కే.సి.ఆర్ కోదండరామ్ మధ్య పెరిగిన అగాధం
posted on Jul 14, 2012 6:39PM
ఎవడిగోల వాడిది అన్నంట్లుంది. కెసిఆర్ ప్రస్తుతానికి ప్రత్యేక తెలంగాణకుఉద్యమాలు అక్కర్లేదు తెలంగాణ వచ్చేందుకు ఏమంత సమయంలేదు అన్నారు. అంతటితో ఆగకుండా పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రపతి ఎన్నికలు కాగానే తెలంగాణ ఎందుకు ఇవ్వనున్నారో కూడా సావధానంగా వివరిస్తూ వైసిపి పార్టీ దూకుడుని తగ్గించడానికి కాంగ్రెస్‌కు తెలంగాణ ఇవ్వటం తప్ప మరో గత్యంతరం లేదని సెలవిస్తున్నారు. దీనిపై జాక్‌నేత ప్రొఫెసర్ కోదండరామ్ ఇంతవరకు అలాంటి సంకేతాలు ఏమీ అందలేదని, రాష్ట్రపతి ఎన్నికలముందే ఉద్యమాన్ని ముమ్మరం చేస్తే తెలంగాణ వచ్చితీరుతుంది అంటున్నారు. దీంతో వీరిద్దరి మధ్యా అగాధం మరింత పెరినట్లుయింది.
నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపి మధుయాష్కీ ఇప్పట్లో తెలంగాణ ప్రకటించే సూచనేమీ తనవరకు రాలేదంటునన్నారు. టిజి వెంకటేశ్ ది మరోగోల ..మొదట రాయల్ తెలంగాణ రావాలన్నారు. అయితే మాకేమీ రాయల్ తెలంగాణ అక్కర్లేదని తెలంగాణవాదులు తెగేసి చెప్పటంతో ఇప్పుడు మహారాయలసీమ అంటున్నారు. రాయలసీమలో నాలుగు జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు కలిపి మొత్తం ఆరు జిల్లాలతో మహారాయలసీమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జెసి దివాకర్‌రెడ్డి మాత్రం రాయల్ తెలంగాణాకే కట్టుబడిఉన్నానన్నారు. కాంగ్రెస్ వాదులు, కిరణ్‌కుమార్‌రెడ్డి అధిష్టానమే చూసుకుంటుందని దాని నిర్ణయానికే కట్టుబడి ఉన్నామంటున్నారు. రాజ్యసభ సభ్యురాలైన రేణుకా చౌదరి కేంద్రం త్వరలో ఒక నిర్ణయానికి రానున్నారంటారు. ఆ నిర్ణయమేదో కూడా చెప్పరు. కావూరి ఏదో ఒక నిర్ణయం తీసుకోవడమే మంచిది నాన్చివేత ధోరణి కంటే అని అంటారు. కొందరు కాంగ్రెస్ నాయకులు టిఆర్‌యస్ పార్టీని కాంగ్రెస్‌లో కలిపేస్తే తెలంగాణ ఇవ్వడం కష్టమేమీకాదంటున్నారు. ఆంద్ర జాక్ నేతలు భాషా రాష్ట్రంగా ఏర్పడిన మొదటి రాష్ట్రం మనదే కాబట్టి ఎప్పటికీ కలసి ఉండాల్సిందే అంటారు.
తెలుగుదేశం తెలంగాణా నాయకులు తెలంగాణా మీద తేల్చకుంటే అక్కడ అడుగుపెట్టలేని పరిస్ధితిలో ఉన్నామని చంద్రబాబునాయుడ్ని త్వర పెడుతున్నారు. అయితే తెలుగుదేశంపార్టీలో ఉన్న కోస్తాంద్రలో సిట్టింగ్ ఎమ్మేల్యేలు జారిపోవటంతో దాన్ని చక్కపరచుకునే పనిలో చంద్రబాబు ఉన్నారు. ఇక వైసిపి పార్టీ మేము తెలంగాణాకు వ్యతిరేకం కాదు. కేంద్రం ఇస్తామంటే మేము వద్దనం అంటూ చేతులు దులుపుకుంది. వైసిపి గౌరవ అద్యక్షురాలైన విజయమ్మకు జగన్‌కి జరిగిన అన్యాయాన్ని జాతీయ స్ధాయిలో వినిపించి మద్దతు కూడ గట్టే పనిలో బిజీగా ఉన్నారు. కాని అస్తవస్త్యం అయిన జనజీవనాన్ని ఎవరూ పట్టించుకున్న ధాఖలాలు కనిపించడంలేదు.... ఎవరి ఉద్యమాలు, జెండాలు, ఎజెండాలు వారివే కాని సామాన్య ప్రజలకు తక్షణం కావల్సిన ధరలు అదుపులోకి తేవడం, విద్యాసంవత్సరం మొదలైనా పుస్తకాలు పంపిణీకాకపోవడం, విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు, రీఎంబర్స్ మెంట్లు, అంధకారం అలుముకున్న ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పరిశ్రమలు కుదేలవ్వటంవల్ల సాటి కార్మికుల బ్రతుకులు, దుర్భరమవుతున్న సామాన్యుడి జీవనం ఎవరికీ పట్టడంలేదు. ప్రజలకు వారి సమస్యల కొరకు పాటుపడే నాయకుడికోసం భూతద్దం వేసి చూసినా ఒక్కరంటే ఒక్కరుకూడా కనబడటంలేదు.