కర్ణాటకం.. ఎండ్ లెస్!
posted on Dec 25, 2025 10:32AM

కొండంత రాగం తీసి కూసింత పాట పడిన సామెతలా తయారైంది కర్ణాటక అధికార మార్పు వ్యవహారం. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు పూర్తయిన సందర్భంగా డీకే శివకుమార్ తనకు సీఎం పీఠం కోసం ముమ్మర ప్రయత్నాలు చేశారు. అధిష్టానం ఓకే అంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఏ విషయం త్వరగా తేల్చండని సీఎం సిద్దరామయ్య సైతం అన్నారు. ఈ నాన్చుడు ధోరణి ప్రభావం పాలనపై పడకూడదని సిద్దరామయ్య చెప్పారు.
కొంత కాలం పాటు బెంగళూరు టు ఢిల్లీ అన్నట్లుగా ప్రత్యేక ఎపిసోడ్లు నడిచాయి. రాహుల్ గాంధీ డీకేకి స్పెషల్ మెసేజీలు పెట్టారు. కట్ చేస్తే ఏదో అనుకుంటే ఏమీ కాలేదు అన్నట్లుగా కర్ణాటకలో సీఎం మార్పు జరగలేదు. కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతోంది. అయితే దీనికి సంబంధించి ఢిల్లీ కర్ణాటక భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో డీకే విలేకరులు సంక్రాంతి తర్వాత చర్చలు ఉంటాయట నిజమేనా అని అడిగారు. దీనికి డీకే ఒకింత అసహనం, మరింత ఘాటు కలగలిపిన సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో సీఎం మార్పునకు సంబంధించిన చర్చలు మీడియాలో తప్ప మా మధ్య జరగడం లేదన్న డీకే.. అక్కడితో ఆగకుండా, అన్ని విషయాలు చెప్పుకునేవి కావని కూడా వ్యాఖ్యానించారు. దీంతో కర్నా టక సీఎం మార్పు వ్యవహారం ముగిసిపోయిందా? అన్నచర్చ జోరందుకుంది.
దానికి తోడు డీకే మరి కొన్ని కీలకమైన కామెంట్లు కూడా చేశారు. తనకు అధికారం కన్నాకాంగ్రెస్ కార్యకర్తగా ఉండటమే ఎక్కువ ఇంట్రస్టన్నారు. 80వ దశకం నుంచీ తానిలాగే హ్యాపీగా ఉన్నానన్నారు. తామంతా అంటే, డీకే, సిద్ధూ, ఇతర కార్యకర్తలందరం కలసి కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి రావడానికి కృషి చేశామనీ.. అలాగని అధికారంలో భాగస్వామ్యం కావాలని తాను కోరుకోవడం లేదని చెప్పుకొచ్చారు. విదేశాల నుంచి రాహుల్ రాగానే ఆయన్ను వెళ్లి ఇబ్బంది పెట్టలేనని కూడా ముక్తాయించారు.
దీనంతటిని బట్టిచూస్తే డీకే తన తరఫు అటెంప్ట్ లు అన్నీచేసి ఫలితం కోసం వేచి చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ పార్టీ పరమైన ఆటంకాలేంటని చూస్తే సిద్ధూని తొలగిస్తే ఒక సమస్య. ఆయన వర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయా సామాజిక వర్గాలు పార్టీపట్ల వ్యతిరేకతను పెంచుకుంటాయి. ఇక డీకేని నిర్లక్ష్యం చేస్తే.. కష్టపడ్డ వారికి అందలం దక్కదన్న సంకేతం వెళ్తుంది. దీంతో అధిష్టానం కూడా సందిగ్దావస్థలో ఉన్నట్లు తెలుస్తోంది.