కోటి సంతకాల కధకి సంజాయిషీలు

 

 

వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది. సాధారణంగా విమర్శలు ఎదుర్కొన్న ఏ రాజకీయపార్టీ అయినా తనను తానూ రక్షించుకొనే ప్రయత్నంలో వెంటనే ఆ విమర్శలను ఖండించడమో లేక తనను సమర్దించుకోవడమో లేక దానికి ప్రతి విమర్శలు చేసి ఎదుర్కోవడమో చేస్తుంది. అయితే, వైయస్సార్ కాంగ్రెస్ ఇదివరకు ఒకసారి కోటి సంతకాల సేకరణపై వచ్చిన విమర్శలకు స్పందించినప్పటికీ ఈ రోజు సాక్షి పత్రికలో వచ్చినట్లు సమర్ధంగా లేదు. పార్టీకి సరయిన దశ దిశానిర్దేశం చేసే నాయకుడు లేక పోవడం వల్లనే ఈ జాప్యం అని చెప్పక తప్పదు. ఎట్టకేలకు, ఆ పార్టీకి చెందిన లీగల్ సెల్ కన్వీనర్ ఈ విధంగా స్పందించారు.

 

“సీబీఐను అడ్డంపెట్టుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై చేస్తున్న కక్షసాధింపు చర్యలకు నిరసనగా చేపట్టిన సంతకాల సేకరణ రాజ్యాంగ విరుద్ధం కాదు. ఈ విషయంపై టీడీపీ, కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలు పూర్తిగా అర్థరహితమని ఆయన కొట్టిపారేశారు. తనకు జరిగే అన్యాయాన్ని, అక్రమాలను రాజ్యాంగ పదవిలో ఉన్న వారికి చెప్పుకునే హక్కు, అర్హత దేశంలోని ప్రతీ పౌరుడికి ఉన్నాయని.. ఈ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.”