ఇద్దరూ పిచ్చ క్లారిటీతో ఉన్నారు.. ఏపీలో ఏం చేయబోతున్నారు?

సారేమో ప్రత్యేక హోదాపై ఏం చేయలేమంటున్నారు.  వారేమో అమరావతికి నిధులేమీ ఇవ్వలేదంటున్నారు. ఆ ఊసే లేదంటున్నారు. ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ బాగా పెరిగిందా? లవ్ యూ తప్ప అన్నీ చెప్పేసుకుంటన్నారా అనే డౌట్స్ వస్తున్నాయి. అదేం లేదని రాష్ట్రంలో వాదిస్తున్నారు. ఢిల్లీలో మాత్రం వేరే వినపడుతోంది. ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి లేటెస్ట్ స్టేట్ మెంట్ అదే సౌండ్ తో వచ్చింది. అటు ఢిల్లీలో రాజధానిపై అలాంటి సౌండే వస్తోంది. అందుకే అందరికీ అనుమానమొస్తుంది. వీరిద్దరి బందం బలపడుతుందా అని.

ప్రత్యేక హోదా అడగలేకపోతున్నాం. వారికి సంపూర్ణ మెజారిటీ ఉంది. దేవుడు కనికరిస్తే.. ఈ పరిస్ధితులు ఎప్పటికైనా మారితే ఏమన్నా జరగొచ్చు..పదే పదే అడగటం తప్ప ఏమీ చేయలేని పరిస్ధితి.. అంటూ జగన్మోహన్ రెడ్డి నిన్న భగవద్గీత వినిపించారు. ఇదే గీత దేవుడు గీసిన గీత అంటూ గెలిచిన వెంటనే ఢిల్లీలో వెళ్లి పెట్టిన ప్రెస్ మీట్లో నూ ఒక్క అక్షరం కూడా తేడా లేకుండా వినిపించారు. ఇక వదిలేశారనే అందరూ నిట్టూర్చారు. కాని తర్వాత కాలంలో అసెంబ్లీలో తీర్మానం..లేఖలు అంటూ ప్రత్యేక హోదాపై హడావుడి చేసినట్లు కనిపించారు. ఇప్పుడు మళ్లీ పిచ్చ క్లారిటీతో చెప్పేశారు. ఇప్పుడు మళ్లీ ఎందుకిలా చెప్పాల్సి వచ్చిందనే ప్రశ్న వస్తుంది. ఎందుకంటే ప్రత్యేకహోదాపై చేస్తున్నదేమీ లేదు.. అడుగుతున్నదేమీ లేదు.. అయినా దీనిపై వివరణ ఇచ్చారంటే..ఆ అంశాన్ని ఇక వదిలేశామని..మిమ్మల్ని ఇబ్బందిపెట్టేది లేదని కేంద్రానికి పరోక్షంగా చెప్పడానికే.

మరోవైపు ఒక వ్యక్తి ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా కేంద్ర హోంశాఖ తాము రాజధాని కోసం నిధులే ఇవ్వలేదని.. కేవలం వెయ్యి కోట్లు గుంటూరు,విజయవాడ అభివృద్ధికి మాత్రమే ఇచ్చామని సమాధానమిచ్చింది. వాస్తవానికి అమరావతికి నిధులు అంటూ స్వయంగా కేంద్ర బడ్జెట్ లోనే రాసి 1500 కోట్లు ఇచ్చారు. అది కూడా ఈ సమాధానపత్రంలో మెన్షన్ కూడా చేయలేదు. అమరావతి అనే పేరు కూడా రాలేదు. అంటే అమరావతి అనే విషయాన్ని వదిలేసినట్లు ఈ వ్యవహారంతో క్లారిటీ వచ్చేస్తోంది. దీంతో ఇద్దరూ ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారా.. అనే సందేహం కలుగుతోంది. మొన్నటికి మొన్న జగన్ అమిత్ షాతో భేటీ అయినప్పుడు.. తొలిసారిగా బహిరంగంగా మూడు రాజధానులపై సహకారం అందించాలని కోరినట్లు బహిరంగంగా చెప్పారు. అటు నుంచి ఏమీ కన్ ఫామ్ చేయనప్పటికీ...ఇటు నుంచి ఇంత ఓపెన్ గా చెప్పుకోవడం మాత్రం ఇదే. 

ఇప్పుడు లేటెస్టుగా సీఎం ప్రకటన చూస్తే... ఆ మీటింగు తర్వాత పరిణామాలకు కొనసాగింపే అనిపిస్తోంది. రేపో మాపో కేంద్రంలో చేరడానికి కూడా ఈ ప్రకటన చేసి ఉండొచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కేంద్ర మంత్రివర్గంలో చేరాలని కేంద్రం కోరినట్లు.. ప్రత్యేక హోదాపై ఏదైనా ప్రకటన చేస్తే చేరతామని జగన్ చెప్పినట్లు.. ఆ పార్టీని సమర్ధిస్తున్న ఓ వెబ్ పోర్టల్ లో స్టోరీ రాశారు. ఇప్పుడు సీఎం స్టేట్ మెంట్ ఆ ఆటంకాన్ని తొలగించుకోవడానికేనా అనిపిస్తోంది. ఎటూ ప్రత్యేక హోదా ఇప్పుడిచ్చే అవకాశం లేదు.. మరోవైపు రాష్ట్ర ప్రయోజనాలన్నీ నెరవేరాలంటే కేంద్రంలో చేరక తప్పదని రేపు చెబుతారా? రాజధాని వ్యవహారంలో కోర్టులు తప్ప తామేమీ చేయలేమని కేంద్రం కూడా తప్పించుకునే కార్యక్రమం కొనసాగిస్తుందా?ఏమో అదే జరగబోతుందనిపిస్తోంది.