ఆ సమయంలో అల్లం తింటే ఇక అంతే!
posted on Mar 12, 2019 12:03PM
అల్లం టీ... అల్లం పెసరట్టు... అల్లం చట్నీ... ఏదో ఒక రూపంలో అల్లాన్ని ఇష్టంగా తీసుకుంటూ ఉంటాం. తీసుకోవడం ఎంతో మంచిది కూడా. ఎందుకంటే అల్లం ఆహార పదార్థాలకు ఎంత రుచినిస్తుందో... అందులో ఉండే పోషక విలువలు ఆరోగ్యానికి అంతకు ఎన్నో రెట్లు మేలు చేస్తాయి. దీనిలో అత్యధిక మోతాదులో ఉండే ఎంజైమ్స్... జీర్ణశక్తిని మెరుగుపర్చడమే కాక, శరీరంలోని మలినాలను తొలగిపోయేలా చేస్తాయి. అందుకే అల్లాన్ని ప్రపంచంలోనే అత్యంత ఉత్తమమైన, ఉపయోగకరమైన దినుసుగా పరిగణిస్తుంటారు. అయితే అంత మంచిదైన అల్లం కూడా కొన్ని సమయాల్లో చేటు చేస్తుంది అంటున్నారు నిపుణులు.
అల్లం రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. అందువల్లే ఒబెసిటీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు... కొన్ని రకాల నాడీపరమైన సమస్యలకు ఇది మంచి మందులా పని చేస్తుంది. అయితే హెమోఫిలియా ఉన్నవాళ్లు మాత్రం దీన్ని తీసుకోకూడదు. ఎందుకంటే ఈ వ్యాధి ఉన్నవాళ్ల రక్తం గడ్డకట్టదు. దాంతో చిన్నపాటి గాయం కూడా తీవ్ర రక్తస్రావానికి దారితీసి ప్రాణహాని సైతం సంభవిస్తుంది. కాబట్టి ఈ సమస్య ఉన్నవాళ్లు అల్లం తీసుకుంటే సమస్య మరింత తీవ్రమై పరిస్థితి చేజారే ప్రమాదం ఉంటుంది.
అలాగే బీపీ, షుగర్ లకు ఎక్కువ మోతాదులో మందులు తీసుకునేవాళ్లు కూడా అల్లం తీసుకోకపోవడం మంచిది. ముఖ్యంగా అల్లం రక్తపోటుని తగ్గిస్తుంది. దానివల్ల ఆయా మందులు పని చేయకపోవచ్చు. అదే విధంగా బరువు పెరగాలనుకునేవారు కూడా అల్లానికి కాస్త దూరంగానే ఉండాలి. కారణం... అందులో ఉండే పీచు పదార్థాలు జీర్ణశక్తిని మెరుగుపర్చి, కొవ్వుని కరిగిపోయేలా చేస్తాయి. అదే జరిగితే అసలే బరువు తక్కువ ఉన్నవాళ్లు మరింత తగ్గిపోతారు. అదే బరువు తక్కువ ఉన్న మహిళల్లో అయితే నెలసరి సమస్యలు కూడా వస్తాయి.
గర్భవతులు కూడా అల్లానికి కాస్త దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే అల్లానికి కండరాలను బలపర్చి, వాటిని యాక్టివ్ చేసే లక్షణం ఉంది. దాంతో నెలలు నిండుతున్న సమయంలో తీసుకుంటే త్వరగా కాన్పు అయిపోవచ్చు. అందుకే వేవిళ్ల సమయంలో తప్ప గర్భవతులు అల్లం ఎక్కువ తీసుకోకూడదు.
చూశారు కదా! తీసుకోకూడని సమయంలో తీసుకుంటే మేలు చేసేవే కీడు చేస్తాయి. కాబట్టి పై సమస్యలు ఉన్నవాళ్లు అల్లం మీద ప్రీతిని కాస్త తగ్గించుకోవడమే మంచిది. అంతకీ అవసరం అనుకుంటే... ప్రముఖ న్యూట్రిషనిస్ట్ మిల్కా రైసెవిక్ చెప్పినట్టు అల్లం బదులు మిరియాలు తీసుకోండి. బ్యాలెన్స్ అయిపోతుంది.
- Nirjara