జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీకి మళ్ళిస్తుంది ఎవరు?
posted on Oct 26, 2015 10:42AM
సార్వత్రిక ఎన్నికలలో రెండు తెలుగు రాష్ట్రాలలో, జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకొని పోవడంతో జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ బాధ వదిలిందనుకొన్నారు. కానీ నేటికీ కాంగ్రెస్ పార్టీ నక్షత్రకుడిలాగ జగన్ వెంటపడుతూనే ఉంది. అందుకు చాలా బలమయిన కారణం ఉంది.
ప్రజాభీష్టానికి విరుద్దంగా రాష్ట్ర విభజన చేసినందుకు ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయిన తరువాత నుండి రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి రాన్రాను చాలా దయనీయంగా మారుతోంది. కాంగ్రెస్ పార్టీని బ్రతికించుకోవడానికి ఎంతగా ప్రయాసపడుతున్నప్పటికీ దానిని ప్రజలు ఆదరించడం లేదు అసలు పట్టించుకోవడం లేదు. ఈమాట ఎవరో అనలేదు. మాజీ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. అగమ్యగోచరంగా తయారయిన పార్టీ పరిస్థితి చూసి ఇక విధిలేని పరిస్థితుల్లోనే కాంగ్రెస్ పార్టీని వీడి వైకాపాలో చేరుతున్నట్లు అయన తెలిపారంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్ధమవుతోంది.
అందుకే ఈ విధిలేని పరిస్థితుల్లో పార్టీని మళ్ళీ బ్రతికించుకోవడానికి కాంగ్రెస్ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి వెంటపడుతోంది. ఆయన అంగీకరిస్తే ప్రత్యేక హోదా కోసం వైకాపాతో కలిసి కాంగ్రెస్ పార్టీ పోరాడేందుకు సిద్దంగా ఉందని రాష్ట్ర కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ సింగ్, పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ప్రకటించారు.
ప్రస్తుతం వైకాపాలో మాజీ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చాలా ముఖ్యనాయకుడిగా ఎదిగారు కనుక ఆయన కూడా జగన్మోహన్ రెడ్డిని అందుకు ఒప్పించే ప్రయత్నం చేయవచ్చును. జగన్మోహన్ రెడ్డి మనసు మార్చి మళ్ళీ అతనిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడం కోసమే కాంగ్రెస్ అధిష్టానమే ఆయనని వైకాపాలోకి ప్రవేశపెట్టి ఉన్నా ఆశ్చర్యం లేదు. ఆయన వైకాపాలో చేరిన కొన్ని రోజులకే రాహుల్ గాంధీ అనంతపురం పర్యటన సందర్భంగా ప్రత్యేక హోదాపై పోరాటాలు చేయమని సూచించడం, వెంటనే జగన్ డిల్లీ వెళ్లి జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయడం..ఆ తరువాత దాని కోసం ఆయన వరుసపెట్టి చేస్తున్న దీక్షలు, బందులు ధర్నాలు, అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి కాంగ్రెస్, వైకపాలు రెండూ బాయ్ కాట్ చేయడం, ఇప్పుడు జగన్ తో కలిసి పనిచేస్తామని కాంగ్రెస్ చెపుతుండటం అన్నీ నిశితంగా గమనించినట్లయితే కాంగ్రెస్, వైకాపాలు మళ్ళీ దగ్గరయ్యే ప్రయత్నాలు ముమ్మురమయినట్లు స్పష్టం అవుతోంది.
బహుశః వైకాపాలో ఉన్న (కాంగ్రెస్ ప్రతినిధి?) బొత్స సత్యనారాయణ ముందు పార్టీలో పట్టు సాధించి, జగన్మోహన్ రెడ్డికి చేరువయ్యి మెల్లగా ఇప్పుడు ఆయనని కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళించే ప్రయత్నాలు చేస్తున్నారేమో? బహుశః రెండు పార్టీలను మళ్ళీ కలిపేందుకు ‘ప్రత్యేక హోదా అంశం’ ఒక మంచి అవకాశంగా కాంగ్రెస్ ఉపయోగించుకోవాలనుకొంటున్నట్లుంది. తెదేపా-బీజేపీల స్నేహం మరింత బలపదేవిధంగా గట్టిగా కృషి చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ప్రకటించడంతో ఇక బీజేపీతో పొత్తులు పెట్టుకోవాలనే జగన్ ఆశ అడియాస అయింది.
కనుక ఇదే అదునుగా ఆయనను తమ వైపు తిప్పుకొనేందుకు కాంగ్రెస్ అధిష్టానం పావులు కదపడం మొదలుపెట్టినట్లుంది. కాంగ్రెస్ చేస్తున్న ప్రతిపాదనలకు జగన్మోహన్ రెడ్డి అంగీకరిస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో వైకాపాను విలీనం చేసేసి, రాష్ట్ర పిసిసి అధ్యక్షుడుగా జగన్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అందుకోవచ్చును. దానివలన రాష్ట్రంలో అధికార తెదేపాను మరింత బలంగా డ్డీ కొనేందుకు జగన్మోహన్ రెడ్డికి బలమయిన కాంగ్రెస్ క్యాడర్ అందదండలు దొరుకుతాయి. అలాగే జీవచ్చవంలా మారిన కాంగ్రెస్ పార్టీకి పునర్జన్మ దక్కుతుంది. అంటే జగన్ నిర్ణయం పైనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉందని భావించవచ్చును. మరి జగన్ ఏమంటారో..కాదంటే బొత్స ఆయనని ఒప్పించగలరో లేదో వేచి చూడాల్సిందే.