విశాఖే రాజధాని.. జగన్ ప్రకటన కోర్టు ధిక్కరణేనా?

ఏపీ జగన్ రాజధాని విషయంలో చేసిన ప్రకటన వివాదాస్పదంగా మారింది. ముఖ్యమంత్రి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. మూడు రాజధానుల విషయం కోర్టు పరిధిలో ఉంది. రాజధాని అమరావతిని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

అయితే హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వకుండానే రాజధానుల అంశంపై అన్ని పిటిషన్లను కలిపి విచారిస్తామంటూ సుప్రీం కోర్టు పేర్కొంది. ఆ కేసు  మంగళవారం (జనవరి 31) విచారణకు రానుంది. ఈ పరిస్థితుల్లో  ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక వైపు రాజధాని అంశంపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుండగా, సీఎం జగన్ ఏపీ రాజధాని విశాఖనే అని ప్రకటించేశారు. త్వరలో అక్కడి నుంచే తాను పాలన సాగించనున్నట్లు చెప్పారు. ఢిల్లీలో జరిగిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు సన్నాహక సమావేశంలో ఆయన ఏపీ రాజధాని విశాఖపట్నమే అంటూ చేసిన ప్రకటన కోర్టు ధిక్కారం కిందకే వస్తుందని విపక్షాలే కాదు.. న్యాయ నిపుణులు కూడా అంటున్నారు.

ఏపీ మూడు రాజధానుల అంశం కోర్టు విచారణలో ఉండగా జగన్ ఈ విధమైన ప్రకటన చేయడం కోర్టు ధిక్కారమేనని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఏపీకి విశాఖపట్నమే ఏకైక రాజధాని అని ప్రకటించిన జగన్.. పెట్టుబడిదారులను విశాఖకు రావల్సిందిగా కోరారు.  వచ్చే నెలలో విశాఖ వేదికగా నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సుకు పెట్టుబడి దారులను ఆహ్వానించేందుకు హస్తినలో మంగళవారం (జనవరి 30) జరిగిన సదస్సులో జగన్ ప్రసంగించారు.  ఆ ప్రసంగంలోనే ఆయన రాజధాని విశాఖేనని ప్రకటించేశారు.  రాజధానిని మార్చే అధికారం ఏపీ ప్రభుత్వానికి లేదని ఇప్పటికే హైకోర్టు తేల్చి చెప్పింది.  

దీనిపై జగన్ సర్కార్ సుప్రీం కోర్టుకు సుప్రీంకోర్టు కూడా స్టే ఇవ్వలేదు. అంటే ప్రస్తుతం రాజధాని అమరావతి. అమరావతిని మార్చే అధికారం ప్రభుత్వానికి లేదు.  అయితే జగన్ తాను   విశాఖ వెళ్లబోతున్నానని.. అదే రాజధాని అని ప్రకటించారు. ఇది  కచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. న్యాయ నిపుణులు కూడా జగన్ వ్యాఖ్యలు కచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని అంటున్నారు. దీనిపై ప్రముఖ న్యాయవాది శ్రవణ్  ఇప్పటి వరకూ మూడు రాజధానుల పేరుతో జగన్ ప్రజల్ని మోసం చేసిన జగన్ ఇప్పుడు.  విశాఖ ఏకైక రాజధాని అని ప్రకటించడం ద్వారా ఇన్వెస్టర్ లను కూడా మోసం చేయడానికి సిద్ధమయ్యారని అన్నారు. ఏది ఏమైనా జగన్ ప్రకటన కచ్చితంగా సబ్ జ్యుడిస్ అవుతుందని, ఈ విషయాన్ని పిటిషనర్లు సుప్రీం కోర్టు దృష్టికి తీసుకుళ్లాలని ఆయన అన్నారు.

రాజధాని అంశంపై సుప్రీం కోర్టులో మంగళవారం విచారణ జరగనున్న నేపథ్యంలో జగన్ ప్రకటన సంచలనంగా మారింది.  ఢిల్లీ సమావేశంలో జగన్ ఇంకా చాలా విషయాలు చెప్పారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే వారికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని సదుపాయాలూ కల్పిస్తుందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ గత మూడేళ్లుగా అగ్రస్థానంలో ఉందన్నారు. కానీ అవేవీ ఎవరి దృష్టినీ ఆకర్షించలేదు. అసలు ఎవరూ పట్టించుకోవడం లేదు. విశాఖపట్నమే రాజధాని అంటూ అయన చెప్పిన మాటలపై మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.