వైకాపాకు నిరాశ మిగిల్చిన అమరావతి కార్యక్రమం
posted on Oct 24, 2015 9:59PM
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లుగా అమరావతి శంఖుస్థాపన కార్యక్రమం చంద్రబాబు నాయుడుకి ఆయన ప్రభుత్వానికి మరింత పేరు ప్రతిష్టలు తెచ్చిపెడితే, వైకాపాకి పైకి కనబడని కంకు దెబ్బలని మిగిల్చిపోయిందని చెప్పవచ్చును. రాష్ట్రానికి చెందిన ఈ అతి ముఖ్యమయిన కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి ‘బాయ్ కాట్’ చేయాలనుకోవడం అన్నిటికంటే పెద్ద తప్పు. దానిని బాయ్ కాట్ చేసి జగన్ విమర్శలు మూటగట్టుకొంటే, దానికి హాజరయ్యి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంద్ర ప్రజల చేత జేజేలు పలికించుకొని వెళ్ళారు. పైగా అమరావతి శిలాఫలకంపై ఆయన పేరు కూడా శాస్వితంగా నిలిచిపోతుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కూడా హాజరయి ఉండి ఉంటే ఆయన పేరు కూడా శిలాఫలకంలో చేర్చి ఉండేవారేమో? కనుక ఈ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేసి చాలా పెద్ద తప్పు చేసారని చెప్పవచ్చును.
జగన్మోహన్ రెడ్డికి నిరాశ కలిగించే విషయం మరొకటి కూడా ఉంది. అదేమిటంటే ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగంలో తెదేపా-బీజేపీల స్నేహం మరింత పటిష్టంగా కొనసాగించాలనే ఆకాంక్ష వెలిబుచ్చారు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా, ప్యాకేజి గురించి ఆయన ఎటువంటి హామీ ఇవ్వకపోయినా రాజధాని నిర్మాణానికి, రాష్ట్రాభివృద్ధికి అన్నివిధాల సహాయసహకారాలు అందిస్తానని మోడీ విస్పష్టంగా చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్యాకేజీ గురించి మాట్లాడకుండా నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రజలను ఎంతగా నిరాశపరిచారో, తెదేపాతో తమ స్నేహం కొనసాగుతుందని, చంద్రబాబు నాయుడుకి అన్నివిధాల అండగా ఉంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అంతకంటే ఎక్కువగానే నిరాశపరిచారు.
ఏదో ఒకనాడు తెదేపా-బీజేపీల మధ్య చెడితే అప్పుడు బీజేపీతో జత కట్టాలని జగన్మోహన్ రెడ్డి ఇంతకాలంగా చాలా ఓపికగా ఎదురు చూశారు. కానీ మోడీ చెప్పిన మాటలు విన్న తరువాత ఇప్పుడప్పుడే వైకాపాకు అటువంటి అవకాశం కలగదని జగన్మోహన్ రెడ్డి గ్రహించి ఉండాలి. ఆయన మాటలలో ఆ నిరాశ నిస్పృహలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. చంద్రబాబు నాయుడు తన కేసుల నుండి బయటపడేందుకే మోడీని ప్రత్యేక హోదా గురించి గట్టిగా నిలదీయలేదని ఆరోపిస్తున్నారు. కానీ ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని విమర్శించినట్లుగా ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించడానికి సాహసించడం లేదు. ఎందుకంటే సీబీఐ కేసుల భయంతోనేనని చెప్పవచ్చును.
జగన్మోహన్ రెడ్డి ఇంకా నిరాశ కలిగించే మరో విషయం ఏమిటంటే ఇంత కాలం బద్ధశత్రువులుగా ఉన్న చంద్రబాబు నాయుడు, కేసీఆర్ అకస్మాత్తుగా మిత్రులుగా మారిపోవడం. వారిరువురూ కలిసి పనిచేస్తూ రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ హితవు పలకడమే కాకుండా చివర్లో వారిరువురుతో కలిసి ప్రజలకు అభివాదం చేసారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు తనకు ఇచ్చిన అపూర్వమయిన గౌరవ మర్యాదలను చూసి కేసీఆర్ చాలా సంతోషించి ఉంటారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బహుశః అందుకే ఆయన తెలంగాణా విద్యుత్ సంస్థలలో నుండి తొలగించిన 1253 మంది ఆంధ్రా ఉద్యోగులను తక్షణమే విధుల్లోకి తీసుకొంటూ ఉత్తర్వులు జారీ చేసారు. ఒకవేళ ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య ఈ సఖ్యత ఇలాగే కొనసాగినట్లయితే తెలంగాణాలో కూడా వైకాపా ఒంటరిదయిపోతుంది. కనుక ప్రత్యామ్నాయంగా కనబడుతున్న కాంగ్రెస్ పార్టీతోనే మళ్ళీ చేతులు కలపడానికి జగన్మోహన్ రెడ్డి సిద్దపడతారేమో?
ఈ మొత్తం కార్యక్రమంలో వైకాపాకు కలిసివచ్చే అంశం ఒకే ఒక్కటి కనబడుతోంది. అదే... ప్రత్యేక హోదా, ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీపై ప్రధాని నరేంద్ర మోడీ ఎటువంటి ప్రకటన చేయకపోవడం. దానిని పట్టుకొని ఆయన చంద్రబాబు నాయుడుతో తన పోరాటాలని యధాప్రకారం కొనసాగించుకోవచ్చును.