కేసీఆర్ వ్యూహాలకు ఈటల విలవిల.. 

మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందో, ఆ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ఏమవుతుందో  ఏమో కానీ, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు, రోజుకో ఎత్తుతో ప్రత్యర్ధులను చిత్తు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో. ఇప్పటికిప్పుదు ఎన్నికలు జరిగితే తెరాస అభ్యర్ధి (ఎవరైనా సరే) ఓడిపోతారు, ఎన్నికలు ఎంత ఆలస్యంగా జరిగితే, తెరాసకు అంత మేలు జరుగుతుంది, ఇది ఎవరో దారినపోయే దానయ్య అంటున్నమాట కాదు. ముఖ్యమంత్రి, చాలా గట్టిగా విశ్వసించే సర్వే సంస్థలు జనం నాడి పట్టి తేల్చిన పక్కా లెక్క.  

ఎన్నికలను వాయిదా వేయడం రాష్ట్రం ప్రభుత్వం చేతుల్లో ఉండే వ్యవహారం కాదు. ఎన్నికల షెడ్యూలు ఖరారు చేసే అధికారం కేంద్ర ఎన్నికలసంఘానికి మాత్రమే ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వ గుప్పిట్లో ఉంటుంది. అయితే, ఫలానా సమయంలో ఎన్నికల నిర్వాహణకు స్థానిక పరిస్థితులు ఎంతవరకు అనుకూలంగా ఉంటాయి, ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తే అందరికీ అనుకూలంగా ఉంటుంది, అనే విషయంలో  కేంద్ర ఎన్నికల  సంఘం  రాష్ట్ర ప్రభుత్వ సూచనలు తీసుకుంటే తీసుకోవచ్చును. అయితే, ఆ సూచనలు తప్పక పాటించాలనే నియమమ ఏదీ లేదు. అయినా, ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితులలో కేంద్ర ఎన్నికల సంఘం ఏక పక్షంగా నిర్ణయం తీసుకోవడం సాహసమే అవుతుంది. అలాంటి సాహసం ఎన్నికల సంఘం చేయక పోవచ్చునని, అంటున్నారు. ఇప్పటికీ, కోర్టుల చేత మొట్టికాయలు వేయించుకున్న ఎన్నికల సంఘం తొందరపాటు నిర్ణయాలు తీసుకోదు.   

జూన్ నెలలో సభ్యుల పదవీ కాలం ముగియడంతో ఖాళీ అయిన ఆరు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం, కరోనా పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, పరిస్థితి ఏమిటని,రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఇదే అదనుగా, కేసీఆర్ ప్రభుత్వం,మండలి ఎన్నికలకు పరిస్థితి ఏమాత్రం అనుకూలంగా లేదని, వెంటనే సమాదానం ఇచ్చింది. అయితే రాష్ట్రంలో పరిస్థతి చూస్తే ఎవరికైనా, కేవలం 116 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఓటింగ్ లో పాల్గొనే మండలి ఎన్నికలు కాదు, సాధారణ ఎన్నికలు అయినా జరిపించేందుకు ఏ మాత్రం అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదనిపిస్తుంది. అలాగని, రాష్ట్రానికి కరోనా ముప్పు తొలిగిపోయిందని కాదు. సభలు, సమావేశాలు, ఊరేగింపులు, పాదయాత్రలు ఒకటని కాదు, రాజకీయ కార్యకలాపాలు అన్నీ, మాములుగా జరిగి పోతున్నప్పుడు, పెళ్ళిళ్ళు, పేరంటాలు వంటి సామాజిక కార్యకలాపాలు, బోనాల వేడుకలు వంటి ఆధ్యాత్మిక కార్యకలాపాలు, బార్లు, సినిమాలు వంటి వినోద, వికార కార్యక్రమాలు అన్నీ యథావిధిగా జరుగుతున్నప్పుడు, ఓ వందమంది ఎమ్మెల్యేలు వచ్చి ఓటేసిపోయే మండలి ఎన్నికలు జరిపేందుకు కరోనా అడ్డు వస్తుందా అన్నదే, సామాన్య జనం వ్యక్తపరుస్తున్న చిరు సందేహం. 

మండలి ఎన్నికలు ఎప్పుడు జరిగినా వచ్చేది, పోయేది ఉండదు. అదీ గాక, ఎమ్మెల్యే కోటా మండలి ఎన్నికల్లో అధికారపార్టీ గెలుపు ముందుగానే ఖరారైపోయింది. సో ... మండలి ఎన్నికల ఎప్పుడు జరిగినా ఒకటే.కానీ హుజురాబాద్ ఉప ఎన్నిక అలాకాదు. ఉప ఎన్నిక ఇప్పటికిప్పుడు జరిగి, అధికార పార్టీ ఓడిపోతే, తట్టుకోవడం కష్టం. అందుకే, ఈ వంకన హుజురాబాద్ ఉప ఎన్నికను వాయిదా వేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాత్మకంగానే మండలి ఎన్నికలు నిర్వహించేందుకు అనుకూల పరిస్థితులు లేవని,అధికారుల ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియచేశారు. అయితే అదేమీ రహస్యం కాదు. అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం.

మరోవంక కేసీఆర్ తమ ఎజెండాను ఇంచక్కా ముదుకు తీసుకు పోతున్నారు. దళిత బంధును తెరమీదకు తెచ్చిన కేసీఆర్, అవసరం అయితే, ఆ ఉచ్చులోంచి తప్పించుకునే వ్యూహాలకు కూడా పదును పెడుతున్నారు. పులి మీద స్వారీ చేస్తూ కూడా పట్టుతప్పకుండా బాలన్స్ చేసుకుంటున్నారు. అదీ ఎదురు తిరిగితే దళిత ఓటును చెల్చేందుకు దళిత దొర, ఐపీఎస్ ను సిద్ధం చేస్తున్నారు.

హుజురాబాద్ టికెట్ విషయంలోనూ కేసీఆర్ వ్యుహత్మకంగానే పావులు కదుపుతున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి, ఈ మధ్యనే తెరాసలో చేరిన పాడి కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేయడంతో, ఒకే దెబ్బకు రెండు పిట్టలను బుట్టలో వేసుకున్నారు. రెడ్డి సామాజిక వర్గం ఓటును, కొంత తమ వైపుకు తిప్పుకున్నారు. అలాగే, ఇటీవల తెరాసలో చేరిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణతో పాటుగా, కాషాయ గూటినుంచి గులాబీ గూటికి చేరిన మాజీ మంత్రి ఇనుగాల పెద్ది రెడ్డి, ఇంకా కొన్ని పేర్లు ప్రచారంలో ఉన్నా, ఈటల ప్రధాన బలం అయిన బీసీల నుంచే తెరాస అభ్యర్ధిని ఎంపిక చేసీ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా, పద్మశాలీ సామాజిక వర్గానికి చెందిన ఎల్ . రమణతో పాటుగా  టీఆర్‌‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌‌, జమ్మికుంట మాజీ సర్పంచ్‌‌ పొనగంటి మల్లయ్య పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

హుజూరాబాద్‌‌  ఉప ఎన్నికను చావో రేవో సమస్యగా తీసుకున్న కేసీఆర్‌‌ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో, ఎక్కడ ఎలా ఎవరిని దెబ్బ కొడతారో ఉహించడం అయ్యే పనికాదు. ఎన్నికల ప్రకటనకు ఎటూ కొంత కాలం ఉంది కాబట్టి, ఈలోగా మంత్రి వర్గ విస్తరణ చేపట్టి ముందుగానే తమ అభ్యర్ధిని మంత్రివర్గంలోకి తీసుకున్నా తీసుకుంటారని, ఆ విధంగా  మాజీ మంత్రి, ప్రస్తుత మంత్రి మద్య తూకం తమవైపుకు మొగ్గేలా చేసినా ఆశ్చర్య పోనవసరం లేదంటున్నారు. ఏదైనా ఈటలను ఓడించడమే కేసీఆర్ ఏకైక లక్ష్యమని అందుకోసం ఏమైనా చేస్తారని అంటున్నారు.