కులగణన.. ఎన్నికల ముందు కులాల చిచ్చుకేనా?

ఏపీలో జగన్ మోహన్ రెడ్డి సర్కార్ మరో అనూహ్య నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కులగణన చేపట్టడానికి ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో ఏ కులంలో ఎంత మంది ఉన్నారు? అందులో మగవారు ఎంతమంది.. ఆడవారు ఎంతమంది?, మళ్ళీ అందులో పిల్లలు ఎంతమంది? వారి వయస్సు, వారి ఆర్ధిక పరిస్థితి, ఇల్లూ వాకిలీ, ఉద్యోగం సజ్జోగం, వ్యాపారం ఉపాధీ, కూలీ నాలీ, సెల్ నెంబర్లు, ఆధార్ నెంబర్లు ఇలా సమస్త సమాచారం సేకరించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. ఈ వివరాలతో కూడిన కుల గణన 2024 ఎన్నిక సమయానికి పూర్తి చేయాలని భావిస్తున్నది. ఇంకా చెప్పాలంటే రాష్ట్రంలో పిల్లా జెల్లా ప్రతి ఒక్కరి సమస్త సమాచారం ఎన్నికల సమయానికి ప్రభుత్వం చేతిలో ఉండేలా ఈ కులగణన చేపట్టేందుకు కసరత్తులు చేస్తున్నది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో 14 వేల 5 వందల గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.30 లక్షల మంది ఉద్యోగులు, మరో నాలుగు లక్షల మంది గ్రామ వాలంటీర్లు ఉండగా వీరి ద్వారానే ఈ సమస్త డేటాను సేకరించనున్నట్లు తెలుస్తున్నది. నవంబరు 14 నుంచి ఈ కులగణన మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. 

అయితే, ఏపీ సర్కార్ ఇప్పటికిపుడు ఇలా కులగణన చేయాలని ఎందుకు నిర్ణయించుకుందన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ గణన వలన వైసీపీ ప్రభుత్వానికి వచ్చే లాభమేంటి? ఈ గణనలో తీసుకున్న డేటా ఆధారంగా వైసీపీ ప్రభుత్వం ఏం చేయబోతున్నది? అసలు ఎన్నికలకు ముందు కులగణన చేయడం వెనక ఆంతర్యం ఏంటి? ఈ గణనలో తీసుకున్న డేటా భద్రంగానే ఉంటుందా? సచివాలయ ఉద్యోగులు ఈ డేటాను ప్రభుత్వానికి సక్రమంగా అందిస్తారా? ఫక్తు వైసీపీ కార్యకర్తలైన గ్రామ, వార్డు వాలంటీర్లు ఈ డేటా సేకరణలో విధులు నిర్వర్తించడం సమంజసమేనా? కోట్ల మంది ప్రజల ఆధార్, బ్యాంకు వివరాలు ఎలాంటి అర్హతతో నియమించని సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల చేతికి అందించడం న్యాయబద్దమేనా వంటి పలు అనుమానాలు ఇప్పుడు ప్రజలను వెంటాడుతున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ఈ కులగణనపై సందేహాలు ముప్పిరిగొంటున్నాయి.

నిజానికి, ఒకప్పుడు కేవలం కుల సంఘాలు మాత్రమే ఈ కుల గణన చేపట్టేవి. వారి కులంలో ఆర్ధిక, కుటుంబ స్థితిగతులను తెలుసుకున్న కుల పెద్దలు.. వారి కుల అభివృద్ధికి కొన్ని పాలసీలు తీసుకొచ్చేవారు. కానీ, ఇపుడు ఆ పని నేరుగా ప్రభుత్వమే చేపట్టనుంది. ఈ కులగణన ద్వారా ఆయా కులాలకు ఏర్పాటు చేసిన కార్పోరేషన్ల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వ వర్గాలు చెప్పుకొనే అవకాశం ఉంది. అయితే  జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక కులాలకు ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదు. బడ్జెట్ లో కేటాయించిన నిధులను కూడా వివిధ సమయాల్లో తిరిగి ప్రభుత్వ ఖజానాకు మళ్ళించుకొని బటన్ నొక్కుడుకు వినియోగించేసింది. ఇదే కార్పొరేషన్లను అడ్డం పెట్టుకొని కూడా అప్పు చేసి వాటినీ మళ్ళీ అదే పనికి ఉపయోగించింది. కానీ, ఇప్పుడు ఇలా కులగణనతో మరోసారి లెక్కలు తేలుస్తామని చెప్తుతున్నది.

 అయితే, ఈ కులగణన రాజకీయం, ఓటు బ్యాంకులో భాగంగానే చేపడుతున్నట్లు రాజకీయ వర్గాలు అనుమానిస్తున్నాయి. కేవలం రేపు ఎన్నికలలో తెలుగుదేశం ఓటర్లను ఏరివేసేందుకు మాత్రమే ఈ   డేటా పనిచేస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏ కులంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఎంతమంది జనాభా ఉన్నారు? ఏ కులం ఆధారంగా రాజకీయం చేస్తే ఓట్లు రాలతాయి? ఏ కులానికి గాలమేస్తే గెలుపు అవకాశాలు ఉంటాయి? ఏ కులానికి హామీలిస్తే ఓట్లు పడతాయి అనే దాని కోసమే ఈ కులగణన చేస్తున్నట్లుగా చెబుతున్నారు.   సరిగ్గా ఎన్నికల ముందు ఈ కులగణన రాష్ట్రంలో మరోసారి చిచ్చుపెట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే పలు సామజిక వర్గాలలో అసంతృప్తి నెలకొన్న తరుణంలో ఇలా ఇప్పుడు ఈ కులాల కుంపటిని రగిలించి చిచ్చు పెట్టి  లబ్ది పొందేందుకే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టనుందని అంటున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu