ఇప్పటికి వెళ్లండి.. రేపు మళ్లీ రండి! కవితకు ఈడీ ఆదేశం

ఢిల్లీ మద్యం కుంభకోణంలో తెలంగాణ ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు సోమవారం (మార్చి 20)సుదీర్ఘంగా విచారించి అరెస్టు చేయకుండానే  పంపించారు. అయితే విచారణ ఇంకా ముగియలేదనీ మరోసారి విచారణకు రావాలనీ చెప్పారు. సోమవారం (మార్చి 20) ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకూ ఆమెను సుదీర్ఘంగా విచారించారు.   సాయంత్రం సమయంలో వైద్యులను పిలిపించి పరీక్షలు కూడా నిర్వహింపచేశారు. దీంతో ఆమెను అరెస్ట్ చేస్తారని అంతా భావించారు.  

చివరికి ఆలస్యంగా కవితను వదిలి పెట్టారు. కవిత దాఖలు చేసిన పిటిషన్ సుప్రీం కోర్టులో 24వ తేదీన విచారణకు రానున్న నేపథ్యంలో  అప్పటి వరకూ ఆమెను అరెస్టు చేసే అవకాశం లేదని పరిశీలకులు అంటున్నారు. అయితే ఆమె తన పిటిషన్ లో  మహిళల్ని విచారణకు దర్యాప్తు సంస్థల కార్యాలయాలకు పిలవకూడదనీ,  సాయంత్రం ఐదు గంటల తర్వాత విచారించకూడదనే వాదన వినిపించారు. అయితే ఈడీ మాత్రం కవితను కార్యాలయానికి పిలిపించుకుని రాత్రి పొద్దు పోయే వరకూ విచారించింది. మరోవైపు ఈ  ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇప్పటికే ప్రధాన నిందితులందరూ అరెస్టయ్యారు. కవితకు మాత్రమే ఎందుకు మినహాయింపు అంటూ కాంగరెస్ సహా పలు పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.  

ఇలా ఉండగా సోమవారం కవిత విచారణ సుదీర్ఘంగా అంటే దాదాపు పది గంటలకు పైగా సాగింది. కవితను ఈ కేసులో ఇప్పటికే అరెస్టై ఉన్న రామచంద్ర పిళ్లైతో,  తర్వాత అప్రూవర్‌గా మారిన అమిత్ అరోరాతో కలిసి విచారించినట్లు తెలుస్తోంది. ఆ తరువాత ఆమెను బయటకు పంపిన ఈడీ అధికారులు మంగళవారం (మార్చి 21)న మరోసారి విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు. దీంతో నిన్నటికి అరెస్టు లేదని ఊపిరి పీల్చుకున్న బీఆర్ఎస్ వర్గాలలో ఈ రోజు ఏం జరగనుందన్న టెన్షన్ మొదలైంది.