కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీతో పాటు మంత్రి ప‌ద‌వి?.. ఈట‌ల‌, రేవంత్‌ల‌కు చెక్ పెట్ట‌డానికేనా?

పాడె కౌశిక్‌రెడ్డి. ఉద్య‌మంలో పాల్గొన‌లేదు. కేసీఆర్ వెంట తిర‌గ‌లేదు. మొన్న‌టి వ‌ర‌కూ కారు పార్టీలోనూ లేడు. ఒక్క‌సారి కూడా ఎమ్మెల్యేగా గెల‌వ‌లేదు. అయినా, అనూహ్యంగా ఎమ్మెల్సీ ప‌ద‌వి వ‌రించింది. అదికూడా గ‌వ‌ర్న‌ర్ కోటాలో. మాజీ క్రికెట‌ర్ అయిన కౌశిక్‌కి నామినేటెడ్ ప్ర‌మోష‌న్ ల‌భించింది. వ‌డ్డించే వాడు మ‌న‌ వాడైతే ఎలాంటి ప‌ద‌వైనా ఇలానే వెతుక్కుంటూ వ‌స్తుంది. ఏళ్లుగా గులాబీబాస్‌కు గులాంగిరీ చేస్తూ.. కారును ముందుకు తోస్తున్న అనేక‌మంది నాయ‌కులు ఎమ్మెల్సీ కోసం ఆశ‌గా ఎదురుచూస్తుంటే.. నిన్న‌గాక మొన్న గులాబీ కండువా క‌ప్పుకున్న కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీ చేస్తుండ‌టం ఆశ్చ‌ర్య‌క‌ర‌మే. ఇలాంటివి రాజ‌కీయాల్లోనే సాధ్యం. కేసీఆర్ మార్క్ పాలిటిక్స్‌కు నిద‌ర్శ‌నం. 

అంద‌రికీ తెలిసిన విష‌య‌మే కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఎందుకు ఎంపిక‌య్యారో. ఆయ‌న ఆడిన‌ క్రికెట్‌కు గుర్తింపుగా కాకుండా.. హుజురాబాద్‌లో ఆడ‌బోయే పొలిటిక‌ల్ మ్యాచ్‌కు ఆల్‌రౌండ‌ర్‌గా మారుతాడ‌నే చిన్న‌వాడైన‌ కౌశిక్‌ను పెద్ద‌ల స‌భ‌కు పంపించారు. త‌న‌కు బ‌ద్ధ‌శ‌త్రువుగా మారిన‌ ఈట‌ల‌కు ఎలాగైన చెక్ పెట్టేందుకు.. ఆయ‌న‌కు బ‌ద్ద‌శ‌త్రువైన కౌశిక్‌కు కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు లాగారు. ఎమ్మెల్యే టికెటే ఇచ్చే వారేమో కానీ.. పార్టీలో చేర‌క‌ముందే లీకైనా ఆడియో టేపుల వ‌ల్ల ఎమ్మెల్యే పోయి ఎమ్మెల్సీ వ‌చ్చిందంటున్నారు. ఏదైతేనేం.. హౌజ్‌లో అధ్య‌క్ష అనే అవ‌కాశం వ‌చ్చిందంటూ.. పాకిస్తాన్ మీద‌ సెంచ‌రీ కొట్టినంత ఖుషీ అవుతున్నార‌ట కౌశిక్‌రెడ్డి. ఇప్ప‌టికే ఈట‌ల ద‌య‌వ‌ల్ల త‌మ‌కు 10 ల‌క్ష‌లు రాబోతున్నందుకు ద‌ళితులంతా సంతోషంగా ఉన్న‌ట్టే.. అదే ఈట‌ల వ‌ల్ల త‌న‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి వ‌చ్చినందుకు రెడ్డి గారు కూడా తెగ సంబ‌ర‌ప‌డుతుండొచ్చు.

కౌశిక్‌రెడ్డికి రాష్ట్ర‌స్థాయి ప‌ద‌వి వ‌స్తుందంటూ ఆయ‌న పార్టీలో చేరేట‌ప్పుడే సీఎం కేసీఆర్ ఇషారా ఇచ్చేశారు. మిగ‌తా లీడ‌ర్ల మాదిరి పార్టీలో చేరాక ప‌క్క‌న పెట్టేయ‌కుండా.. నెల కూడా గ‌డ‌వ‌క‌ముందే ఎమ్మెల్సీని చేసేశారు. అందుకు కార‌ణం కూడా లేక‌పోలేదు. ఈట‌ల మీద పోటీ చేసే టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెలుస్తారో లేరో తెలీదు. ఒక‌వేళ ఓడిపోతే త‌మ ప‌రిస్థితి ఏంట‌ని ఓట‌ర్లు అనుకొనే ప్ర‌మాదం లేక‌పోలేదు. అందుకే, ముందే కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీని చేసేసి.. వారి ప్రాంతానికో ప్ర‌జాప్ర‌తినిధిని అప్ప‌టిక‌ప్పుడు రెడీ చేశారని అంటున్నారు. ఈ అభిమానంతో ఆయ‌న మ‌రింత క‌ష్ట‌ప‌డి ఈట‌ల‌ను ఓడించే ప్ర‌య‌త్నం గ‌ట్టిగా చేస్తారు. ప్ర‌జ‌ల‌ను మ‌రింత‌గా టీఆర్ఎస్‌కు అనుకూలంగా స‌మీక‌రిస్తారు. కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ ప‌ద‌వితో.. ప‌బ్లిక్‌లో కూడా కేసీఆర్‌ను న‌మ్మిన వారికి అన్యాయం జ‌ర‌గ‌ద‌నే మెసేజ్ వెళ్తుంది. ఈట‌ల అన్యాయంగా వ్య‌వ‌హ‌రించాడు కాబ‌ట్టే.. ఆయ‌న్ను ప‌క్క‌న‌పెట్టార‌నే వాద‌న‌కు మ‌రింత బ‌లం చేకూరుతుందని.. ఇలా కేసీఆర్ ఒక్క పోస్ట్‌తో రెండు ప్ర‌యోజ‌నాలు పొందే స్కెచ్ వేశార‌ని అంటున్నారు. 

మ‌రోవైపు, కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీతోనే స‌రిపెట్ట‌ర‌ని.. ముందుముందు మంత్రిని కూడా చేసే ఛాన్సెస్ ఉన్నాయ‌ని అంటున్నారు. అందుకు కూడా మ‌ళ్లీ ఈట‌ల రాజేంద‌రే కార‌ణం. ఎందుకంటే, హుజురాబాద్ ప్ర‌జ‌ల‌కు ఈట‌ల రూపంలో ఏళ్లుగా ఓ మంత్రి అందుబాటులో ఉన్నారు. ఎంత డ‌మ్మీ అయినా.. ఎమ్మెల్యే కంటే మినిస్ట‌ర్‌కు కాస్త ప‌లుకుబ‌డి, ప‌ర‌ప‌తి ఎక్కువ కాబ‌ట్టి.. ఆయ‌న‌తో మ‌రిన్ని ప‌నులు ఎక్కువ అవుతాయి కాబ‌ట్టి.. ప్ర‌జ‌లకు త‌మ ఎమ్మెల్యే మంత్రిగా కూడా ఉండాల‌నే కోరిక ఉంటుంది. అసంతృప్తిని కూడా లేకుండా చేసేందుకు.. త్వ‌ర‌లోనే కౌశిక్‌రెడ్డికి మంత్రిప‌ద‌వి కూడా వ‌స్తుంద‌ని అప్పుడే ప్ర‌చారం మొద‌లైపోయింది. 

ఎప్ప‌టినుంచో కేబినెట్ పున‌ర్‌వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌పై ప్ర‌చారం జ‌రుగుతోంది. కొంద‌రు మంత్రులు రేవంత్‌రెడ్డి, ఈట‌ల‌తో ట‌చ్‌లో ఉన్నార‌ని కేసీఆర్ ద‌గ్గ‌ర స‌మాచారం ఉంది. ఇటీవ‌ల మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి మైసూర్ రిసార్ట్ ఎపిసోడ్ క‌ల‌క‌లం రేపింది. మ‌రోవైపు, ఇటీవ‌ల ఎమ్మెల్సీగా గెలిచిన ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి, వాణీదేవిల‌ను కేబినెట్‌లోకి తీసుకుంటార‌ని తెలుస్తోంది. ఆ మార్పుల్లో భాగంగా.. యంగ్ అండ్ డైన‌మిక్ లీడ‌ర్ అయిన కౌశిక్‌రెడ్డికి మంత్రి ప‌ద‌వి కూడా ఇస్తార‌ని అంటున్నారు. పెద్ద నోరేసుకొని, దూకుడుగా ఉండే కౌశిక్‌రెడ్డిని.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపైకి వ‌దులుతార‌ని చెబుతున్నారు. ఇలా కేసీఆర్ మొద‌టిరోజే చెప్పిన‌ట్టు.. కౌశిక్‌రెడ్డిని రాష్ట్రస్థాయిలో కావ‌ల‌సినంత‌గా వాడేసుకుంటార‌ని అంటున్నారు.