వైకాపాకు శల్యసారధ్యం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి

 

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆరునెలలయినపట్టికీ ఇంకా పార్టీ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి. నిన్న ఒంగోలులో నిర్వహించిన పార్టీ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో నరేంద్ర మోడీ స్వయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నందునే తెదేపా గెలిచిందని, లేకుంటే గెలిచి ఉండేది కాదని అన్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి అధికారం సంపాదించుకొన్నారని, కానీ తను అందుకు ఇష్టపడకపోవడం వలననే ఎన్నికలలో ఓడిపోయామని చెప్పారు. వైకాపాకు కడప జిల్లాలో వచ్చినంత మెజార్టీయే తెదేపాకు యావత్ రాష్ట్రంలో వచ్చింది తప్ప పెద్దగా మెజార్టీ రాలేదని అన్నారు. తనకు అధికారం దక్కి ఉండి ఉంటే, రాష్ట్ర ప్రజలందరూ మరో ముప్పై ఏళ్లపాటు గుర్తుండేవిధంగా పరిపాలన సాగించాలని అనుకొన్నానని ఆయన అన్నారు.

 

నరేంద్ర మోడీ ప్రభావం చేతనే తెదేపా అధికారంలోకి రాగలిగిందనే ఆయన చెప్పడం చూస్తే ఆయనకు ఇంకా రాజకీయ పరిణతి కలగలేదని అర్ధమవుతోంది. దేశంలో మోడీ ప్రభంజనం వీస్తున్నప్పటికీ, ఆంద్ర, తెలంగాణాలలో మాత్రం ఆయన ప్రభావం లేదని అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తరువాత జరిగిన ఆ ఎన్నికలలో ఆంధ్రాలో కాంగ్రెస్ వ్యతిరేఖత, రాష్ట్రంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితులు కారణంగా మంచి రాజకీయ, పరిపాలనానుభావం ఉన్న చంద్రబాబు నాయుడి వైపే ప్రజలు మొగ్గు చూపడం వంటి అనేక కారణాల చేతనే తెదేపా అధికారంలోకి వచ్చిన సంగతి అందరికీ తెలుసు. అదేవిధంగా తెలంగాణా సెంటిమెంటు కారణంగా అక్కడా అయన ప్రభావం పనిచేయలేదని చెప్పవచ్చును.

 

అయితే కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలున్న నరేంద్రమోడీతో చంద్రబాబు చేతులు కలపడం, మోడీ తమ కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రానికి పూర్తి సహాయసహకారాలు అందజేస్తామని హామీ ఇవ్వడం, వారి కూటమికి అత్యంత ప్రజాధారణ గల పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడం వంటి అనేక అంశాలు తెదేపా విజయానికి కారణమయ్యాయని చెప్పక తప్పదు. ఇవికాక రాజధాని నిర్మాణం, పారిశ్రామిక అభివృద్ధి, రైతుల రుణమాఫీ వంటి అనేక అంశాలు కూడా తెదేపా విజయానికి తోడ్పడ్డాయి. కానీ ఇంత చిన్న విషయం కూడా గ్రహించలేని జగన్మోహన్ రెడ్డి మోడీ ప్రభావంతోనే రాష్ట్రంలో తెదేపా గెలవగాలిగిందని చెప్పడం నవ్వు తెప్పిస్తుంది. ఆయన వాదనే నిజమనుకొంటే మరి మోడీ ప్రభావంతో తెలంగాణాలో ఎందుకు గెలవలేకపోయింది? అనే ప్రశ్నకు ఆయనే జవాబు చెప్పవలసి ఉంటుంది.

 

ఇక చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని ఆయన చెప్పడం చూస్తే ఆయన ప్రజలకు ఏమాత్రం ఆలోచించే శక్తి లేనివారని, వారు ఎవరు ఏది చెపితే అధినంమేసే మూర్ఖులని అంటున్నట్లుంది. చంద్రబాబు తమను మోసం చేస్తున్నారని వారు భావించి ఉండిఉంటే వారు జగన్మోహన్ రెడ్డికే ఓటువేసి వైకాపాకే అధికారం కట్టబెట్టేవారు. కానీ వారు అతనిని నమ్మలేదు. అందుకే వైకపా ఓడిపోయింది. కర్ణుడి చావుకు వెయ్యి కారనాలున్నట్లే వైకాపా ఓటమికి కూడా వెయ్యి కారణాలున్నాయని అందరికీ తెలుసు. తమ అతివిశ్వాసమే తమ కొంప ముంచిందని జగన్మోహన్ రెడ్డే స్వయంగా శాసనసభలో ప్రకటించుకొన్నారు కూడా. వెయ్యి కారణాలలో అది కూడా ఒకటని ఆయనే స్వయంగా చెప్పుకొంటున్నప్పుడు, చంద్రబాబుని ఇంకా ఆడిపోసుకోవడం తన అసమర్ధతను, వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి తప్పితే దాని వలన పార్టీకి ఏమి ప్రయోజనం కలుగుతుంది? పార్టీని బలపరుచుకొనేందుకు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నప్పుడు, ఆయన పార్టీని ఏవిధంగా బలపరుచుకోవాలో తన నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తే ఏమయినా ప్రయోజనం ఉంటుంది. కానీ జరిగిన తప్పులని, చేసిన పొరపాట్లని కప్పిపుచ్చుకొనేందుకు చంద్రబాబుని, ప్రజలెన్నుకొన్న ప్రభుత్వాన్ని నిందిస్తూ కాలక్షేపం చేయడంతోనే పుణ్యకాలం కాస్త పూర్తయ్యేలా ఉంది. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డే స్వయంగా పగ్గాలు చేతబట్టుకొని తన పార్టీకి శల్య సారధ్యం చేస్తున్నప్పుడు తెదేపాకు అంతకంటే కావలసిందేముంటుంది?