రూ.లక్ష కోట్ల స్కాంకి జగన్ స్కెచ్! వైసీపీ ఎంపీ బినామీ కంపెనీకి సోలార్ ప్లాంట్?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిలిచిన మెగా సౌర విద్యుత్‌ ప్రాజెక్ట్‌ టెండరును జూన్ 17న ఏపీ హైకోర్టు రద్దు చేసింది. మళ్లీ టెండర్లు పిలవాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను మళ్లీ రూపొందించాలని ఆదేశించింది. అయితే తాజాగా జగన్ రెడ్డి సర్కార్ పిలిచిన సోలార్ పవర్ ప్లాంట్ టెండర్లకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. సోలార్ విద్యుత్ టెండర్లలో రూ.లక్ష కోట్ల కుంభకోణానికి సీఎం జగన్ తెరదీశారని టీడీపీ సంచలన ఆరోపణలు చేసింది. ఈ టెండర్లను హైకోర్టు కొట్టివేయడంతో భారీ కుంభకోణానికి అడ్డుకట్ట పడిందని  చెబుతోంది. పాత నిబంధనలు మొత్తం మార్చేసి తమకు కావలసినప్పుడు టెండర్‌ రేటు పెంచుకోవడానికి.. టెండర్‌ పొందిన కంపెనీల యాజమాన్యాలను మార్చుకునేందుకు వెసులుబాట్లు కల్పించారని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ఆరోపించారు. దీని కోసం కేంద్ర ప్రభుత్వ నిబంధనలు, చట్టాలను కూడా పక్కనపెట్టారని పట్టాభి విమర్శించారు.

30 ఏళ్ల పాటు సౌర విద్యుత్‌ కంపెనీల నుంచి కరెంటు కొనుగోలుకు అనుమతిస్తూ జీవోలు ఇచ్చారని పట్టాభి చెప్పారు. ఆరు వేల మెగావాట్ల సామర్థ్యానికి టెండర్లు పిలిచినా మరో 50 శాతం సామర్థ్యంతో అదనపు యూనిట్లు పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చేశారన్నారు. దీనివల్ల  సుమారు పది వేల మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలు భారం రాష్ట్రంపై పడనుందని తెలిపారు. ఈ విద్యుత్‌ కొనుగోలు కోసం రాష్ట్రం ఏటా కనీసం రూ.4 వేల కోట్లు చెల్లించాలి.. అంటే 30 ఏళ్లకు రూ.లక్షా ఇరవై వేల కోట్ల ప్రజా ధనం చెల్లించాల్సి ఉంటుందన్నారు. మిగిలిన రాష్ట్రాల్లో సౌర విద్యుత్‌ ధర యూనిట్‌ రూ.1.90కి పడిపోతే.. ఏపీలో మాత్రం  మాత్రం 60 నుంచి 70 పైసలు అదనంగా చెల్లించేలా టెండర్లు ఖరారు చేయడానికి పథకం రచించారని పట్టాభి ఆరోపించారు. 

సోలార్ కరెంట్ ఉత్పత్తిలో ఏ మాత్రం అనుభవం లేని కడప జిల్లాకు చెందిన షిర్డిసాయి ఎలక్ట్రికల్స్‌ కంపెనీ  వేల మెగావాట్ల మేర ఉత్పత్తి చేయడానికి బిడ్డర్‌గా ఎంపికైందని.. ఈ కంపెనీ కడప వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డికి బినామీ అని పట్టాభి తెలిపారు. టెండర్లు పిలిచిన కంపెనీకి  అసలు అర్హతే లేదన్నారు. టెండర్లు పిలిచిన సంస్థకు నిబంధనల ప్రకారం ట్రేడింగ్‌ లైసెన్స్‌, డిస్ట్రిబ్యూషన్‌ లైసెన్స్‌ ఉండాలని, కానీ ఈ టెండర్లను పిలిచిన గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌కు ఏ లైసెన్సూ లేదన్నారు. అప్పటికప్పుడు ఒక కార్పొరేషన్‌ పెట్టేసి దాని పేరుతో టెండర్లు పిలిచారంటేనే నిబంధనలను ఎలా తుంగలో తొక్కారో తెలుస్తోందన్నారు. టీడీపీ ప్రభుత్వం పునరుత్పాదక విద్యుత్‌ తయారీ కంపెనీలతో పాతికేళ్ల పాటు కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటే అది మహాపరాధంగా జగన్మోహన్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారని, ఇప్పుడు ఆయన మాత్రం ఏకంగా ఆ వ్యవధిని 30 ఏళ్లకు పెంచేశారని అన్నారు. హైకోర్టు ఈ టెండర్లను కొట్టేయడంతో ప్రభుత్వ పెద్దలంతా తేలు కుట్టిన దొంగల్లా మౌనంగా ఉన్నారని పట్టాభి ఎద్దేవా చేశారు. 

వ్యవసాయానికి 6,400 మెగావాట్ల విద్యుత్‌ అందించేందుకు ఉద్దేశించి... రాష్ట్రంలో పది సౌర విద్యుత్‌ ప్లాంట్లు/పార్కుల ఏర్పాటుకు ఏపీ గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఏపీజీఈఎల్‌) గతేడాది నవంబరు 31న టెండర్లను ఆహ్వానించింది. ఆ టెండర్‌లోని రిక్వెస్ట్‌ ఫర్‌ సెలెక్షన్‌(ఆర్‌ఎఫ్‌ఎస్‌), ముసాయిదా విద్యుత్‌ కొనుగోలు ఒప్పంద(పీపీఏ) నిబంధనలు.. కేంద్ర విద్యుత్‌ చట్టం-2003కి విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంటూ టాటా పవర్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ లిమిటెడ్‌(టీపీఆర్‌ఈఎల్‌) ఈ ఏడాది జనవరిలో హైకోర్టును ఆశ్రయించింది. టెండర్‌ను రద్దుచేసి తాజాగా పిలిచేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరింది. పిటిషనర్‌ సంస్థ తరఫున సీనియర్‌ న్యాయవాది డి.ప్రకాష్‌రెడ్డి, న్యాయవాది కిలారు నితిన్‌కృష్ణ వాదనలు వినిపిస్తూ.. కేంద్ర ఇంధనశాఖ 2017 ఆగస్టు 3న జారీచేసిన బిడ్డింగ్‌ మార్గదర్శకాలకు విరుద్ధంగా విద్యుత్‌ కొనుగోలు ఒప్పంద నిబంధనలు ఉన్నాయన్నారు. ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ)కి విద్యుత్‌ చట్టం-2003 కల్పించిన విచారణాధికార పరిధి హక్కులను ఆర్‌ఎఫ్‌ఎస్‌, పీపీఏలో తొలగించారన్నారు. దీంతో పీపీఏపై వివాదాలు తలెత్తితే.. ఏపీఈఆర్‌సీకి బదులు రాష్ట్ర ప్రభుత్వమే వాటిని పరిష్కరించేందుకు వీలుంటుందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న టెండరును రద్దు చేయాలని కోరారు.విద్యుత్‌ చట్టంలోని సెక్షన్‌ 63కి అనుగుణంగా తాజాగా బిడ్డింగ్‌ ప్రక్రియను చేపట్టేలా ఆదేశించాలని అభ్యర్థించారు.

ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ)శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. ఈ ప్రాజెక్ట్‌ రైతుల ప్రయోజనం కోసం తీసుకొచ్చిందన్నారు. టెండర్ల ప్రక్రియ ముగిశాక ప్రస్తుతం ఈ దశంలో వ్యాజ్యం దాఖలు చేయడం సరికాదన్నారు. ఇరువైపు వాదనలూ విన్న హైకోర్టు న్యాయమూర్తి జూన్ 17  తీర్పు వెల్లడించారు. బిడ్డింగ్‌ ప్రక్రియలో విజేతగా నిలిచిన కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవద్దని ఏపీ గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ను నిలువరిస్తూ.. ఈ ఏడాది జనవరి 7న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.