బెడిసికొట్టిన జగన్ ప్లాన్!

తిరుమ‌ల ల‌డ్డూ త‌యారీలో వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ల్యాబ్ రిపోర్టులు వెలుగులోకి రావ‌డం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. హిందువులు ఎంతో ప‌విత్రంగా భావించే తిరుమ‌ల ల‌డ్డూలోనే ఇలా జ‌ర‌గ‌డం ప్ర‌తీఒక్క‌రిని ఆవేద‌నకు గురిచేస్తోంది. గ‌త ఐదేళ్ల వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో తిరుమలలో ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యితోపాటు.. ఇత‌ర  విభాగాల్లోనూ పెద్ద ఎత్తున అవినీతి జ‌రిగింద‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. వీటిపై టీడీపీ కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌త్యేక దృష్టి సారించ‌డంతో వైసీపీ హ‌యాంలో జ‌రిగిన అవినీతి అక్ర‌మాలు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నాయి.

ప‌విత్ర పుణ్య‌క్షేత్రంలో ఘోరాల‌కు పాల్ప‌డిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని హిందువులు, హిందూ సంఘాల ప్ర‌తినిధులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో సీఎం చంద్ర‌బాబు నాయుడు ల‌డ్డూ క‌ల్తీ ఘ‌ట‌న‌పై సిట్ విచార‌ణ‌కు ఆదేశించారు. మ‌రో వైపు తిరుమ‌ల‌లో లడ్డూ కల్తీపై అర్చ‌కులు సంప్రోక్షణ యాగం నిర్వ‌హించారు. ఇదిలాఉంటే వైఎస్ జ‌గ‌న్ స‌హా ఆపార్టీ నేత‌లు ల‌డ్డూలో క‌ల్తీనెయ్యి క‌లిసింద‌న్న‌విష‌యాన్ని ఒప్పుకోవ‌టం లేదు. కేంద్రం గుర్తింపు పొందిన ల్యాబ్ నుంచి రిపోర్టులు వ‌చ్చినా అవ‌న్నీ అబ‌ద్ద‌పు రిపోర్టులు, తెలుగుదేశం కార్యాల‌యం నుంచి వ‌చ్చిన రిపోర్టులంటూ  జగన్ సహా ఆ పార్టీ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. జగన్ తీరు పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.    ల‌డ్డూ వివాదాన్ని అడ్డుపెట్టుకొని రాష్ట్రంలో ఘ‌ర్ష‌ణ‌లు సృష్టించాల‌ని చూసిన జ‌గ‌న్ ప్లాన్‌ బూమరాంగ్ అయ్యింది. ఆయన తిరుమల యాత్ర రద్దు చేసుకోవడం, తిరుమల దేవుడిపై విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేకే అని తేటతెల్లం అయిపోయింది. 

ఇక విషయంలోకి వస్తే.. వైసీపీ హ‌యాంలో తిరుమ‌ల ల‌డ్డూ త‌యారీలో క‌ల్తీ నెయ్యి వాడార‌ని ల్యాబ్ రిపోర్టులు రావ‌డంతో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితోపాటు వైసీపీ నేత‌లు ఉక్కిరిబిక్కిరి అయిపోయారు.  త‌ప్పును క‌ప్పిపుచ్చుకునేందుకు కూట‌మి ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల‌దాడి చేస్తున్నారు. ఈ క్ర‌మంలో శ‌నివారం (సెప్టెంబర్ 28) రాష్ట్ర వ్యాప్తంగా ఆల‌యాల్లో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి త‌మ నిర‌స‌న తెలియ‌జేయాల‌ని వైసీపీ అధిష్టానం పిలుపు నిచ్చింది. ఇందులో భాగంగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకోవాల‌ని భావించారు. తిరుమ‌ల‌కు ఒక‌ రోజు ముందే వెళ్లేందుకు షెడ్యూల్‌ సైతం రెడీ చేసుకున్నారు. తిరుప‌తి వెళ్లే క్ర‌మంలో పోలీసులు జ‌గ‌న్‌ను అడ్డుకుంటే పెద్ద ఎత్తున ఘ‌ర్ష‌ణ‌ల‌కు దిగేందుకు వైసీపీ శ్రేణులు సిద్ధ‌మ‌య్యాయి. రాయ‌ల‌సీమ‌లోని ప‌లువురు ముఖ్య‌నేత‌లకు ఈ మేర‌కు స్వ‌యంగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డే ఆదేశాలు ఇచ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. త‌న‌ను తిరుమ‌ల వెళ్ల‌కుండా అడ్డుకుంటే తిరుపతి ప్రాంతం మొత్తం ఆందోళనలతో హోరెత్తేలా చేసి.. తద్వారా ఆ విష‌యాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లాల‌ని జ‌గ‌న్ తన అనుచరులకు సూచనలు చేసినట్లు తెలిసింది. వైసీపీ కుట్ర‌ల‌ను ముందుగానే గ‌మ‌నించిన సీఎం చంద్ర‌బాబు నాయుడు తిరుమ‌ల ప‌రిస‌ర ప్రాంతాల్లో భారీ పోలీస్ బందోబ‌స్తు ఏర్పాటు చేయాల‌ని పోలీస్ శాఖ‌కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఒక‌రోజు ముంద‌స్తుగానే పెద్ద ఎత్తున పోలీసులు తిరుమ‌ల, తిరుమ‌ల ప‌రిస‌ర ప్రాంతాల‌కు చేరుకొని బందోబ‌స్తులో నిమ‌గ్న‌మ‌య్యారు. అంతేకాక‌.. బ‌య‌ట‌కు రావొద్దంటూ ప‌లువురు వైసీపీ నేత‌ల‌కు నోటీసులు ఇచ్చారు.

మ‌రోవైపు జ‌గ‌న్ తిరుమ‌లలో వెంక‌టేశ్వ‌ర స్వామి ద‌ర్శ‌నానికి రావడాన్ని  హిందువులు, హిందు  సంఘాల నేత‌లు తీవ్రంగా వ్య‌తిరేకించారు. త‌న హ‌యాంలో తిరుమ‌ల ప‌విత్ర‌త‌ను దెబ్బ‌తీసిన జ‌గ‌న్.. తిరుమ‌ల‌కు ఎలా వ‌స్తారని నిలదీశారు. అయితే, జ‌గ‌న్ వ్యూహాన్ని ముందుగానే ప‌సిగ‌ట్టిన చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. కూట‌మి నేతలు ఎవ‌రూ జ‌గ‌న్ ను అడ్డుకోవ‌ద్ద‌ని, ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో జ‌గ‌న్ తిరుమ‌ల ప‌ర్య‌ట‌న సాగేలా చూడాల‌ని సూచించారు. ఎందుకైనా మంచిదని ప్రభుత్వం ఆయనకు ఎలాంటి ఆటంకాలు లేకుండా వందల మంది పోలీసుల భద్రత ఏర్పాటు చేసింది. కాన్వాయ్ కూడా రెడీ చేసింది. దీంతో కూట‌మి ప్ర‌భుత్వం నిర్ణ‌యం జ‌గ‌న్‌కు బిగ్ షాకిచ్చింది. త‌న‌ను అడ్డుకుంటే   ఆందోళ‌న‌లకు తెర‌తీయాల‌ని భావించిన జ‌గ‌న్‌కు కూట‌మి ప్ర‌భుత్వ నిర్ణ‌యం మింగుడుప‌డ‌ని అంశంగా మారింది. ఇదిలా ఉంటే.. జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా  కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అన్య‌మ‌త‌స్తులు డిక్ల‌రేష‌న్ ఇచ్చిన త‌రువాతే తిరుమ‌ల దేవుడిని దర్శించుకోవాలని అందుకు జగన్ కు ఎలాంటి మినహాయింపూ లేదని స్పష్టం చేసింది.  ఈ అంశాన్ని త‌న‌కు అనుకూలంగా మార్చుకోవాల‌ని జ‌గ‌న్ భావించారు. ఇందులో భాగంగా  టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమన క‌రుణాక‌ర్  రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్   డిక్ల‌రేష‌న్ పై సంత‌కం ఎందుకు పెట్టాలి.. జ‌గ‌న్ ఆ ప‌ని చేయ‌రు.. సంత‌కం చేయ‌కుండానే తిరుమ‌ల‌కు వెడతాం. శ్రీ‌వారిని ద‌ర్శించుకుంటాం.. మ‌మ్మ‌ల్ని ఎవ‌రూ అడ్డుకోలేరంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. భూమన వ్యాఖ్య‌ల‌కు   సీఎం చంద్ర‌బాబు ఎక్స్ వేదిక‌గా స్పందిస్తూ.. తిరుమ‌ల శ్రీ‌వారి భ‌క్తులు తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధ‌నలు పాటించాలి. భ‌క్తుల మ‌నోభావాల‌ను ప‌రిర‌క్షించ‌డానికి ఎక్కువ ప్రాధాన్య‌త ఉంది. అన్య‌మ‌తస్తులు ఆల‌యంలోకి రావాలంటే డిక్ల‌రేష‌న్ పై సంత‌కం చేయాల‌ని, అలాకాకుండా త‌మ ఇష్ట‌మొచ్చిన‌ట్లు ప్ర‌వ‌ర్తిస్తామంటే కుద‌ర‌ద‌ని తేల్చిచెప్పారు. ఇంతలోనే జగన్ తన తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు. 

జ‌గ‌న్ ప్లాన్ అమ‌లుకాకుండా చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేయ‌డంతో వైసీపీ నేత‌లు కంగుతిన్నారు. ఇక ఆట‌లు సాగ‌వ‌ని భావించిన జ‌గ‌న్ తిరుల ప‌ర్య‌ట‌న‌ను రద్దు చేసుకున్నారు. రద్దు ప్రకటేన అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ.. తనను తిరుమల రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రినైన తనకే ఈ పరిస్థితి ఎదురైతే ఇక దళితుల పరిస్థితి ఏమిటని దళితులను రెచ్చగొట్టేలా జగన్ మాట్లాడారు.  
వాస్తవానికి తిరుమల వెళ్లేందుకూ, తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకూ ఎవరికీ ఎటువంటి ఆంక్షలూ లేవు. అన్యమతస్థులు కూడా తిరుమలేశుని దర్శించుకోవడానికి అభ్యంతరాలేవీ లేవు.. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనల మేరకు అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ నిబంధననే ఇప్పుడు తిరుమల తిరపతి దేవస్థానం జగన్ కు గుర్తు చేసింది. దానికే జగన్ గుండెలు బాదేసుకుంటున్నారు.  దళితులను రెచ్చగొట్టి శాంతి భద్రతల సమస్య సృష్టించే ప్రయత్నం చేశారు. వాస్తవానికి జగన్ పర్యటన రద్దు వెనుక వేరే కారణం ఉందని అంటున్నారు. అదేమిటంటే పుట్టుకతో క్రైస్తవుడైన జగన్ తిరుమల కొండపైకి వెళ్లాలంటే కచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలి. అలా   డిక్లరేషన్ ఇస్తే  క్రైస్తవ పెద్దల ఆగ్రహానికి గురి అవుతానని, అదే జరిగితే  క్రిస్టియన్ మిషనరీల నుంచి వచ్చే డబ్బు నిలిచిపోతుందని భయపడి జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారని పరిశీలకులు అంటున్నారు.   బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కూడా ఇదే చెప్పారు. మొత్తానికి తిరుమలలో పర్యటిం చి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనేలా చేయాలని భావించిన జగన్ కు అపార రాజకీయ అనుభవం కలిగిన సీఎం చంద్రబాబు తనదైన వ్యూహంతో  చెక్ పెట్టి బిగ్ షాక్ ఇచ్చారు. ఇప్పుడు డిక్లరేషన్ ఇవ్వడానికి ఇష్టం లేక జగన్ తిరమల పర్యటన రద్దు చేసుకోవడంతో ఆయన హిందూ వ్యతిరేకి అనీ, ఆయనకు తిరుమల దేవుని పట్ల విశ్వాసం లేదనీ నిర్ద్వం ద్వంగా తేటతెల్లమైపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.