తెలంగాణ తొలిపొద్దు కాళోజీ.. అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు

ఒక్క సిరాచుక్క లక్షల మెదళ్లకు కదలిక.. ఇది కాళోజీ నారాయణరావు చెప్పిన మాట. చెప్పడమే కాదు తన అక్షరాలతో ఎందరినో కదిలించిన ప్రజాకవి ఆయన. నిజాం నిరంకుశత్వానికి, అరాచక పాలనకి వ్యతిరేకంగా కలం ఎత్తిన తెలంగాణా ఉద్యమకారుడు కాళోజీ.

 

1914, సెప్టెంబరు 9 న కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ జిల్లా లోని రట్టిహళ్లి గ్రామంలో కాళోజీ జన్మించారు. ఆయన తల్లి రమాబాయమ్మ కన్నడిగుల ఆడపడుచు. తండ్రి కాళోజీ రంగారావు మహారాష్ట్రీయుడు. బీజాపూర్ నుంచి వరంగల్ జిల్లాకు తరలివచ్చిన కాళోజీ కుటుంబం మడికొండలో స్థిరపడింది. కాళోజీ జన్మించిన అయిదారు ఏళ్లకే రమాబాయమ్మ చనిపోవడంతో అన్నే అమ్మగా మారి తమ్ముడు కాళోజిని పెంచి పెద్దచేశారు. 

 

కాళోజీ తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లీషు భాషల్లో రచయితగా ప్రఖ్యాతిగాంచారు. రాజకీయ వ్యంగ్య కవిత్వం వ్రాయడంలో కాళోజీ దిట్ట. ‘నా గొడవ’ పేరిట సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా స్పందిస్తూ పాలకులపై అక్షరాయుధాలను సంధించి ప్రజాకవిగా కీర్తిగడించారు.

 

1930 నుంచే కాళోజీ గ్రంథాలయోద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయం ఉండాలన్నది కాళోజీ ఆకాంక్ష. సత్యాగ్రహోద్యమంలో పాల్గొని 25 సంవత్సరాల వయసులో జైలుశిక్ష అనుభవించారు. సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, పి.వి.నరసింహారావు వంటి వారితో కలిసి కాళోజీ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వరంగల్లులో గణపతి ఉత్సవాలు నిర్వహించారు. వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించినందుకు ఆయనకు నగర బహిష్కరణశిక్ష విధించారు. 1953లో తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. 1958లో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఎన్నికయ్యారు. కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయగా, భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది.

 

కాళోజీ రాసిన మాటలు ఎన్నో చరిత్రలో చెరగని ముద్రవేశాయి. ఆయన మాటలు ఇప్పటికీ మనల్ని ఆలోచింపజేస్తాయి, కదిలిస్తాయి.

 

"అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి. అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి. అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు" అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ. 'అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు'.. ఈ ఒక్క మాట చాలదా.. కాళోజీ వ్యక్తిత్వం ఏంటో, కవిత్వం ఏంటో చెప్పటానికి.

 

"తెలుగు బిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు.. సంకోచ పడియెదవు సంగతేమిటిరా? అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు.. సకిలించు ఆంధ్రుడా! చావవేటికిరా" అని మాతృభాష అయిన తెలుగును చిన్న చూపు చూస్తూ పరభాష వ్యామోహంతో కూరుకుపోయిన వారిని సూటిగా ప్రశ్నించిన కవి కాళోజీ. తెలుగుని చులకనగా చూస్తున్న ఈ తరం వారికి అది చెంపదెబ్బ లాంటిది.

 

"ఎవని వాడుక భాష వాడు రాయాలె. ఇట్ల రాస్తే అవతలోనికి తెలుస్తదా అని ముందర్నే మనమనుకునుడు, మనను మనం తక్కువ చేసుకున్నట్లె. ఈ బానిస భావన పోవాలె. నే నెన్నో సార్లు చెప్పిన. భాష రెండు తీర్లు- ఒకటి బడి పలుకుల భాష, రెండోది పలుకు బడుల భాష. పలుకు బడుల భాషగావాలె." అంటూ మన భాషని, మన యాసని మనమే తక్కువ చేసుకుంటే ఎట్లా? అని ఆలోచింపజేసిన కవి కాళోజీ.

 

ఇలా ఒకటా రెండా.. ఆయన మాటలు చరిత్ర పుటల్లో చెక్కుచెదరని సంతకాలు. "పుటక నీది. చావు నీది. బతుకంతా దేశానిదీ".. ఇది జయప్రకాశ్ నారాయణ మరణించినపుడు కాళోజి చెప్పిన మాట. ఆయన దేశం కోసం బ్రతికాడు, మరి మీరు? అని మనల్ని సూటిగా ప్రశ్నించినట్టు లేదూ.

 

ఇక, కాళోజిని పెంచి పెద్దచేసిన ఆయన అన్న కాళోజీ రామేశ్వరరావు 1996 లో చనిపోయినప్పుడు.. కాళోజీ అన్న మాట "నేను నా ఆరవయేట మా అన్న భుజాల మీదికెక్కినాను. అతను మరణించేదాకా దిగలేదు. నేను అతను భుజాల మీదికి ఎక్కడం గొప్ప కాదు. 70 ఏళ్ల వరకూ అతను నన్ను దించకుండా ఉండడం గొప్ప". ఒక్క మాటతో అన్నయ్య గొప్పతనాన్ని, తనకి అన్నయ్య మీదున్న ప్రేమని తెలియజేసారు కాళోజీ.

 

‘హింస తప్పు, రాజ్యహింస మరీ తప్పు’ అంటూ "సామాన్యుడే నా దేవుడు" అని ప్రకటించిన కాళోజీ 2002 నవంబరు 13 న తుదిశ్వాస విడిచారు. కాళోజీ జన్మదినాన్ని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించి గౌరవించింది.