ప్రత్యేక హోదా వస్తే నష్టపోయేదెవరు?

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ప్రతిపక్ష పార్టీలన్నీ ఉద్యమిస్తున్నాయి. కాంగ్రెస్, ప్రజా సంఘాలు, వామపక్షాల మద్దతుతో నటుడు శివాజీ ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారు. కానీ అందరి కంటే ఆలశ్యంగా రంగ ప్రవేశం చేసిన వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి “లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వస్తాను...ఎప్పుడు వచ్చేమన్నది కాదు పాయింటు...”అంటూ దూసుకుపోతున్నారు. మిగిలిన పార్టీలన్నీ కేంద్రప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నిస్తుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం కేవలం చంద్రబాబు నాయుడునే ప్రశ్నిస్తున్నారు...నిందిస్తున్నారు.

 

అయితే ప్రత్యేక హోదా ఇస్తామంటే చంద్రబాబు నాయుడు ఎందుకు కాదంటారు? ప్రత్యేక హోదా వస్తే ఆయనకి ఏమయినా నష్టం కలుగుతుందా? అని ఆలోచిస్తే జగన్ చేస్తున్న వాదనలు ఎంత అర్ధరహితమో అర్ధమవుతుంది. ఒకవేళ ప్రత్యేక హోదా మంజూరు అయితే దాని వలన ఆయనకే ఖ్యాతి, పూర్తి ప్రయోజనం దక్కుతాయి. కనుక ఆయన దాని కోసం గట్టిగా ప్రయత్నించడం లేదనే జగన్ వాదనలలో పసలేదు.

 

రాయలసీమ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు టి.జి. వెంకటేష్ దీనిపై చాలా ఆసక్తికరమయిన వ్యాఖ్య చేసారు. అదేమంటే ఒకవేళ కేంద్రప్రభుత్వం ప్రత్యేక హోదా మంజూరు చేసినట్లయితే వచ్చే ఎన్నికలలో వైకాపాతో సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు తుడిచిపెట్టుకొని పోతాయని అన్నారు. ఎందుకంటే ప్రత్యేక హోదా వస్తే చంద్రబాబు నాయుడుకి, తెదేపా, బీజేపీలకే ఆ క్రెడిట్ మొత్తం దక్కుతుంది. విభజన చట్టంలో పేర్కొన్న హామీలే కాకుండా అందులో పేర్కొనబడని ప్రత్యేక హోదా హామీని కూడా నెరవేర్చినందుకు ప్రజలు మళ్ళీ తెదేపా-బీజేపీలకే పట్టం కట్టవచ్చును.

 

ప్రత్యేక హోదా మంజూరయినట్లయితే ఏమవుతుంది? అంటే జగన్మోహన్ రెడ్డి చెపుతున్నట్లుగానే రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఆ తరువాత రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మెరుగవుతుంది. దాని వలన రాష్ట్రాభివృద్ధి వేగం పుంజుకొంటుంది. నిజానికి ఈ పనులన్నిటినీ కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే చేయగలరనే ఉద్దేశ్యంతోనే ప్రజలు తెదేపాకు ఓటేసి ఆయనకు అధికారం కట్టబెట్టారు. ఒకవేళ ప్రత్యేక హోదా రాకపోయినట్లయితే ఈ పనులన్నీ పూర్తిచేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు మరింత శ్రమపడాల్సి ఉంటుంది. కనుక ప్రత్యేక హోదా వస్తే తన పని మరింత తేలికవుతుందనే ఆయన కూడా ఆశపడుతుండవచ్చును. కనుక ఆయనకు ప్రత్యేక హోదా రావడం ఇష్టం లేదనే జగన్మోహన్ రెడ్డి వాదన అర్ధరహితమే. ఒకవేళ ప్రత్యేక హోదా వస్తే టి.జి. వెంకటేష్ చెప్పినట్లు నష్టపోయేది కాంగ్రెస్, వైకాపాలేనని స్పష్టం అవుతోంది.

 

మరి ఈ సంగతి ఆ రెండు పార్టీలకు తెలియదా? అంటే తెలుసనే భావించాలి. అయితే ప్రత్యేక హోదా కోసం అవి ఎందుకు పోరాడుతున్నాయి అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని ఇంచుమించుగా తేల్చి చెప్పింది కనుకనేనని భావించాల్సి ఉంటుంది. అందుకే సాధ్యం కాని ప్రత్యేక హోదా అంశాన్ని భుజానికెత్తుకొని ఆ రెండు పార్టీలు నిర్భయంగా పోరాడుతూ తద్వారా రాష్ట్రంలో ప్రజలను ఆకట్టుకొని తమ తమ పార్టీలను బలోపేతం చేసుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నాయని చెప్పవచ్చును. ఎలాగూ ప్రత్యేక హోదా రాదనే ధీమా ఉంది కనుక దాని కోసం పోరాడుతూ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుని, కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీని రాజకీయంగా ఇరుకున పెట్టి దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నాయి. ఒకవేళ మోడీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇచ్చినా తమ పోరాటాలకు తలొగ్గే ఇచ్చిందని చెప్పుకొనే వెసులుబాటు వాటికి ఉంటుంది.

 

ఎటువంటి అంశం చేప్పట్టినా కూడా దానికి సంబందించి నూటికి 95శాతం ‘హోం వర్క్’ పూర్తయ్యేవరకు బయటపెట్టే అలవాటులేని నరేంద్ర మోడీ, ఒకవేళ ప్రత్యేక హోదాపై చేస్తున్న కసరత్తు కూడా పూర్తవగానే సమయం చూసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు చేస్తున్నట్లు ప్రకటిస్తే, ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా రాదనే ధీమాతో పోరాటాలు చేస్తున్న ఆ రెండు పార్టీలు దెబ్బయిపోవడం ఖాయం.