ప్రాంతీయ విద్వేషం వదలని బీఆర్ఎస్!

ప్రత్యేక రాష్ట్ర కలని సాకారం చేసుకోవడం కోసం తెలంగాణ ప్రజలు పోరాటం చేసిన సమయంలో, ఒక్క టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ మాత్రమే ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రవర్తించింది. అందరూ మా రాష్ట్రం మాకు కావాలి అని పోరాటం చేస్తుంటే, టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ మాత్రం ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారిని దారుణంగా తిడుతూ ప్రాంతీయ విద్వేషాలను పెంచి పోషించారు. తెలంగాణ పోరాటం జరిగిన సమయంలో మాత్రమే కాకుండా అధికారంలో వున్న పదేళ్ళలో కూడా ఆంధ్రావాళ్ళని తిట్టనిదే కేసీఆర్‌కి, ఆయన పార్టీ నాయకులకు తిన్నది అరిగేది కాదు. ఆంధ్రవాళ్ళ మీద విషం కక్కకపోతే ‘కేసీఆర్‌ అండ్ కో’కి మనశ్శాంతిగా వుండేది కాదు. అధికారంలో వున్నప్పుడు మాత్రమే కాదు.. అధికారం పోయిన తర్వాత కూడా బీఆర్ఎస్ తన ఆంధ్ర విద్వేషాన్ని వదులుకోలేదు. నిన్నగాక మొన్న ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ మీద ‘ఆంధ్రావాడు’ అంటూ విమర్శలు చేసిన ఘన బీఆర్ఎస్ పార్టీ నాయకులది. మొత్తమ్మీద ఆంధ్రుల విషయంలో బీఆర్ఎస్‌ వైఖరి ఎప్పుడూ ఒకేలా వుంది. అధికారంలోకి రాకముందు.. అధికారంలోకి వచ్చిన తర్వాత.. అధికారం పోయిన తర్వాత.. ఈ మూడు దశల్లోనూ ప్రాంతీయ ద్వేషంతోనే బీఆర్ఎస్ కొనసాగింది. ఇంతవరకు ఆంధ్రుల మీద పడి ఏడ్చి, ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారి మీద విద్వేషం పెంచడానికి ప్రయత్నించిన బీఆర్ఎస్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ప్రాంతాల వారీగా చీల్చడానికి కుట్రలు ప్రారంభించింది. తెలంగాణలోనే ఒక ప్రాంతానికి, మరో ప్రాంతానికి మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది.

గత పన్నెండేళ్ళుగా కేసీఆర్ పుణ్యమా అని ఒక్కడ అడుగు కూడా ముందుకు వేయని రీజినల్ రింగ్ రోడ్‌ ప్రాజెక్టుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరుగులు తీయించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. తాను రూపకల్పన చేస్తున్న ఫోర్త్ సిటీకి కూడా ఉపయోగపడే విధంగా వుండాలని ఆయన రీజినల్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌ని కొద్దిగా మార్చారు. అంతే, బీఆర్ఎస్ సొంత మీడియా విమర్శలు ప్రారంభించేసింది. ముఖ్యమంత్రి తన సొంత జిల్లాకి, తన సొంత ప్రాంతానికి లాభం జరిగేలా చేస్తున్నారని బీఆర్ఎస్ మీడియా మొత్తుకుంటోంది. ప్రతీరోజూ ఇదే తరహా కథనాలను బీఆర్ఎస్ మీడియా వండి వడ్డిస్తోంది. ఇంతకాలం ఆంధ్రా మీద పడి ఏడిచిన బీఆర్ఎస్ ఇప్పుడు తెలంగాణలోని ఒక ప్రాంతం మీద పడి ఏడుస్తోంది. ఎప్పుడూ ఎవరో ఒకరి మీద పడి ఏడవకపోతే ఈ బీఆర్ఎస్ వాళ్ళకి తెల్లారదేమో!