‘చానా ముదురు’.. సానా సతీష్ వెనుక అదృశ్య శక్తి ఎవరు..?

(శుభకర్ మేడసాని, ఇన్‌పుట్ ఎడిటర్, తెలుగువన్)

వెల్‌కమ్ టు తెలుగువన్. సోమవారం నాడు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధాన వార్త ‘చానా ముదురు.. కూటమి సర్కారులో చక్రం తిప్పుతున్న రాజ్యాంగేతర శక్తి.. మంత్రి లోకేష్ పేరు చెబుతూ మంత్రాంగం.. మైనింగ్ కాంట్రాక్టులు, పోస్టింగుల్లో హవా.. నాకేం కావాలో ఇవ్వండి.. మీకేం కావాలో చెప్పండి.. నాకు కావల్సింది ఇవ్వండి.. మైనింగ్, కోరుకున్న పోస్టింగ్ కావాలా.. అయితే కాంటాక్ట్ మీ.. బిల్లులు క్లియర్ కావాలా? కమిషన్ కొడితే ఆల్ ఓకే..’’ ఏమిటిదంతా అనుకుంటున్నారా? కూటమి సర్కారులో నేనే సూపర్ పవర్ అని చెప్పుకుంటున్న ఒక ‘రాజ్యాంగేతర శక్తి’ దందా ఇది అంటూ ఆ వ్యక్తి పేరు నేరుగా చెప్పకుండా ఆంధ్రజ్యోతి వార్తను ప్రచురించింది. మేమిక్కడ మీకు ఆ వ్యక్తి పుట్టు పూర్వోత్తరాల సమగ్ర సమాచారాన్ని మీకు తెలియజేస్తాం. 

మన కథలో హీరో కాకినాడ వాస్తవ్యులు. పేరు సానా సతీష్‌బాబు. జనసేన తరఫున కాకినాడ నుంచి పోటీ చేయాలని ఉత్సాహపడిన సానా సతీష్ ఆశలపై పవన్ కళ్యాణ్ నీళ్ళు చల్లారు. తండ్రి ప్రభుత్వోద్యోగిగా చనిపోవడంతో కారుణ్య నియామకంలో భాగంగా పాలిటెక్నిక్ చదివిన సానా సతీష్‌కి ఎలక్ట్రిసిటీ డిపార్ట్.మెంట్‌లో ఉద్యోగం దక్కింది. అనతికాలంలోనే సస్పెన్షన్ వేటు పడింది. చేతిలో చిల్లిగవ్వ లేకుండా హైదరాబాద్‌కి వచ్చిన సానా సతీష్ అతి తక్కువ సమయంలో తీస్‌మార్‌ఖాన్ స్థాయికి ఎదిగాడు. ఈ సానపట్టిన కంత్రీ కత్తి సతీష్‌కి రెండు వైపులా పదును వుంటుంది. ఎం.ధర్మరాజు ఎంఏ సినిమాలో హీరో ప్రస్థానం తెలుసుగా..! ఎమ్మెల్యే గోవిందరావు  గోవిందం అవుతాడు!  కొబ్బరి చిప్పలు  ఏరుకునే  అవతారం యమధర్మరాజు ఎంఏ అవుతాడు!    సానా సతీష్ గురించి తెలిసిన వాళ్ళు ఈ పోలిక చెబుతుంటారు. సానా  సతీష్  రాజకీయ నాయకుడు  కాకపోయినా అంతకు మించిన శక్తివంతుడు.  అంతర్జాతీయ పవర్ బ్రోకర్ అనే  పేరు  ప్రచారంలో వుంది. సానా స్థాయిని  మీరు  అంచనా వేయాలంటే  అతని క్టయింట్స్ లిస్టులో  వున్న  ఒక పేరు చూద్దాం. 

మొయిన్ అక్తర్ ఖురేషి 1993లో ఉత్తరప్రదేశ్‌లో గొడ్డు మాంసం స్లాటర్‌ హౌస్‌ను ప్రారంభించాడు. వ్యాపారం 2010 నాటికి భారతదేశపు అతిపెద్ద మాంసం ఎగుమతిదారు ఖురేషీ కావటం విశేషం. అంతే కాదు  అతను అతి పెద్ద  పన్ను ఎగవేతదారుడు.   మాంసం ఎగుమతి వ్యాపారంలో మాత్రమే కాకుండా దుబాయ్, లండన్, యూరప్‌లలో హవాలా చానల్స్ నెలకొల్పడంలో మొనగాడు. ఇద్దరు మాజీ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) చీఫ్‌లతో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు  మొయిన్ అక్తర్ ఖురేషి అత్యంత సన్నిహితుడు. నాటి కాంగ్రెస్ యూపీఏ-2 ప్రభుత్వ పాలనలో ఆదాయపు పన్ను విభాగం, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఖురేషీ  కార్యకలాపాలను పసిగట్టాయి. ఖురేషీకి నాటి కాంగ్రెస్ అగ్రనేతల రక్షణ వుందనేది బహిరంగ రహస్యం. ఖురేషీ కుమార్తె పెర్నియా ఖురేషీ, భార్య నస్రీన్ ఖురేషీ షెల్ కంపెనీలకు నిధులను బదిలీ చేయడం, యూరప్‌లోని హై ఎండ్ లగ్జరీ డిజైనర్ బ్రాండ్‌లకు చెల్లింపులు చేయడం, అత్యంత ఖరీదైన ఆ వస్తువులను ఇక్కడి ప్రభుత్వ అధికారులకు బహుమతులుగా అందజేయడం జరిగేది. ఆ తప్పుడు అధికారుల నుండి నుండి ఖురేషీ అనేక రకాల ప్రయోజనాలను పొందేవాడు. చివరికి నాటి సీబీఐ చీఫ్‌లు- రంజిత్ సిన్హా, ఏపీ సింగ్, ఖురేషి మధ్య  ఫోన్ సంభాషణలు సీబీఐ దృష్టికి వచ్చాయి. రంజిత్ సిన్హాపై సీబీఐ కేసు నమోదు చేయగా, ఏపీ సింగ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుని పదవి నుండి వైదొలగవలసి వచ్చింది. వారిద్దరూ తమపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. నాలుగు సంవత్సరాల జైలు తరువాత ఖురేషీ- బెయిల్ మీద బయటకు వచ్చారు. సానా సతీష్ క్లయింట్ మొయిన్ అక్తర్ ఖురేషి కావడం విశేషం.  ఇదీ  సానా సతీష్  రేంజ్.  2014లో మొయిన్ అక్తర్ ఖురేషీ 15 నెలల్లో కనీసం 70 సార్లు అప్పటి సీబీఐ చీఫ్ రంజిత్ సిన్హా నివాసానికి వెళ్ళినట్లు, సిన్హా ద్వారా సీబీఐ కేసులో తన స్నేహితుడికి బెయిల్ ఇప్పించేందుకు ఖురేషీ కోటి రూపాయలు చెల్లించినట్లు సానా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు ఫిర్యాదు చేసాడు. అదేంటి ఖురేషి సానా సతీష్ క్లెయింట్ కదా! అలా ఎలా చేశాడు అంటారా?  

ఎం.ధర్మరాజు ఎంఏలో మనోడు అవతారం క్యారెక్టర్ అని చెప్పుకున్నాం కదా!  ఈ ట్విస్ట్ ఇంట్రస్టింగ్‌గా  వుంటుంది.  నాటి  సంఘటన  ప్రధాని కార్యాలయంతో  పాటు  పార్లమెంట్,  సుప్రీం కోర్టులో  కూడా సంచలనం రేకెత్తించింది.  నాటి సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను  పదవిలో నుండి  దింపాలి. అదేంటి  కేంద్ర ప్రభుత్వం  సెంట్రల్ విజెలెన్స్ కమీషన్ సంయుక్తంగా నియమించిన సీబీఐ డైరెక్టర్‌ను సానా సతీష్ దించేయాలనుకోవడం  ఏంటి? కారణం ఏంటంటే రాకేష్ ఆస్థాన  అనే  ఐపీఎస్ అధికారి   సానా సతీష్ క్లయింట్! అలోక్ వర్మను అవినీతి  ఆరోపణలతో  దింపేస్తే  ఆ తరువాత  వరుసలో  సీనియర్ అయిన రాకేష్ ఆస్థాన  సీబీఐ చీఫ్ అవుతారన్నమాట!   రాకేష్  ఆస్థాన సీబీఐ హెడ్ అయితే  సానా  వారి  బ్రోకర్ పనులకు అడ్డు, అదుపు వుండదు. దేశంలో  సీబీఐ కేసులు నమోదు అయిన  నేరస్థులు, ఆర్థిక నేరస్థులు సానా సతీష్ క్లెయింట్స్.గా  మారతారు. అది అసలు స్కెచ్.  ‘అతడు’ సినిమాలో  కోట శ్రీనివాసరావు  డైలాగ్  ‘అన్నీ మన హైదరాబాదులోనే  దొరకుతున్నాయి’ అన్నట్టు.  దేశంలో  ఏ తప్పుడు  పని చేసినా  మన హైదరాబాద్‌లో  పని అవుతుందన్నమాట!  విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఆలోక్ వర్మ పదవి పోయింది. రాకేష్ ఆస్థానను విధులకు దూరం పెట్టింది. 1986 బ్యాచ్ ఒడిశా కేడర్ ఐపీఎస్ అధికారి అయిన మన్నెం నాగేశ్వరరావును  సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నియామకం జరిగింది. అర్ధరాత్రి బాధ్యతలు తీసుకున్న నాగేశ్వరరావు  ఆ రాత్రి నుండి తెల్లారి ఉదయం వరకు ఆఫీసులోనే వుండి రాత్రంతా పని చేశారు. ఈ రచ్చలో  విచారణ అధికారులు  13 మందిని బదిలీ చేసారు.  ఆ రాత్రి ఏం జరిగిందో తెలుసుకోవాలని నేను స్వయంగా నాటి సీబీఐ డైరెక్టర్ నాగేశ్వరరావుకు ఫోన్ చేశాను.  ఆయన దీనిపై  స్పందించటానికి  నిరాకరించారు. 

సానా సతీష్ తన ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకుని హైదరాబాద్‌కు వెళ్లి అనేక కంపెనీలను ప్రారంభించాడు. కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్‌లకు చెందిన పలువురు రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడు. నాడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌లోకి గోకరాజు గంగరాజు ద్వారా అడుగు పెట్టాడు. గురువుగారు గురువుగారు అంటూ గు.. గుండెల్లో తన్నాడు గోకరాజుని. గోకరాజు గంగరాజు, వంకిన చాముండేశ్వరనాథ్ ఒకప్పుడు మంచి స్నేహితులు. ఇద్దరి మధ్య  సానా చిచ్చుపెట్టాడని  చెప్పుకుంటారు. చాముండి ద్వారా సచిన్ టెండూల్కర్, అజారుద్దీన్ ఇతర దేశంలో ప్రముఖ మోడల్స్.తో సానీ సతీష్ సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడని చెప్పుకుంటారు. 
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్‌కు అత్యంత సమీపంలో బాచారం అనే గ్రామంలో 412 ఎకరాల వివాదాస్పద భూమి  బ్యాంక్‌లో  తాకట్టుపెట్టి  సానా 60 కోట్లు  సొమ్ము చేసుకున్నాడని సమాచారం. ఈ  412  ఎకరాలకు  తానే ఓనర్ అని  పలువుర్ని  బురిడీ కొట్టించిన ఘనుడు మనోడు. వ్యాపార భాగస్వాములను మోసం చేయటం... వెన్నుపోటు పొడవడం... తొక్కుకుంటూ వెళ్ళటం ఈయన నైజం అని మార్కెట్ టాక్!  

సానా సతీష్ బాబు రసమ ఎస్టేట్స్ ఎల్‌ఎల్‌పి, గోల్డ్‌కోస్ట్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, మ్యాట్రిక్స్ నేచురల్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి అనేక కంపెనీలకు డైరెక్టర్‌గా ఉన్నారు. మరో కంపెనీ ఎస్ఆర్ఎఎస్ మెరైన్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. దుబాయ్ నుండి ఫారిన్ లిక్కర్ సరఫరా వ్యాపారంలో కూడా  సానాకు  ప్రవేశం వుంది. నిమ్మగడ ప్రసాద్‌కు చెందిన వాన్‌పిక్‌ గ్రూప్‌లో సానా సతీష్  డైరెక్టర్‌గా  కొనసాగారు. నాటి కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఆమంచి కృష్ణ మోహన్ సహకారంతో  వాన్ పిక్  కోసం  రైతులను సానా సతీష్ నిలువునా మోసం చేశాడనే ఆరోపణ బలంగా వుంది. ఆమంచి కృష్ణమోహన్‌కు గురువు సానా  సతీష్ అని చెప్పుకుంటారు. నాటి మంత్రి  బొత్స సత్యనారాయణ  కష్టపడి చెమటోడ్చి సంపాదించిన  డబ్బులు  సానా సతీష్ దగ్గర  దాచుకున్నాడని  టాక్ !  అదే కోవలో  వట్టి వసంత కుమార్  పైసలు కూడా! ఫోక్స్ వ్యాగన్  కుంభకోణంలో నాటి మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ సొమ్ములు పోనాయ్  ఏటి సేత్తాం  అనే దాంట్లో  వెనక వుంది మనోడే ! కాకినాడ సీ పోర్ట్ ట్రాన్స్.పోర్ట్ కాంట్రాక్ట్ ఆధిపత్య పోరులో ఒకరిని హతమార్చడంలో సానా సతీష్ హస్తం వుందని అప్పట్లో  పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. 

మరి  ఇన్ని డిగ్రీలు వున్న  సానా సతీష్‌కు  ఏపీ ప్రభుత్వంలో  ఎర్ర తివాచీ పరచి స్వాగతం పలికింది ఎవరు అని  ఒక  మీడియా అధినేతను ప్రశ్నించగా  తెలుగుదేశం పార్టీ  యువ నాయకుడికి, అత్యంత సన్నిహితుడికి హైదరాబాదు సానా గెస్ట్ హౌస్‌లో విందులు వినోదాలు  సకల భోగాలు ఏర్పాటు చేసి ప్రసన్నం చేసుకున్నాడని తెలియజేశారు. ఈ మధ్యనే  ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీగా నియమింపబడ్డాడు. సానా సతీష్  విజయవాడలో  ఒక ప్రముఖ హోటల్లో తొమ్మిదో ఫ్లోర్లో ఉంటూ రాష్ట్రానికి చెందిన పారిశ్రామికవేత్తలను అక్కడకు పిలిపించుకుని పనులు చేయించి పెడతాను...  బదిలీలు చేయిస్తాను అనే వార్త  రెండు తెలుగు రాష్ట్రాల్లో  సంచలనంగా మారింది. మీరు ఇప్పటి వరకు 9వ  ప్లోర్ గురించి తెలుసుకున్నారు.  వచ్చే  ఎపిసోడ్‌లో మూడో ఫ్లోర్ గురించి తెలుసుకుంటారు.