ఫోన్ ట్యాపింగా? నమ్మినవాళ్ల కుట్రా? ఫోన్ సంభాషణల లీక్ వెనుక ఉన్నదెవరు?

కరీంనగర్ జిల్లాలో ఫోన్ ఆడియో లీకేజీలు కలకలం రేపుతున్నాయి. కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్, ఎంపీ బండి సంజయ్ గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మాట్లాడుకున్న సంభాషణకు సంబంధించిన ఆడియోలు లీక్ అయ్యాయి. రెండు ఆడియో రికార్డింగ్స్ సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం సంచలనంగా మారింది. మొదటి ఆడియోలో గత అసెంబ్లీ ఎన్నికల ఖర్చు విషయంలో బండి సంజయ్, కలెక్టర్ మధ్య సంభాషణ జరిగింది. అయితే బండి సంజయ్-కలెక్టర్ మధ్య సాగిన సంభాషణ... మంత్రి గంగుల కమలాకర్ గురించేనన్న టాక్ వినిపిస్తోంది.

అయితే, కలెక్టర్ తో బండి సంజయ్ మాట్లాడిన ఫోన్ సంభాషణలు  బయటికి రావడంతో... బీజేపీపై టీఆర్ఎస్ విరుచుకుపడుతోంది. ఇందులో ఏదో కుట్ర ఉందంటూ స్వయంగా మంత్రి గంగుల కమలాకరే ఆరోపిస్తున్నారు. అయితే, టీఆర్ఎస్ లీడర్ల ఆరోపణలకు బీజేపీ స్ట్రాంగ్ కౌంటరిస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం విపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేస్తోందని, అందుకే బండి సంజయ్-కలెక్టర్ మాట్లాడుకున్న ఫోన్ సంభాషణ బయటికి వచ్చిందని ఆరోపిస్తున్నారు. అయినా, లీకైన ఆడియోలో బండి సంజయ్ తప్పుగా ఏమీ మాట్లాడలేదని బీజేపీ అంటోంది. గంగుల కమలాకర్ ఎన్నికల ఖర్చుతోపాటు పెయిడ్ న్యూస్ వ్యవహారాన్ని బండి సంజయ్... కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తున్నట్లు ఆ ఆడియోల్లో ఉంది. బండి సంజయ్ ప్రశ్నలకు కలెక్టర్ సమాధానం ఇచ్చేందుకు సుముఖంగా లేనట్లు లీకైన ఆడియోలను బట్టి తెలుస్తోంది.

అయితే, కలెక్టర్ తో మాట్లాడిన ఫోన్ ఆడియో ఎలా బయటికి వచ్చిందని, ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేశారని, దాన్ని ఎవరు బయటికి వదిలిపెట్టారని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పైగా అసెంబ్లీ ఎన్నికల టైమ్ లో మాట్లాడగా, దాదాపు ఏడాది తర్వాత ఆ ఫోన్ ఆడియోలు లీక్ చేయడం వెనుక టీఆర్ఎస్ హస్తముందని బీజేపీ ఆరోపిస్తోంది. బండి సంజయ్ ఫోన్ సంభాషణల లీక్ వెనుక ఏదో కుట్ర, రాజకీయ కోణం ఉందని కాషాయ దళం అనుమానిస్తోంది. ఫోన్ సంభాషణల లీక్ పై ఎంపీ బండి సంజయ్ కూడా సీరియస్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కోణంలో ఈ వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని చూస్తున్నారు. మొత్తానికి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్పరాజ్ అహ‍్మద్... ఎంపీ బండి సంజయ్ మధ్య జరిగిన ఫోన్ కాల్ సంభాషణ హాట్ టాపిక్‌గా మారగా, రాజకీయ నేతల కుట్రలో కలెక్టర్ ఇరుక్కుపోయారనే మాట వినిపిస్తోంది. మరి, ఫోన్ ట్యాపింగ్ అండ్ ఆడియో లీక్ వ్యవహారంపై కలెక్టర్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.