అందరి చూపు నిర్మలమ్మ బడ్జెట్ వైపు

పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాలు మొదలయ్యాయి. పార్లమెంట్‌ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తొలి ప్రసంగం చేశారు. రాష్ట్రపతి పదవిని అలంకరించిన తొలి గిరిజన మహిళ ద్రౌపదీ ముర్ము, పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన తొలి ప్రసంగం  రాజ్యాంగ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచి పోతుందని, ముఖ్యంగా మహిళకు ఏంతో గర్వ కారణంగా నిలిచి పోతుందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.

పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు  మీడియాతో క్లుప్తంగా మాట్లాడిన   మోడీ  ఈరోజు వెలువడిన ఐఎంఎఫ్ తాజా నివేదికను పరోక్షంగా ప్రస్తావిస్తూ  పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభానికి ముందే విశ్వనీయ వర్గాల నుంచి  భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి సానుకూల సందేశాలు అందాయని సంతోషం వ్యక్తపరిచారు. అలాగే, ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ అందరూ మెచ్చే, అందరి ఆకాంక్షలను నెరవేర్చే బడ్జెట్ రూపొందించారని భావిస్తున్నానని, సిటిజెన్ ఫస్ట్  విధానాన్ని ముందుకు తీసుకుపోతామని అన్నారు.  

కాగా బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా 2022-23 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ,పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తోలి రోజు   మంగళవారం(జనవరి 31) లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పార్లమెంట్‌ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగం పూర్తయిన తర్వాత ఆమె ఆర్థిక సర్వేను సమర్పించారు. ఆర్థిక సర్వే సమర్పణ అనంతరం లోక్‌సభను బుధవారం (ఫిబ్రవరి 1) కి వాయిదా వేశారు. అంతకుముందు పార్లమెంట్‌లో దివంగత ఎంపీలు, మాజీ సభ్యులకు నివాళులర్పించారు. కేంద్ర బడ్జెట్‌ సమర్పణకు ముందు గత ఏడాదికి సంబంధించిన ఆర్థిక సర్వేను పార్లమెంట్‌ ఉభయసభల ముందు ప్రవేశపెట్టడం ఆనవాయితీ.  ప్రధాన ఆర్థిక సలహాదారు నేతృత్వంలోని బృందం ఈ ఆర్థిక సర్వేను రూపొందించింది. గతేడాది పలు రంగాల ఆర్థిక స్థితిగతులను ఇందులో వివరించారు. దీంతో పాటు ఆర్థిక వృద్ధికి చేపట్టాల్సిన సంస్కరణలను పేర్కొన్నారు. కాగా, 2023-24 కేంద్ర బడ్జెట్‌ ను నిర్మలా సీతారామన్‌ బుధవారం పార్లమెంట్‌ ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్నారు.

అదలా ఉంటే, కేంద్ర ప్రభుత్వం  బుధవారం(జనవరి 31 ) 2023-24 వార్షిక బడ్జెట్‌  ప్రవేశపెట్టనున్న తరుణంలో  అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)  భారత వృద్ధిరేటుకు సంబంధించి కీలక అంచనాలను వెల్లడించింది. ఈ ఆర్థిక ఏడాది దేశ జీడీపీ (జీడీపీ) వృద్ధిరేటు 6.8 శాతంగా నమోదవుతుందని తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి అది 6.1 శాతానికి పరిమితమవుతుందని అంచనా వేసింది. ప్రపంచ ఆర్థిక ఔట్‌లుక్‌కు సంబంధించిన జనవరి అప్‌డేట్‌ను ఐఎంఎఫ్‌  విడుదల చేసింది.

మరోవైపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ఈ ఏడాది 3.4 శాతంగా నమోదవుతుందని అంచనా వేసింది. వచ్చే సంవత్సరానికి అది 2.9 శాతానికి చేరుతుందని తెలిపింది.ఈ ఏడాది భారత వృద్ధి నెమ్మదించడానికి బాహ్య పరిణామాలే కారణమని ఐఎంఎఫ్‌ పేర్కొంది. ఆసియాలోని వర్ధమాన దేశాల వృద్ధిరేటు 5.3 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. చైనా ఆర్థిక వ్యవస్థలో కుదుపుల వల్ల 2022లో అది 4.3 శాతానికే పరిమితమైనట్లు గుర్తు చేసింది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ది ప్రకాశవంతమైన స్థానమని ఐఎంఎఫ్‌ తెలిపింది. ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వృద్ధిలో సగం వాటా భారత్‌, చైనాలదేనని వెల్లడించింది. అదే అమెరికా, యూరోప్  కలిసి కేవలం 10 శాతం మాత్రమే ప్రపంచ ఆర్థిక వృద్ధికి దోహదం చేయనున్నట్లు పేర్కొంది. అభివృద్ధి చెందిన దేశాల్లో మందగమనం మరింత తీవ్రంగా ఉంటుందని తెలిపింది. ఈ దేశాల్లో జీడీపీ వృద్ధిరేటు 1.2 శాతానికే పరిమితమవుతుందని అంచనా వేసింది.

అన్నిటికీ మించి  ఐఎంఎఫ్ తీపి  భారత్‌లో ద్రవ్యోల్బణం వచ్చే మార్చితో ముగియనున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5 శాతానికి తగ్గుతుందని తీపి కబురు చెప్పింది. వచ్చే ఏడాది అది మరింత తగ్గి 4 శాతంగా నమోదవుతుందని తెలిపింది. మరోవైపు ప్రపంచ ద్రవ్యోల్బణం ఈ ఏడాది 6.6 శాతంగా, వచ్చే ఏడాది 4.3 శాతానికి తగ్గుతుందని పేర్కొంది. ఇక ఇప్పుడు   ఆర్థిక మంత్రి నిర్మలా సీతరామన్ ప్రవేశ పెట్టానున్న, 2023 – 2024 వార్షిక బడ్జెట్ వైపు అందరి చూపూ కేద్రీక్రుతమైంది. ప్రధాని మోడీ సంకేత మాత్రంగా చెప్పిన విధంగా, నిర్మలమ్మ అందరి అందరి ఆకాంక్షలను నెరవేరుస్తారా లేదా .. చూడవలసి వుంది.