జగన్ రిమోట్ సతీమణి చేతిలోనే..తాడేపల్లి ప్యాలస్ లో పవర్ సెంటర్ వైఎస్ భారతి!

వైసీపీలో కర్త, కర్మ, క్రియా అన్నీ జగనేనని ఇంత కాలం అంతా భావించారు. కానీ జగన్  రిమోట్ వైఎస్ భారతి అని తేలిపోయిందని వైసీపీ వర్గాలే ఇప్పుడు అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు ఉదాహరణగా విజయసాయిరెడ్డికి రాజ్యసభ అవకాశం రెండో సారి దక్కడాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు. తనకు రెండో సారి అవకాశం ఇచ్చినందుకు విజయసాయి రెడ్డి జగన్ తో పాటు భారతికి కూడా కృతజ్ణతలు చెప్పడమే జగన్ రిమోట్ భారతి చేతిలో ఉందని చెప్పడానికి నిదర్శనమని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.

 వైఎస్ భారతి తాడేపల్లి ప్యాలస్ నుంచి చక్రం తిప్పుతున్నారనీ, ఆమె ఆమోద ముద్ర లేకుండా పార్టీలో ఏ నిర్ణయమూ జరగదనీ వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. విజయసాయి విషయమే తీసుకుంటే.. తనకు రెండో సారి రాజ్యసభకు అవకాశం ఇచ్చినందుకు జగన్ కు కృతజ్ణతలు చెప్పడం వరకూ ఓకే.. ఇంకా ఎవరికైనా కృతజ్ణతలు చెప్పాలంటే పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మకు చెప్పాలి. అలాగే తనకు అడ్డు రానందుకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డికి చెప్పాలి. కానీ విజయసాయి మాత్రం వైఎస్ భారతి పేరే చెప్పారు. అంటే పార్టీలో విజయ సాయి పనైపోయిందన్న పరిస్థితి నుంచి ఆయనకు రెండో సారి రాజ్యసభ అవకాశం వచ్చేలా చేయడంతో తెరవెనుక చక్రం తిప్నిన వ్యక్తి వైఎస్ భారతేనని పార్టీ వర్గాలు ఘంటా పథంగా చెబుతున్నాయి.

విజయసాయిరెడ్డిని పెద్దల సభకు మళ్లీ ఎంట్రీ ఇప్పించడంలో వైఎస్ భారతి పకడ్బందీ వ్యూహంతో ప్రణాళికలు రూపొందించారని అంటున్నారు.   జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిన్న మొన్నటి వరకు.. ఉత్తరాంధ్ర బాధ్యతలకే పరిమితమై ఉన్న విజయసాయిరెడ్డిని చూసి పార్టీ వర్గాలు ఇక పార్టీలో నంబర్ 2 పోస్టులు అంటే ఇంత కాలం విజయసాయి అనుభవించిన ఆ అనధికార హోదాను ప్రభుత్వ సలహాదారు సజ్జల కొట్టేశారనే అంతా అనుకున్నారు.  

  ఇటీవల ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి విజయసాయిరెడ్డిని తప్పించి.. పార్టీలోని కొన్ని విభాగాలకు మాత్రమే పరిమితం చేయడం, అదే సమయంలో సజ్జలకు పార్టీ పరంగా అత్యంత కీలక బాధ్యతలు అప్పగించడంతో పార్టీలో విజయసాయి పనైపోయిందనే అంతా భావించారు. సరిగ్గా అక్కడే వైఎస్ భారతి  సజ్జల బాధ్యతలకు కత్తిరేసి మరీ.. ఆయన వద్దనున్న కీలక బాధ్యతలు  విజయసాయిరెడ్డికి అప్పగించేలా చక్రం తిప్పారని అంటున్నారు. దీంతో మళ్లీ విజయసాయిరెడ్డి.. సీఎం జగన్ స్థానం తర్వాత స్థానంలోకి అంటే అనధికార నంబర్ టూ పోజిషన్ లోకి వచ్చేసినట్లైంది.  

జగన్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కడం కోసం వెనకుండి వ్యూహాలు రచించింది, క్షేత్ర స్థాయిలో శ్రమించింది ముమ్మాటికి విజయసాయిరెడ్డేనని,    అందుకే విజయసాయిరెడ్డికి రెండో సారి రాజ్యసభ అవకాశం ఇవ్వాలనీ భారతి పట్టుబట్టి మరీ జగన్ ను ఒప్పంచినట్లు పార్టీ వర్గాలలో ఓ రేంజ్ లో టాక్ నడుస్తోంది. అంతే కాదుఈడీ కేసు విచారణ వాయిదా పడాలన్నా.. సీబీఐ కోర్టులో వాయిదాలకు వెళ్లకుండా మినహాయింపు పొందాలన్నా..   మన కోసం ప్రధాన మంత్రి కార్యాలయంలోకి డైరెక్ట్‌గా వెళ్లి రావాలన్నా...  హోం శాఖ మంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ కోసం ఏపీ భవన్‌లో మనం వెయిట్ చేయకుండా ఉండాలన్నా.. విజయసాయి ఉండాలని  జగన్‌కు ఆయన సతీమణి   భారతి నచ్చచెప్పి ఒప్పించినట్లు చెబుతున్నారు.

అలాగే ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి కేబినెట్ నుంచి ఉద్వాసన, పలువురు పాత మంత్రుల కొనసాగింపు వ్యవహారంలో  ముఖ్య మంత్రి  సతీమణి తెరవెనుక మంత్రాంగమే కారణమని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వైసీపీ వర్గాలు ఇప్పుడు కొత్తగా భారత్ పవర్ సెంటర్ అని కనిపెట్టినట్టు చెబుతున్నారు కానీ తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి  అయ్యన్నపాత్రుడు మాత్రం జగన్ రిమోట్ ఆయన సతీమణి భారత్ చేతిలో ఉందని ఎప్పుడో చెప్పేశారు.  రాష్ట్రానికి సీఎం   జగన్ అయినా..  పాలించేది మాత్రం  భారతేనంటూ ఆయన గతంలో చేసిన వ్యాఖ్యల తాలుకు వీడియో క్లిప్పింగులు ఇప్పుడు సోషల్ మీడియాలో  హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పుడు అదే విషయాన్ని వైసీపీ వర్గాలు ఆఫ్ ది రికార్డ్ అంటూ చెబుతున్నాయి.