సోనియా గాంధీతో నల్లారి భేటీ.. ఏపీసీసీ చీఫ్ పదవిపై ప్రకటనే తరువాయి?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి  నల్లారి  కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అధినేత్రి  సోనియాగాంధీతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ అధిష్ఠానం పిలుపుతో హస్తిన చేరిన ఆయన గత మూడు రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన సంగతి తెలిసింది. కాగా  సోనియాగాంధీతో శుక్రవారం   సోనియా గాంధీతో నల్లారి భేటీ దాదాపు గంట సేపు సాగింది. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై సుదీర్ఘ చర్చ జరిగినట్టు సమాచారం. అలాగే ఇటీవల సీడబ్ల్యూసీ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలపై చర్చించినట్టు తెలుస్తోంది.

సంస్థాగతంగా పార్టీలో పెను మార్పులు చేసేందుకు అధినాయకత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి సోనియా భేటీ ఏపీ కాంగ్రెస్ లో మార్పులకు నాందిగా రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  గతంలో మాదిరిగా పార్టీలో చురుకుగా పని చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోనియాగాంధీతో ఈ సందర్భంగా చెప్పినట్లు తెలుస్తోంది.  ముఖ్యమంత్రిగా, సీనియర్ నేతగా పాలనానుభవం ఉన్నందున ఆంధ్రప్రదేశ్ లో పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిందిగా సోనియాగాంధీ ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డిని ఆదేశించారని చెబుతున్నారు.

అధిష్ఠానం పిలుపుతో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లడంతో ఏపీ పీసీసీ చీఫ్ గా ఆయనకు కాంగ్రెస్ అధినేత్రి బాధ్యతలు అప్పగిస్తారన్నవార్తలు వినవచ్చాయి.  సోనియాతో భేటీ తరువాత కూడా ఏపీసీసీ చీఫ్ నియామకంపై ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. సోనియాతో భేటీ అనంతరం నల్లారి  హైదరాబాద్ తిరిగి వెళ్లారు.