బీఆర్ఎస్ కు ముందు నుయ్యి.. వెనుక గొయ్యి!

తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఒక దాని తరువాత ఒకటిగా సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఆయన ఏ ముహూర్తాన బీఆర్ఎస్ అంటే తెరాసను జాతీయ పార్టీగా మార్చేశారో.. ఆ ముహూర్తం నుంచే ఆయనతో సమస్యలు చెడుగుడు ఆడుకుంటున్నాయి.

ఇప్పటి వరకూ కేసీఆర్ పైనా, ఆయన కుటుంబ సభ్యులపైనా వచ్చిన అవినీతి ఆరోపణలు అన్నీ ఒకెత్తయితే.. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేసీఆర్ కుమార్తె కవితపై వచ్చిన అభియోగాలు, అలాగే.. టీపీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజీ వ్యవహారంలో ఆయన కుమారుడు కేటీఆర్ పై వచ్చిన, వస్తున్న ఆరోపణల తీవ్రత మాత్రం బీఆర్ఎస్ ప్రతిష్టకు, కేసీఆర్ పలుకుబడికి డ్యామేజీ జరిగేవిగానే ఉన్నాయి. ముందుగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితపై ఆరోపణలు, ఈడీ విచారణకు సంబంధించి జరిగిన హై డ్రామానే తీసుకుంటే.. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఇప్పటికే 12 మంది అరెస్టయ్యారు. అలా అరెస్టయిన వారిలో ఆప్ కీలక నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా ఉన్నారు. వారెవరూ కూడా విచారణను ఎదుర్కొనడానికి వెనుకాడలేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సహా ఆ పార్టీ వారంతా ఎలా అయితే ఈ ఆరోపణలూ, కేసులూ, దర్యాప్తులూ అన్నీ రాజకీయ ప్రేరేపితం అని ఆరోపిస్తున్నారో అలాగే మనీష్ సిసోడియా కూడా ఆరోపించారు. అయితే విచారణను హుందాగా ఎదుర్కొన్నారు. స్టే కోసమో, అరెస్టు చేయకుండా ఆదేశాల కోసమే కోర్టులను ఆశ్రయించలేదు.

కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విషయానికి వచ్చే సరికి విచారణను తప్పించుకోవడానికి చేయగలిగినన్ని ప్రయత్నాలు చేశారు. చివరకు గత్యంతరం లేక రెండో సారి ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇదే విధంగా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి కేటీఆర్ కూడా డిఫెన్స్ లో పడినట్లు కనిపిస్తుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలలో కంప్యూటర్లన్నీ నా అధీనంలో ఉంటాయా అంటూ బేలగా అడుగుతున్నట్లు కనిపిస్తోంది.  విపక్షాల విమర్శలకు వివరణలు ఇచ్చుకోవడానికే ఆయన సమయం అంతా కేటాయిస్తున్నారు తప్ప విమర్శలను గట్టిగా తిప్పికొట్టలేకపోతున్నారు. దీంతోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  కేటీఆర్ పీఏ తిరుపతిపై నేరుగా ఆరోపణలు గుప్పించారు. ఇక బండి సంజయ్ కూడా టీఎస్పీఎస్సీ పరీక్షల్లో అధిక మార్కులు టీఆర్ఎస్ నేతల పిల్లలకే వచ్చాయని ఆరోపించారు. అంతే కాదు.. ఆ వివరాలన్నీ బయటపెట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ కూడా మూకుమ్మడిగా చేస్తున్న విమర్శల దాడిలో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. పేపర్ల లీకేజీపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసినా.. విపక్షాలు నెమ్మదించడం లేదు. సిట్ పై నమ్మకం లేదంటున్నాయి. ఏ విధంగా చూసుకున్నా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు, పేపర్ల లీకేజీ కేసీ బీఆర్ఎస్ అధినేతకు శిరోభారంగానే పరిణమించాయని చెప్పక తప్పదు. ఈడీ విచారణ విషయంలో బీఆర్ఎస్ హై డ్రామా అభాసుపాలైన సంగతి మరవక ముందే... పేపర్ల లీకేజీ విషయంలో ఆరోపణలు చేసిన రేవంత్ కు ఆధారాలివ్వాలంటూ సిట్ నోటీసు జారీ చేయడమూ అంతే అభాసుపాలయ్యింది.