పెళ్లాం ముఖమైనా చూడొద్దా?

 

టీడీపీ ఎంపీ  జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. నాలుగు రోజుల పాటు అన్నం తినకుండా ఉంటే ఎవరికైనా నీరసం వస్తుందని, ఢిల్లీలో కూర్చుని దీక్ష చేస్తున్నామని చెబుతున్న వైసీపీ నేతలు అంతకన్నా ఇంకేమీ చేయలేరని తెలుగుదేశం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. నిరాహారదీక్షకు కూర్చున్న ఐదుగురిలో ఇప్పటికే మూడు వికెట్లు పడిపోయాయని, ఆరోగ్యం క్షీణించిందని చెబుతూ నేడో, రేపో మిగతా ఇద్దరూ ఆసుపత్రులకు వెళ్లిపోతారని చెప్పారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములు చేసినట్టుగా మరణించేంత వరకూ వైకాపా ఎంపీలు దీక్షలు చేయగలరా? అని జేసీ ప్రశ్నించారు.

 

ఇంకా చంద్రబాబు తలపెట్టిన బస్సు యాత్ర వాయిదా పడటంపై స్పందించిన ఆయన మాట్లాడుతూ.. నిరసనలన్నీ ఒకే రోజు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీలో చాలా రోజులు ఉండి వచ్చామని, తాము కనీసం ఇంటికి వెళ్లి పెళ్లాం ముఖమైనా చూడవద్దా? అని చమత్కరించారు. అప్పుడే యాత్ర అంటూ బస్సు ఎక్కమంటే ఎలాగని ప్రశ్నించారు. కేంద్రం చేస్తున్న అన్యాయంపై ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత తమకుందని అభిప్రాయపడ్డ జేసీ, అతి త్వరలోనే బస్సు యాత్ర ఉంటుందని చెప్పారు.