ఆ 27 మందీ అవుట్? జగన్ పై ఇక తిరుగుబాటేనా?!

‘ఎమ్మెల్యేలూ మీ తీరు మారాల్సిందే.. నాతో కలిసి పనిచేయాల్సిందే.. లేదంటే కష్టమబ్బా. నో మొఖమాటమ్స్’ అంటూ జగన్ ఎమ్మెల్యేలకు హాట్ వార్నింగ్ ఇచ్చారు. పనితీరు బాగాలేదని 27 మందిని మరింత ఘాటుగా హెచ్చరించారు. ‘గడప గడపకూ మన ప్రభుత్వం’పై తాడేపల్లిలో తాజాగా నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్ మంత్రులు, పార్టీ సమన్వయకర్తలను ఉద్దేశించి సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. పనితీరు మార్చుకోకపోతే టికెట్లు ఇచ్చేది లేదంటూ ఖరాఖండీగా చెప్పేశారు. రెండు నెలలే గడువిస్తున్నాననీ హెచ్చరించారు. ఎన్నికలకు ఆర్నెల్ల ముందే సీటు ఇవ్వని వారి పేర్లు ప్రకటిస్తానని జగన్ విస్పష్టంగా చెప్పేశారు.

‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో వెనకబడిన 27 మంది ఎమ్మెల్యేలను జగన్ తీవ్రంగా మందలించారు. ప్రజల వద్దకు వెళ్లి, వారి సమస్యలు తెలుసుకుని, సత్వర పరిష్కారం చేయాల్సిన ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేయొద్దని జగన్ ప్రజాప్రతినిధులను గట్టిగా హెచ్చరించారు. వారంలో నాలుగు రోజుల చొప్పున, నెలకు 16 రోజులు కూడా తిరగకపోతే ఎలా అని ఆ 27 మంది ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుకు గంటో రెండు గంటలో కాదనీ, ఏడు నుంచి ఎనిమిది గంటలు గ్రామాల్లో తిరగాలన్నారు. అదే గ్రామంలో పార్టీ నేతల ఇళ్లల్లో భోజనాలు చేయాలని, ప్రతి గడపకూ కచ్చితంగా సమయం కేటాయించాలని జగన్ ఆదేశించారు.  డిసెంబరులో మళ్లీ సమీక్ష నిర్వహిస్తానని, అప్పటిలోగా అందరూ బాగా తిరగాలన్నారు. పని తీరు మెరుగుపరుచుకోవాలని ఆదేశించారు. ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులను గడపగడపలో తిప్పొద్దనీ, తామే స్వయంగా వెళ్లాలని, సమస్యల్ని గుర్తించి తక్షణమే పరిష్కరించాలని జగన్ ఆదేశించారు. కేటాయించిన నిధులను వినియోగించుకోవాలని సూచించారు.

పనితీరు సరిగ్గా లేని వారిపై వేటు తప్పదని పార్టీ అధినేత జగన్ చేసిన హెచ్చరికలు ఎమ్మెల్యేల్లో కలవరం రేపుతున్నాయి. గడప గడపకు.. గత సమీక్ష కంటే ఇప్పుడు ఫలితం మెరుగ్గా ఉందని, మరికొందరు తీరు మార్చుకోవాలని సూచించినట్లు సమాచారం. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్  సదస్సులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో క్షేత్రస్థాయిలో ప్రతి గడప వద్దకు ఎమ్మెల్యేలు వెళ్లాలని ఆయన సూచించారు. సీఎం జగన్ ఇచ్చిన పిలుపును 27 మంది ఎమ్మెల్యేలు పెద్దగా పట్టించుకోలేదు. వచ్చే డిసెంబరు నాటికి వారి పనితీరు మారకపోతే చర్యలు తప్పవని సీఎం చేసిన హెచ్చరికలతో ఎమ్మెల్యేల్లో ఆందోళన మొదలైంది.

అదలా ఉంచితే.. తాడేపల్లిలో సమావేశం ముగిసిన తర్వాత బయటకు వచ్చిన ఎమ్మెల్యేలు జగన్ పై సెటైర్లు వేసుకున్నారు. ‘మీతో పాటు పనిచేయాలంటే మేం కూడా బటన్ నొక్కాల్సిందే. మా దగ్గర నొక్కడానికి బటన్స్ లేవుగా’ అని జోకులు వేసుకున్నారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. ‘ప్రజాసమస్యల పరిష్కారానికి నిధులు ఇవ్వకుండా తిరగమంటే ఎలా.. ఇలాగైతే కష్టమే బ్రదర్’ అంటూ అక్కడ నుండి ఎమ్మెల్యేలు వ్యాఖ్యలు చేయడంతో జగన్ పై వారిలో తిరుగుబాటు మొదలైనట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇక జగన్ ఆగ్రహానికి గురైనా ఆ 27 మందీ  జగన్ పై తిరుగుబాటుకు రంగం సిద్ధం చేస్తున్నారనీ, త్వరలోనే తిరుగుబాటు దెబ్బ జగన్ కు రుచిచూపేందుకు పావులు కదుపుతున్నారనీ ఆయా ఎమ్మెల్యేల సహచరులు, సన్నిహితులు అంటున్నారు.