చిరుతిళ్ల రహస్యం తెలిసిపోయింది

 

పిజ్జా, బర్గర్, శాండ్విచ్... ఇవన్నీ ఒకప్పుటి తరానికి తెలియవు. ఇప్పటి తరానికి మాత్రం ఇవి లేనిదే రోజు గడవదు. కొందరు అడపాదడపా వీటిని రుచిచూసేందుకు సిద్ధపడితే, మరికొందరేమో ఇవి లేకుండా జీవితం వృధా అన్నంత వ్యసనంతో బతికేస్తుంటారు. జంక్ఫుడ్స్ పట్ల కొందరు ఎందుకంత కోరిక పెంచుకుంటారు? ఈ విషయం మీదే షికాగోలోని ఓ విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణులు పరిశోధన నిర్వహించారు.

 

జంక్ఫుడ్స్కీ నిద్రలేమికీ మధ్య సంబంధం ఉందేమో అన్న అనుమానం చాలా రోజుల నుంచీ పరిశోధకులను వేధిస్తోంది. ఈ విషయాన్నే నిరూపించేందుకు నిపుణులు నడుం కట్టారు. ఇందుకోసం వారు ఓ బృందాన్ని ఎన్నుకొన్నారు. వీరిలో కొందరిని రోజులో కేవలం నాలుగు గంటలు మాత్రమే పడుకోమని చెప్పారు. మరికొందరేమో నిరభ్యంతరంగా ఎనిమిదేసి గంటలు పడుకోవచ్చునని సూచించారు. ఇలా నిద్రపోయి లేచిన తరువాత, వారందరికీ రకరకాల వాసనలు చూపించారు. ఆశ్చర్యకరంగా తక్కువసేపు నిద్రపోయిన లేచినవారు... ఘాటైన వాసనలకు త్వరగా ప్రతిస్పందిస్తున్నట్లు తేలింది. కస్టమర్లను ఆకర్షించేందుకు జంక్ఫుడ్స్ని రకరకాల మసాలాలతో ముంచెత్తేస్తారన్న విషయం తెలిసిందే కదా!

 

నిద్రలేమికీ, జంక్ఫుడ్స్ పట్ల కోరికకీ మధ్య ఉన్న సంబంధం ఈ పరిశోధనతో తేలిపోయింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసేవారు ఈ తరహా ఆహారాన్ని ఇష్టపడేందుకు బహుశా ఇదే కారణం కావచ్చు. ఎటూకాని పనివేళలు, సరిగా నిద్రపోనీయని ఒత్తిడి కారణంగా వీరు జంక్ఫుడ్స్ పట్ల మొగ్గు చూపుతారేమో!

 

నిద్రలేమి వల్ల పనికిమాలిన తిండికి అలవాటు పడటం ఒక ప్రమాదమైతే... అసలు మనం తీసుకునే కొన్ని రకాల ఆహారం ఆ నిద్రలేమికి కారణం కావడం మరో విచిత్రం. కొవ్వు, మాంసకృత్తులు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల సరిగా నిద్రపట్టదని నిపుణులూ హెచ్చరిస్తూ ఉంటారు. కానీ మనం రాత్రిపూట ఇలాంటి ఆహారాన్నే తీసుకోవడం గమనార్హం. అంటే తగిన ఆహారం తీసుకోకపోవడం వల్ల నిద్రపట్టకపోవడం, అలా నిద్రపట్టకపోవడం వల్ల మళ్లీ జంక్ ఫుడ్స్కి మొగ్గుచూపడం... ఇదంతా ఒక విషవలయంలాగా మారిపోతోందన్నమాట!

 

జంక్ ఫుడ్స్ వల్ల ఊబకాయం, రక్తపోటు, డయాబెటిస్, కొలెస్ట్రాల్, డిప్రెషన్, మలబద్ధకం... వంటి నానారకాల సమస్యలూ తలెత్తుతాయన్న విషయం తెలిసిందే! మరి జిహ్వచాపల్యానికి లొంగిపోయి ఇన్నేసి రోగాలను కోరితెచ్చుకోవడమో, ఆయుష్షు కోసం ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవడమో మన చేతుల్లోనే ఉంది.

- నిర్జర.