సీడబ్ల్యూసీ నుంచి కావూరి తప్పుకోవడానికి కారణ౦?
posted on Jun 28, 2013 10:13AM
కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత, కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వానితుడి హోదా నుంచి తప్పుకోవడం సర్వత్రా చర్చనీయాంశగా మారింది. సీడబ్ల్యుసీ శాశ్వత ఆహ్వానితుని హోదా నుంచి తనను తప్పించాలని స్వయంగా కావూరే అభ్యర్థించారని, ఆయన అభ్యర్థనను అధినేత్రి సోనియాగాంధీ ఆమోదించారని ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేదీ తెలిపారు.
కావూరి స్థానంలో వెంటనే షిండేను నియమించడం చూస్తే.. అధిష్ఠానమే ఆయనకు ఈ మేరకు సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. సీడబ్ల్యుసీలో ఒక తెలుగు నేతకు అవకాశం దొరికిందన్న సంతోషం చల్లారకముందే ఆయనను తప్పించడం చర్చనీయాంశమవుతోంది.
తెలంగాణపై వర్కింగ్ కమిటీ తర్జన భర్జన పడే అవకాశమున్నందువల్లనే కావూరిని కొనసాగించడం సరైంది కాదని అధిష్ఠానం భావించినట్లు తెలుస్తోంది. అయితే కావూరిని తొలుత సీడబ్ల్యుసీలోనే చేర్చుకోవాలని భావించారని, అనంతర పరిణామాల్లో ఆయనకు మంత్రిపదవి లభించడం వల్ల సీడబ్ల్యుసీ నుంచి తప్పించడమే సరైందని అనుకున్నారని, అందుకు ఆయన కూడా అంగీకరించారని విశ్లేషకులు చెబుతున్నారు.