జగన్ బెయిలుకి ఉద్యమ కారణమే అడ్డుపడుతుందా

 

 

అక్రమాస్తుల కేసులో అరెస్టయిన వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి బెయిలు పిటిషను మరో మూడు రోజుల్లో కోర్టు ముందుకు రానున్న తరుణంలో, సీబీఐ కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించి వచ్చేనెల 3 వరకు అతని జ్యుడిషియల్ రిమాండ్‌ను పొడిగించింది. ఈసారి తప్పకుండా అతనికి బెయిలు దొరుకుతుందని అతని కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు దృడంగా నమ్ముతున్నారు.

 

ప్రస్తుతం సీబీఐ తుది చార్జ్ షీట్ కూడా వేయడం పూర్తయిపోయింది గనుక, ఇక అతనికి బెయిలు ఇవ్వడం అనివార్యం అవుతుందని అందరూ భావిస్తున్నారు. కానీ, సీబీఐ మాత్రం షరా మామూలుగానే అతనికి బెయిలు ఇస్తే తమ దర్యాప్తుకి ఆటంకం కలుగుతుందని వాదించడం విశేషం. తుది చార్జ్ షీట్లు కూడా వేసిన తరువాత సీబీఐ తన దర్యాప్తు కొనసాగుతుందని, జగన్మోహన్ రెడ్డికి బెయిలు ఇస్తే దానికి ఆటంకం కలుగుతుందని చెప్పడం చూస్తే, సీబీఐ ఈ కేసుని మరికొంత కాలం సాగదీసేందుకే నిశ్చయించుకొన్నట్లుగా భావించవలసి ఉంటుంది. మరి వైకాపా ఆరోపిస్తున్నట్లు ఒకవేళ ఇందులో కాంగ్రెస్ ప్రమేయం ఉండి ఉంటే, బహుశః డిల్లీ నుండి సీబీఐకి ఇంకా ఎటువంటి నిర్దిష్ట సూచనలు రాలేదని భావించవలసి ఉంటుంది.

 

జగన్మోహన్ రెడ్డి తన బెయిలు పిటిషనులో ప్రస్తుతం సమైక్యాంధ్ర కోసం తమ పార్టీ చేస్తున్న ఉద్యమాల గురించి పేర్కొని, పార్టీ అధ్యక్షుడిగా వాటిని ముందుండి నడిపించవలసిన బాధ్యత తనపై ఉంది గనుక తనకు బెయిలు మంజూరుచేయవలసిందిగాకోరడం బహుశః పెద్ద పొరపాటు అవుతుందేమో!

 

ఒకవేళ అతనికి కోర్టు బెయిలు మంజూరు చేసినట్లయితే, సమైక్యాంధ్ర ఉద్యమం మరింత తీవ్రతరమవుతుందని అర్ధం అవుతోంది. ఇప్పటికే ఈ ఉద్యమాలతో, ఉద్యోగుల సమ్మెతో తలబొప్పికట్టిపోయిన కాంగ్రెస్ అధిష్టానం, ఇప్పడు తనకి బెయిలు మంజూరు చేస్తే ఆ అగ్నికి ఆజ్యం పోస్తానని అతను స్పష్టంగా చెపుతున్నపుడు మరి కాంగ్రెస్ అధిష్టానం అందుకు మార్గం సుగమం చేస్తుందని అనుకోలేము. ఒకవేళ బెయిలు విషయంలో కాంగ్రెస్ ప్రమేయం ఏమీ లేదనుకొన్నాబహుశః కోర్టు కూడా బెయిలు నిరాకరించినా ఆశ్చర్యం లేదు. జగన్మోహన్ రెడ్డి తన బెయిలు దరఖాస్తులో ఈ కారణం పేర్కొని తప్పు చేసాడేమో?