జ‌గ‌న్ సర్కార్ నిర్ల‌క్ష్య‌మే పోల‌వ‌రానికి శాపం

ఏపీలోని జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం, వ్యూహాత్మక ప్రణాళికా లోపం, తగిన రీతిలో నిధులను విడుదల చేసే సామర్థ్యం లేకపోవడమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యానికి కారణమని  కేంద్రం స్పష్టం చేసింది. సభలో తెలుగుదేశం రాజ్యసభలో ఎంపీ కనకమేడల ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి బదులిచ్చారు. పోలవరం పూర్తికి గడువు పెంచినట్లు పేర్కొన్నారు. 
ఎవ‌రన్నా ఇబ్బందిలో ఉంటే స‌హాయం కావాలంటే చేస్తాన‌నేవారు చాలా అరుదుగా దొరుకుతారు. కానీ త‌ప్ప‌కుండా స‌హాయం చేస్తామ‌న్న‌వారికి కావ‌ల‌సిన స‌మాచారం అందించ‌డంలో నిర్ల‌క్ష్యం క్షంత‌వ్యం కాదు. ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రెడ్డి అస్స‌లు క్షంత‌వ్యుడు కారు.  

పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో   అడిగిన స‌మాచారం స‌మ‌యానికి అందించ‌డంలో  జగన్ సర్కార్ నిర్లక్ష్యమే పోలవరం నిర్మాణంలో జాప్యానికి కారణమని పార్లమెంటు సాక్షిగా కేంద్రం కుండబద్దలు కొట్టేసింది. పోల‌వ‌రం ప్రాజెక్టును రాష్ట్రం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. కానీ ముఖ్య‌మంత్రి నిర్ల‌క్ష్య ధోర‌ణితో రాష్ట్రం కేంద్రంతో మొట్టికాయ‌లు వేయించుకుంటూ అప్ర‌తిష్ట‌పాల‌వ‌డం గ‌మ‌నిస్తున్నాం. ఉభ‌య‌ స‌భ‌ల్లోనూ దీన్ని గురించి ఎప్పుడు చ‌ర్చ త‌లెత్తినా ఎంపీల‌కు అక్షంత‌లు త‌ప్ప‌డం లేదు. ఇపుడు తాజాగా క‌న‌క‌మేడ‌ల పోలవరంపై వేసిన ప్రశ్రకి సమాధానమిస్తూ కేంద్ర జ‌ల‌శ‌క్తిశాఖ మంత్రి  జగన్ సర్కార్ వైఫల్యమే పోలవరం జాప్యానికి కారణమని స్పష్టం చేశారు. ఏపీ సీఎం  నిర్వాకంతోనే అన్నీ వెన‌క్కి పోతున్నాయ‌న్న‌ది కేంద్ర మంత్రిగారి స‌మాధాన సారాంశం. 

పోల‌వ‌రం ప్రాజెక్టు గురించి మంగళవారం రాజ్య‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో ఎంపీ క‌న‌క‌మేడ‌ల కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి బిశ్వేశ్వ‌ర తుడూను   పోల‌వ‌రం ప్రాజ‌క్టు సంబంధించి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం చ‌ర్య‌ల‌ను నిర్ధారించ‌డానికి ప్ర‌భుత్వం ఏద‌యినా అంచ‌నా లేదా త‌నిఖీ చేసిందా అని ప్ర‌శ్నించారు. ఏపీ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్టం 2014లోని నిబంధ‌న‌ల ప్ర‌కారం జాతీయ ప్రాజెక్టు హోదా పొందిన పోల‌వ‌రం నీటిపారుద‌ల ప్రాజెక్టును పూర్తి చేయ‌డంలో తీవ్ర జాప్యం జ‌రిగింది. అయితే ప్ర‌భుత్వ స‌లహా రూపంలో ఏద‌యినా స‌మాచారం ఇచ్చిందా, ఏపీ ప్ర‌భుత్వాన్ని మంద‌లించారా అని అడిగారు. అంతే కాకుండా పిఐపి(పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు) అమ‌లు చేసే ప్ర‌క్రియ‌లో దాని మిన‌హాయింపు లేదా క‌మిష‌న్ చేప‌ట్టిన చ‌ర్య‌లేమిట‌ని రాజ్య‌స‌భ‌లో క‌న‌క‌మేడ‌ల ప్ర‌శ్నించారు. అందుకు కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ మంత్రి బిశ్వేశ్వ‌ర్ తుడు లిఖిత పూర్వ‌క స‌మాధానం ఇస్తూ,ముందుగా  నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం పోలవరం ప్రాజెక్టును ఏప్రిల్ 2022 నాటికి పూర్తి చేయాలనీ అయితే అయితే ప్ర‌స్తుతం హెడ్‌వ‌ర్క్స్, కుడి ప్ర‌ధాన కాలువ, ఎడ‌మ ప్ర‌ధాన కాలువ‌ల పురోగ‌తి వ‌రుస‌గా 77 శాతం, 93 మరియు 72 శాతం  మాత్రమే పూర్తయ్యాయన్నారు. అందువలన ప్రాజెక్ట్  ఏప్రిల్, 2022 నాటికి పూర్తి చేయాలన్న గడువు దాటిపోయిందన్నారు. 

ఏప్రిల్ 2022 తర్వాత పైప్‌ల అమలుకు సంబంధించి ప్ర‌భుత్వ సమాచారం మేరకు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పిపిఏ, ప్రస్తుత నిర్మాణ షెడ్యూల్‌ను సమగ్రంగా పరిశీలించడానికి , విశ్లేషించడానికి 2021 నవంబర్‌లో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ తన నివేదికను ఏప్రిల్, 2022లో సమర్పించింది, జూన్, 2024 నాటికి ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి సవరించిన లక్ష్యాన్ని సూచించిందని కేంద్రం మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, అవసరమైన రీతిలో వ్యయసామర్ధ్యం లేకపోవడం, సరైన వ్యూహాత్మక ప్రణాళికా లోపం, ప్రణాళిక లేకపోవడమే పోలవరం జాప్యానికి కారణమని స్పష్టం చేశారు. అలాగే ప్రాజెక్ట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ సమన్వయ లోపం, కోవిడ్ సమస్యలు కూడా ప్రాజెక్టు జాప్యం అవడానికి కారణమని మంత్రి స్పష్టం చేశారు.