రక్తికట్టని వైసీపీ డ్రామాలు.. జ‌గ‌న్ లేఖను ప‌ట్టించుకోని పార్టీల అధినేతలు

తిరుమ‌ల తిరుప‌తి ల‌డ్డూ క‌ల్తీ వ్య‌వ‌హారంలో వైసీపీ నేత‌ల డ్రామాలు ర‌క్తి కట్టడం లేదు. త‌ప్పును క‌ప్పిపుచ్చుకునేందుకు ఒక్కొక్క‌రు ఒక్కో డ్రామా ఆడుతున్నారు. త‌ద్వారా ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదారి ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మొద‌టి నుంచి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అనుస‌రించే వ్యూహాన్నే తిరుప‌తి ల‌డ్డూ విష‌యంలోనూ అమ‌లు చేస్తున్నారు. గ‌తంలో ప‌లు సంద‌ర్భాల్లో త‌ప్పుచేసిన‌ట్లు ఆధారాల‌తో స‌హా దొరికిపోయినప్పుడు.. జ‌గ‌న్, వైసీపీ నేత‌లు ప‌దేప‌దే ప్రెస్ మీట్లు పెట్టి అది త‌ప్పుకాదు అంటూ వితండ‌వాదం చేశారు. త‌మ అనుకూల మీడియా, వైసీపీ సోష‌ల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్ర‌చారం చేసుకొని ప్ర‌జ‌ల‌ను న‌మ్మించ‌డంలో స‌ఫ‌ల‌మ‌య్యారు. వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య‌ విష‌యంలోనూ జ‌గ‌న్‌, ఆయ‌న మీడియా ఇదే ఫార్ములాను అనుస‌రించింది. చంద్ర‌బాబు నాయుడే వివేకానంద ఇంటికి వెళ్లి క‌త్తితో దాడి చేశారు అన్న‌ట్లుగా నారాసుర ర‌క్త‌చ‌రిత్ర అంటూ ప్ర‌చారం చేశారు. అంతేకాక‌.. ఓ కులంపైనా త‌ప్పుడు ప్ర‌చారంతో జ‌గ‌న్ దాడి చేశారు. ఆ కులాన్ని కించ‌ప‌రిచేలా, ఆ కులంపై ఇత‌ర కులాల వారిని రెచ్చ‌గొట్టేలా జ‌గ‌న్ అనుకూల మీడియా, సోషల్ మీడాయా ద్వారా  ప్ర‌య‌త్నాలు చేశారు. అలాంటి ప్రచారాల ద్వారానే 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చారు. తాజాగా తిరుప‌తి ల‌డ్డూ క‌ల్తీ వ్య‌వ‌హారంలోనూ జ‌గ‌న్ తూచాత‌ప్ప‌కుండా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు.

 వైసీపీ హ‌యాంలో తిరుమ‌ల తిరుప‌తి ల‌డ్డూ త‌యారీలో వాడిన నెయ్యి క‌ల్తీద‌ని ల్యాబ్ రిపోర్టులు స్ప‌ష్టం చేశాయి . 8 జులై 2024న లడ్డూను టెస్టింగ్ కోసం ల్యాబ్‌కు పంపించగా.. ఎన్డీడీబీ సీఏఎల్‌ఎఫ్ ల్యాబ్ జులై 17న నివేదిక ఇచ్చింది. ఆ ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం.. లడ్డూలో సోయాబీన్, పొద్దు తిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మొక్కజొన్న, పత్తి గింజలతోపాటు చేప నూనె, జంతు కొవ్వు, పామాయిల్, పంది కొవ్వు కూడా వాడినట్లు తేలింది. దీంతో వైసీపీ ప్ర‌భుత్వం చేసిన ప‌నితో  ప్ర‌పంచ వ్యాప్తంగా హిందువులు తీవ్ర ఆవేద‌నకు గుర‌య్యారు. ఒక్క ల‌డ్డూ విష‌యంలోనేకాక తిరుప‌తిలోని ప‌లు విష‌యాల్లోనూ వైసీపీ హ‌యాంలో పెద్ద ఎత్తున అవినీతి జ‌రిగింది. తాజాగా ఒక్కో విష‌యం వెలుగులోకి వ‌స్తోంది. శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి కలవడంతో టీటీడీ అధికారులు కొండ‌పై సంప్రోక్షణతో పాటు శాంతి హోమం నిర్వహించారు. తిరుప‌తి ల‌డ్డూ త‌యారీలో జంతువుల కొవ్వు అవ‌శేషాలు ఉన్నాయ‌ని ప్ర‌భుత్వం గుర్తింపు పొందిన ల్యాబ్ నుంచి రిపోర్టు వ‌చ్చిన‌ప్ప‌టికీ.. వైసీపీ నేత‌లు మాత్రం వితండ‌వాదం చేస్తున్నారు.

మొద‌టి నుంచీ వారికున్న అల‌వాటు ప్ర‌కారం నిజాన్ని అబ‌ద్ధంగా మార్చేందుకు శ‌త‌ విధాల ప్ర‌య‌త్నాలు చేస్తు న్నారు. మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నుంచి వైసీపీ ముఖ్య‌నేత‌లంతా మీడియా స‌మావేశాలు పెడుతూ చంద్ర‌ బాబుపై విరుచుకుప‌డ‌తున్నారు. చంద్ర‌బాబు తిరుమ‌ల శ్రీ‌వారిని రాజ‌కీయంగా వాడుకుంటూ.. హిందువుల మ‌నోభా వాల‌ను దెబ్బ‌తీస్తున్నారంటూ ఎదురు దాడి చేస్తున్నారు. దీనికి తోడు వైసీపీ అనుకూల మీడియా, వైసీపీ సోష‌ల్ మీడియాలో ల‌డ్డూ వ్య‌వ‌హారం అంతా చంద్ర‌బాబు కుట్ర‌లో భాగ‌మే అన్న‌ట్లు ప్ర‌జ‌ల‌ను న‌మ్మించేలా ప్రయత్నిం చేందుకు అడ్డ‌మైన దారుల‌న్నీ తొక్కేస్తున్నారు.

 వైసీపీ  హ‌యాంలో టీటీడీ చైర్మ‌న్లుగా ప‌నిచేసిన భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిల వ్య‌వ‌హార‌శైలి మాత్రం ప్ర‌జ‌ల్లో అనుమానాల‌కు తావునిస్తోంది. క‌రుణాక‌ర్ రెడ్డి ఓవ‌రాక్ష‌న్ అయితే తార స్థాయికి చేరిపోయింది. గుమ్మ‌డి కాయ‌ల దొంగ భుజాలు త‌డుముకున్న‌ట్లుగా క‌రుణాక‌ర్ రెడ్డి తెగ కంగారుప‌డిపోతున్నారు. ఈ క్ర‌మంలో తిరుమ‌ల‌కు వెళ్లి.. తన హయాంలో ఏదైనా తప్పు చేసి ఉంటే.. తాను.. తన కుటుంబం నాశనం అయిపోతామని కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేశారు. ఇక్క‌డ విచిత్రం ఏమిటంటే.. దేవుడంటే ఏ మాత్రం భక్తి లేని.. అన్యమతస్తుడు అయిన కరుణా కరరెడ్డి ప్రమాణం చేశారు. గతంలో తిరుమల శ్రీవారిని నల్లరాయితో పోల్చిన కరుణాకరరెడ్డి ప్రమాణం చేయడమే, తప్పు జరిగిందని అంగీకరించడంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే ఆయన నాస్తికుడు. తిరుమల వేంకటే శ్వరస్వామినే కాదు, అసలు దేవుడినే నమ్మని వ్యక్తిగా  భూమన చెప్పుకుంటారు. కోట్లాది మంది భక్తులు కొలిచే వెంకన్న దేవుడు, భూమన వారి దృష్టిలో కేవలం ఓ  నల్ల రాయి . అవును  స్వయంగా ఆయనే ఈ మాట అన్నారు. అంతే కాదు,  మండే ఎండలో అయినా చెప్పులు లేకుండా కాలినడకన కొండనెక్కే భక్తులనూ  అవహేళన చేసిన చరిత్ర భూమనకు ఉందని ఆయన ఒకప్పటి మిత్రులు ఇప్పుడు సోషల్ మీడియాలో  పాత  సంగతులను   గుర్తు చేస్తున్నారు. మ‌రోవైపు ఏపీ ప్రభుత్వం మాజీ అదనపు అడ్వకేట్ జనరల్, జ‌గ‌న్‌కు న‌మ్మిన బంటుగా పేరున్న పొన్న వోలు సుధాకర్ రెడ్డి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. తిరుమ‌ల ల‌డ్డూను త‌క్కువ చేస్తూ మాట్లాడ‌టంతో శ్రీవారి భ‌క్తులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. తిరుమలకు సరఫరా చేసే నెయ్యి ఖరీదు కిలో రూ.320 కాగా.. అందులో రూ.1400 విలువచేసే పంది కొవ్వును ఎలా కలుపుతారని ప్రశ్నించారు. మార్కెట్‌లో పందికొవ్వు ధర రూ.400 నుంచి రూ.1400 ఉందని చెప్పారు. నెయ్యి కంటే ఖరీదైన వస్తువుతో కల్తీ ఎలా చేస్తారన్నారు. రాగితో బంగారాన్ని కల్తీ చేయవచ్చు కానీ, బంగారంతో రాగిని కల్తీ చేస్తారా అంటూ ప్రశ్నించారు.

పొన్న‌వోలు వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి చూస్తే వైసీపీ నేత‌ల‌కు తిరుమ‌ల ల‌డ్డూ ప్రసాదంపై ఎంత చిన్న‌చూపో   అర్ధ‌మ‌వుతోంది. తాజాగా ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశాడు. గ్రామాల్లో అనేక పశువులను మనం చూస్తాం. అవి చాలా తింటాయి. అవి తినొచ్చి పాలిస్తాయి. ఆ విధంగా ఆవుల నుంచి పాలతో చేసే నెయ్యి వల్ల అలా జరుగుతుందంటూ కొత్త లాజిక్ చెప్పారు. వైసీపీ నేత‌ల విచిత్ర వాద‌న‌ల‌తో హిందువులు తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.  

తిరుప‌తి ల‌డ్డూ వివాదంలో త‌న‌కు ఏమీ తెలియ‌దు.. మేమంతా అమాయ‌కుల‌ం అన్న‌ట్లుగా జ‌గ‌న్, ఆయన పార్టీ నేతల తీరు ఉంది.  త‌ప్పుచేసి అడ్డంగా దొరికిన‌ప్ప‌టికీ త‌న అనుకూల మీడియా, సోష‌ల్ మీడియా ద్వారా తాము ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌ని ప్ర‌జ‌ల‌ను నిమ్మించ‌డంలో జ‌గ‌న్ మొద‌టి నుంచి దిట్ట‌. అయితే ఇప్పుడు జగన్ పప్పులు ఉడకటం లేదు.   తిరుపతి లడ్డూ వివాదం అంతా చంద్రబాబు చేస్తున్న తప్పుడు ప్రచారమేనని ఆరోపిస్తూ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి జగన్ లేఖ‌ రాశారు. అంతేకాదు.. ఆ లేఖను సోషల్ మీడియాలో పోస్టు చేసి దేశంలోని అన్ని పార్టీల అధినేత‌ల‌కు ట్యాగ్ చేశారు. ఒక‌ ప‌క్క కేంద్రం గుర్తింపు ఉన్న ల్యాబ్ నుంచే కాక‌.. కేంద్ర ఆరోగ్య శాఖ సైతం క‌ల్తీ నెయ్యి స‌ర‌ఫ‌రా అయింద‌ని తేల్చింది. జ‌గ‌న్ మెస‌లి క‌న్నీరును గుర్తించిన జాతీయ‌ రాజ‌కీయ పార్టీల  అధినేత‌లు జగన్ ప్రధానికి రాసి సోషల్ మీడియాలో తమకు ట్యాగ్ చేసిన లేఖను లైట్ గా తీసుకున్నారు. తన లేఖ‌  చ‌దివిన వెంట‌నే దేశంలోని రాజకీయ పార్టీల అధినేత‌లంతా స్పందిస్తారు.. ఇక చంద్ర‌బాబుకు గుణ‌పాఠం చెప్పొచ్చు.. చంద్ర‌బాబు బ‌య‌ట‌ పెట్టిన నిజాల‌ను అబ‌ద్దాలుగా మార్చేయ‌వ‌చ్చు అని జ‌గ‌న్ భావించారు. కానీ, జ‌గ‌న్ అంటే జాతీయ పార్టీల నేత‌ల్లో ఎవ‌రికీ న‌మ్మ‌కం లేద‌ని తేలిపోయింది. ఎవరూ జగన్ లేఖను పట్టించుకోలేదు. చివరాఖరికి జ‌గ‌న్‌తో మంచి సంబంధాలు ఉన్న తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం తిరుప‌తి ల‌డ్డూ వివాదంపై స్పందించ‌లేదు. దీంతో వైసీపీ నేత‌లు ఉసూరుమంటున్నారు.