అన్యమతస్తులు సంప్రదాయాన్ని పాటించాల్సిందే.. చంద్రబాబు

వైసీపీ నాయకుడు జగన్‌ని తిరుమలకు వెళ్ళొద్దద్దని ఎవరూ చెప్పలేదని, ర్యాలీలు, జనసమీకరణలు చేయొద్దని మాత్రమే చెప్పామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు క్రిస్టల్ క్లియర్‌గా చెప్పారు. తిరుమల అంశంపై జగన్ చేసిన ఆరోపణలను చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. తమకు నోటీసులు ఇచ్చారు, తమ తిరుమల పర్యటనను నిలిపేశారని ఆరోపిస్తున్నారు కదా... జగన్‌కి పోలీసులు నోటీసులు ఇచ్చారా? అని ప్రశ్నించారు. జగన్‌ని వెళ్లొద్దని నోటీసులు అందినట్టయితే, వాటిని మీడియాకి చూపించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. జగన్ అబద్ధాలు ప్రచారం చేస్తూ  ప్రజలను మభ్యపెడుతున్నారని చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 

“ఇటీవలి కాలంలో టీటీడీలో జరిగిన పరిణామాల వల్ల భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో తిరుపతిలో సెక్షన్ 30 పోలీసు యాక్ట్ అమల్లో ఉంది. ఏ మతానికైనా కొన్ని సంప్రదాయాలు, ఆచారాలు వుంటాయి. తిరుమలకు వెళ్లాలంటే ఎవరైనా ఆ ఆచారాలు, ఆ నియమాలు పాటించాల్సిందే. ఎవరైనా ఆచారాలు పాటించకపోతే భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటాయి. స్వామివారి భక్తులు పరమ పవిత్రంగా భావించే తిరుమల క్షేత్రాన్ని రక్షించాల్సిన బాధ్యత అందరి మీదా ఉంది. సొంత మతాన్ని ఆచరించాలి... ఇతర మతాలను గౌరవించాలి’’ అని చంద్రబాబు అన్నారు.

‘‘గతంలో జగన్ నియమాలు ఉల్లంఘించి తిరుమలకు వెళ్ళారు. చాలా మంది అన్యమతస్తులు డిక్లరేషన్ ఇచ్చి గౌరవంగా స్వామివారి దర్శనం చేసుకున్నారు. అన్య మతాలను గౌరవించడం అంటే.. ఆయా ఆలయాల సంప్రదాయాలను పాటించడమే. బైబిల్‌ని నాలుగు గోడల మధ్యే ఎందుకు చదవాలి? చర్చికి వెళ్లి కూడా బైబిల్ చదవొచ్చు. జగన్ చెప్పిన అబద్ధాన్నే పదే పదే చెబుతున్నారు. నెయ్యి కల్తీ జరగలేదని అంటున్నారు. ఏఆర్ డెయిరీ ఎనిమిది ట్యాంకర్లు పంపింది.. అందులో నాలుగు ట్యాంకర్లు వాడారు. ఈ నివేదిక ఇచ్చింది ఎన్టీడీబీ.. మేము కాదు. ఈ నివేదిక దాస్తే మా ప్రభుత్వం తప్పు చేసినట్లే అవుతుంది. నెయ్యి కల్తీ జరగలేదని జగన్ ఎలా చెబుతున్నారు. గతంలో అడల్ట్రేషన్ పరీక్షకు తన ప్రభుత్వం ఎందుకు పంపలేదు? టెండర్లు పిలవటానికి నిబంధనలు ఎందుకు మార్చారో జగన్ చెప్పాలి. జగన్ హయాంలో నాసిరకం పదార్థాలతో స్వామివారి ప్రసాదాన్ని అపవిత్రం చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన రామతీర్థం, అంతర్వేది ఘటనల మీద  ఇప్పటి వరకు విచారణ జరపలేదు. జగన్ తాను క్రైస్తవుడిని అని ఒప్పుకున్న తర్వాత డిక్లరేషన్ ఇవ్వడానికి అభ్యంతరం ఏమిటి? జగన్ చెబుతున్న అబద్ధాలను ఖండికపోతే జనం అవే నిజాలు అనుకునే ప్రమాదం వుంది. తప్పు జరిగినప్పుడు బాధపడాలే తప్ప ఎదురుదాడి చేయకూడదు. స్వామి వారి విషయంలో చేసిన అపచారాలను నేను కప్పిపుచ్చాలా?’’ అని చంద్రబాబు అన్నారు.

‘‘జగన్‌ వెళ్ళాలనుకుంటేనే తిరుమలకు వెళ్ళొచ్చు. లేకపోతే లేదు. అన్య మతస్థులు ఎవరు తిరుమలకు డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. భక్తుల మనోభావాలు దెబ్బతీసే హక్కు జగన్‌కి ఎవరిచ్చారు? దళితులను ఆలయాల్లోకి రానీయడం లేదని జగన్‌కి ఎవరు చెప్పారు? ముఖ్యమంత్రిగా వుండగా చట్టాలను ఉల్లంఘించానని జగన్ ఎలా చెబుతారు? ముఖ్యమంత్రి స్థాయిలో వున్న వ్యక్తే మొదట చట్టాలను, సంప్రదాయాలను గౌరవించాలి. తిరుమల స్వామివారిని రాజకీయాలకు, వ్యాపారాలకు వాడుకోవడం జగన్ చేసిన పెద్ద తప్పు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల నియామకంలో జగన్ చేసింది అధికార దుర్వినియోగం. నెయ్యి కల్తీ విషయంలో బాధ్యులు అందరి మీదా చర్యలు వుంటాయి’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.