రాష్ట్రంలో శాంతి భద్రతల విఘాతానికి జగన్ దుష్టపన్నాగం?

ఏపీకి మంచిరోజులొచ్చాయి. అభివృద్ధి ప‌థంలో దూసుకెళ్లేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం సిద్ధ‌మైంది. చంద్ర‌బాబు నాయుడు సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన వెంట‌నే రాష్ట్ర అభివృద్ధిపై దృష్టిసారించారు. రాష్ట్రానికి జీవ‌నాడి అయిన పోల‌వ‌రం ప్రాజెక్టును ప‌రుగులు పెట్టించేందుకు కార్యాచ‌ర‌ణ సిద్ధం చేస్తున్నారు. మ‌రోవైపు రాజ‌ధాని  అమ‌రావ‌తి నిర్మాణ ప‌నుల్లోనూ వేగం పెర‌గ‌నుంది. ఇప్ప‌టికే పోల‌వ‌రం ప్రాజెక్టు, అమ‌రావ‌తి ప్రాంతాల‌ను చంద్ర‌బాబు నాయుడు ప‌రిశీలించారు. ఐదేళ్ల కాలంలో అక్క‌డ జ‌రిగిన విధ్వంసాన్ని ఆక‌ళింపు చేసుకున్నారు. రెండు ప్రాంతాల్లోనూ ప‌నులు వేగంగా జ‌రిగేలా కీల‌క అధికారుల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. గ‌డిచిన ఐదేళ్ల‌కాలంలో అభివృద్ధి ఆనవాళ్లను కూడా చెరిపేసేలా సాగిన జగన్ పాలన చూసిన ఏపీ ప్ర‌జ‌లు.. చంద్ర‌బాబు దూకుడుగా అభివృద్ధి ప‌నుల‌కు శ్రీ‌కారం చుడుతుండ‌టంతో సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రోవైపు ఐదేళ్లుగా జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి అరాచ‌క పాల‌న‌తో ఇబ్బందులు ఎదుర్కొన్న తెలుగుదేశం, జ‌న‌సేన నేత‌లు, కార్య‌క‌ర్త‌లు బ‌దులు తీర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎన్నిక‌ల్లో గెలిచిన వెంట‌నే ఆ మేర‌కు రెండు పార్టీల కార్య‌క‌ర్త‌లు ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ సూచ‌న‌ల‌తో సంయమనం పాటిస్తున్నారు.

కూట‌మి ప్రభుత్వం భారీ మెజార్టీతో అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే తెలుగుదేశం, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల ఆగ్ర‌హాన్ని ప‌సిగ‌ట్టిన చంద్ర‌బాబు, ప‌వ‌న్ వారికి హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ఎవ‌రూ తొంద‌ర‌ప‌డొద్దు.. వైసీపీ నేత‌ల‌పై దాడుల‌కు పాల్ప‌డ‌వ‌ద్ద‌ని గ‌ట్టిగానే చెప్పారు. దీంతో ఏపీలో ఎలాంటి క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు ఆ పార్టీల కార్య‌క‌ర్త‌లు దిగ‌లేదు. ఒక‌టి రెండు చోట్ల వైసీపీ నేత‌లు క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు దిగ‌డంతో ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం నెలకొంది. ఒక‌టిరెండు చోట్ల త‌లెత్తిన ఘ‌ర్ష‌ణ‌లకే వైసీపీ నేత‌లు పెద్ద రాద్దాంతం చేశారు. ఏపీలో బీహార్ త‌ర‌హా పాల‌న మొద‌లైందంటూ ఆ పార్టీకి చెందిన కీల‌క నేత‌లు గ‌వ‌ర్న‌ర్ కు విన‌తిప‌త్రాలు ఇచ్చి దొంగే.. దొంగ దొంగ అని అరిచిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించారు. చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట‌ను జ‌వ‌దాట‌ని ఇరు పార్టీల నేత‌లు, కార్య‌క‌ర్త‌లు వైసీపీ నేత‌ల‌పై ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు దిగలేదు. దీంతో రాష్ట్రంలో ప్ర‌శాంత వాతావ‌ర‌ణం నెల‌కొన‌డంతో పాటు.. చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలో అభివృద్ధి ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయి. ప్ర‌జ‌లుసైతం కూట‌మిని భారీ మెజార్టీతో గెలిపించినందుకు సంతోషంగా ఉన్నారు. 

ఏపీలో ప‌రిణామాలు వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి  బొత్తిగా న‌చ్చ‌లేద‌ట‌. ప‌బ్జీ గేమ్‌కు అల‌వాటుప‌డిన జ‌గ‌న్‌.. ఎలాగైనా రాష్ట్రంలో గొడ‌వ‌లు జ‌రిగేలా చూడాల‌ని ఆ పార్టీలోని కొంద‌రు నేత‌ల‌కు టాస్క్ ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం సృష్టించ‌డం ద్వారా ఆ ప‌రిణామాల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవాల‌న్నది జ‌గ‌న్ వ్యూహమని వైసీపీ నేతలే అంటున్నారు.   వాస్త‌వానికి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హ‌యాంలో ఏపీలో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌పై దాడుల‌కు పాల్ప‌డ‌టం, అక్ర‌మ కేసులు బ‌నాయించి జైళ్ల‌కు పంప‌డ‌మే ప‌నిగా వైసీపీ ప్ర‌భుత్వం ఐదేళ్ల పాల‌న సాగింది. కేవ‌లం వైసీపీ సానుభూతిప‌రుల‌కు మాత్ర‌మే ప‌థ‌కాల పేరుతో నెల‌నెలా డ‌బ్బులు జ‌మ చేస్తూ వ‌చ్చారు. రాష్ట్ర  అభివృద్ధిని పూర్తిగా ప‌క్క‌న‌పెట్టేశారు. పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు చేప‌ట్ట‌లేదు. అమ‌రావ‌తి రాజ‌ధానిని నిర్వీర్యం చేసే ప్ర‌య‌త్నం చేశారు. ప్ర‌జావ్య‌తిరేక పాల‌న‌ను ప్ర‌శ్నించిన వారిపై  వైసీపీ గూండాలు దాడులకు తెగ‌బ‌డ్డారు. ఇవ‌న్నీ జీర్ణించుకోలేని ప్ర‌జ‌లు ఓటు ద్వారా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి గ‌ట్టి గుణ‌పాఠం చెప్పారు. కేవ‌లం 11 సీట్లే ఇచ్చి అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష హోదాసైతం లేకుండా చేశారు.


కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత సీఎం చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలో రాష్ట్రంలో ప్ర‌శాంత వాతావ‌ర‌ణం నెల‌కొంది. అభివృద్ధి ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. నేష‌న‌ల్ మీడియాసైతం ఏపీలో చంద్ర‌బాబు పాల‌న‌పై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపిస్తోంది. వీట‌న్నింటికి చెక్ పెట్టాలంటే రాష్ట్రంలో గొడ‌వ‌లు సృష్టించ‌డం ఒక్క‌టే ఆయుధం అని జ‌గ‌న్ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో వైసీపీ హ‌యాంలో చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ పై బూతుపురాణంతో రెచ్చిపోయిన కొడాలి నాని, పేర్ని నాని, అంబ‌టి రాంబాబు, జోగి ర‌మేష్‌, ఆర్కే రోజా, అనిల్ కుమార్ యాద‌వ్ ల‌ను  జ‌గ‌న్ మ‌రోసారి రంగంలోకి దింప‌బోతున్నార‌ట‌. వీరి పేర్లు వినిపిస్తేనే ప్ర‌స్తుతం తెలుగుదేశం, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు మండిప‌డుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో వీరు మీడియా ముందుకొచ్చి చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ పై ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడ‌టం ద్వారా  తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు ఆగ్ర‌హానికిలోనై దాడుల‌కు పాల్ప‌డ‌తార‌ని, రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం ఏర్ప‌డుతుంద‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. ఆ ప‌రిణామాల‌ను అవ‌కాశంగా మార్చుకొని వైసీపీ నేత‌ల‌పై దాడుల‌కు పాల్ప‌డుతున్నార‌ని జాతీయ స్థాయిలో ప్ర‌చారం చేసేలా వైసీపీ అధిష్టానం ప్రణాళిక సిద్ధం చేసింది.  దానినే సాకుగా తీసుకుని గాయ‌ప‌డిన వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌ను ప‌రామ‌ర్శించే నెపంతో రాష్ట్రంలో ప‌ర్య‌టించాల‌ని జ‌గ‌న్  ప్రణాళిక సిద్ధం చేసుకున్నారన్న ప్రచారం  వైసీపీ వ‌ర్గాల్లో   జ‌రుగుతోంది. త‌ద్వారా తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం చేప‌ట్టే అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కంటే.. రాష్ట్రంలో ఘ‌ర్ష‌ణ‌ల‌ను హైలెట్ చేస్తూ ప్ర‌జ‌ల్లో మ‌రోసారి సానుభూతి పొందాలన్నదే జ‌గ‌న్ ప్లాన్ గా క‌నిపిస్తున్నది. మ‌రి జ‌గ‌న్ ప్లాన్ కు చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏ మేర‌కు చెక్ పెడ‌తారో చూడాల్సి ఉంది.