నారని, నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. ఎక్కడో కూర్చొని నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటే చూస్తూ కూర్చొనే వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరన్నారు. జేసీ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి, బీజేపీ నేత సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ వ్యాఖ్యలు సరికాదని... ఆయన ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదని అన్నారు. కూటమిలో భాగమైన బీజేపీపై జేసీ అర్థంలేని వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. వయసుకు తగిన విధంగా నడుచుకోవాలని జేసీకి హితవు పలికారు.
జేసీ కుటుంబం న్యూఇయర్ వేడుకలు నిర్వహిస్తే బీజేపీ నేతలకు ఇబ్బంది ఏమిటన్న ప్రశ్న జేసీ వర్గీయుల నుంచి వ్యక్తమవుతుంది. కేవలం కూటమి నేతల మధ్య గొడవలు సృష్టించేందుకే బీజేపీ మహిళా నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని, అసలు బీజేపీ పెద్దలను సంప్రదించకుండా కూటమిలో భాగస్వామిగా ఉన్న నేతలపై ఎలా విమర్శలు చేస్తారంటూ జేసీ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఈ విషయాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ దృష్టికి తీసుకెళ్తామని జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు అంటున్నారు. మరోవైపు బీజేపీ నేతలుసైతం తగ్గేదేలే అంటున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి బీజేపీ మహిళా నేతలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెబుతున్నారు. అటు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఇటు బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో కూటమి పెద్దగాఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారనే అంశం ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.