పాక్-భారత్.. ఏది నిజం..!

 

జమ్మూ కాశ్మీర్, అఖ్నూర్ సెక్టార్ లోని బతాల్ సమీపంలో ఉన్న జనరల్ రిజర్వ్ ఇంజినీరింగ్ ఫోర్స్(జీఆర్‌ఈఎఫ్) ఆర్మీక్యాంపుపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఆర్మీ క్యాంపులో పనిచేసే ముగ్గురు కూలీలు మరణించినట్టు అధికారులు తెలిపారు. అయితే ఇప్పుడు ఆ దాడిపై కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ దాడిలో 30 మంది భారత సైనికులు మృతిచెందారని పాకిస్థాన్‌కి చెందిన ఉగ్ర సంస్థ జమాత్‌ ఉద్‌దవా వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయీద్‌ ప్రకటించాడు.  ఓ సభలో పాల్గొన్న హఫీజ్ సయీద్  ‘భారత్‌ చేసిన సర్జికల్‌ స్ట్రైక్స్‌ బూటకం. మోదీ ప్రజలను మభ్యపెడుతున్నారు. అసలైన లక్షిత దాడులంటే ఏంటో మేము చూపిస్తాం. దీనిలో భాగంగానే రెండు రోజుల క్రితం మన కుర్రాళ్లు నలుగురు అక్నూర్‌ ఆర్మీ క్యాంప్‌కి వెళ్లి 30 మంది భారత సైనికులను మట్టుబెట్టారు. క్యాంప్‌ను తగలబెట్టి వారికి మాత్రం చిన్న గాయం కూడా కాకుండా క్షేమంగా వెనుదిరిగి వచ్చారు.. లక్షిత దాడి అంటే ఇది..’ అని వ్యాఖ్యానించాడు. దీనికి సంభంధించిన ఆడియో టేప్ బయటకు వచ్చింది. ఇప్పుడు దీనిపై స్పందించిన భారత సైన్యం  అటువంటివి ఏం జరగలేదని, సైనికులు ఎవరూ మృతిచెందలేదని, ముగ్గురు కార్మికులు మాత్రమే మృతిచెందారని స్పష్టం చేసింది. మరి ఎవరు చెప్పింది నిజమో తెలియాలంటే కొంత సమయం వెయిట్ చేయాల్సిందే.